సులువుగా దోచేస్తున్న సైబర్‌ నేరగాళ్లు!

పోలీసులు, ప్రభుత్వాలు సైబర్ నేరాలపై ఎంత అవగాహన కల్పిస్తున్న కూడా ఈజీ మనీ అనే మాయలో పడి చదువు రాని వారి కంటే చదువుకున్నవారే ఎక్కువగా మోసపోతున్నారు. తాజాగా హైదరాబాదులో ఒక్క రోజులోనే మూడు…

పోలీసులు, ప్రభుత్వాలు సైబర్ నేరాలపై ఎంత అవగాహన కల్పిస్తున్న కూడా ఈజీ మనీ అనే మాయలో పడి చదువు రాని వారి కంటే చదువుకున్నవారే ఎక్కువగా మోసపోతున్నారు. తాజాగా హైదరాబాదులో ఒక్క రోజులోనే మూడు ఘటనల్లో దాదాపు రూ.1.7 కోట్లు సైబ‌ర్ నేరగాళ్ల ఊచ్చులో ప‌డి బాధితులు మోస‌పోయారు. 

హైద‌రాబాద్ సిటీ సైబ‌ర్ క్రైం ఏసీపీ చెప్పిన వివ‌రాలు ప్ర‌కారం.. న‌గ‌రానికి చెందిన ఓ యువ‌కుడికి సైబ‌ర్ నేర‌గాళ్లు ఫోన్ చేసి మీరు కారు గెలుచుకున్నారు. మార్కెట్లో దాని విలువ రూ.10 ల‌క్ష‌లు ఉంది.. అది మీ ఇంటికి రావాలంటే కొన్ని ఫార్మ‌లిటీస్ పూర్తి చేయాలనీ.. ఆర్టీఏ రూల్స్, ట్యాక్స్లు, ఇన్సురెన్స్‌లు అంటూ మ‌యా మాట‌లు చెప్పి కారు కంటే ఎక్కువ‌గా దాదాపు రూ. 36 ల‌క్ష‌లు దోచుకున్నారు.

రెండో ఘ‌ట‌న‌లో యూట్యూబ్‌లో తాము పోస్ట్ చేసే వీడియోల‌కు లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తే క‌మిష‌న్ ఇస్తామ‌న్నారు. ముందుగా రెండు రోజుల‌ పాటు అనుకున్న దానికంటే ఎక్కువ‌గా డ‌బ్బులు ఇచ్చారు. త‌ర్వాత త‌ము చెప్పే వెబ్‌సైట్‌లో ఇన్వెస్ట్ చేయ‌మ‌ని స‌ల‌హా ఇచ్చారు. ముందుగా రూ. 10ల‌క్ష‌లు పెట్టుబ‌డి పెట్ట‌గా రూపాయి కూడా లాభం ఇవ్వ‌క‌పోగా.. ఆ రూ. 10ల‌క్ష‌లు రావాలంటే టాస్క్లు పూర్తి చేయాల‌ని చెప్పి దాదాపు రూ. 53 ల‌క్ష‌లు దోచేశారు.

ఇంకో ఘటనలో.. సిటీపరిధిలోని ఓ ట్రాఫిక్ ఏఎస్సై సోదరుడినే సైబర్ నేరగాళ్లు మోసగించారు. ఏఎస్సై సోద‌రుడితో ప‌రిచ‌యం చేసుకున్న సైబ‌ర్ నేర‌గాళ్లు ముందుగా బిట్‌కాయిన్స్ కొనాలని, కొన్ని వెబ్సైట్లలో ఇన్వెస్ట్ చేయాలని సూచించారు. తొలిరోజుల్లో లాభాలు రావడంతో బంధువులకు కూడా చెప్పి ఆనందాన్ని పంచుకున్నాడు. ఆ తర్వాత ఇంట్లో బంగారం తాకట్టు పెట్టి, అప్పులు తెచ్చి మరీ బిట్‌కాయిన్స్‌పై ఇన్వెస్ట్ చేశాడు. ఇలా పలు దఫాలుగా రూ.18 లక్షలు కోల్పోయాడు. తీరా తన సోదరుడికి న్యాయం చేయాలంటూ ఆ ట్రాఫిక్ ఎఎస్సై సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు.

ఇలా పోలీసుల వ‌ర‌కు వ‌చ్చే కేసులు కొన్ని అయితే అన్నీ తెలిసి మోస‌పోయి బ‌య‌ట‌కు తెలిస్తే త‌మ మ‌ర్యాద పోతుందని చెప్పుకోలేని బాధితులు కూడా కోకొల్లలుగా ఉంటున్నారు. ఈజీ మనీ అనే మాయ‌లో ప‌డి తాము క‌ష్ట‌ప‌డి సంపాదించుకున్న డ‌బ్బులు మొత్తం సైబ‌ర్ నేర‌గాళ్ల‌కు అర్పిస్తున్నారు.