తొలిసారి కావచ్చు..సినిమా ఫ్యాన్స్ అందరినీ అలారమ్ పెట్టుకుని మరీ లేచేలా చేసాడు దర్శకుడు ప్రశాంత్ నీల్ తన సలార్ సినిమా టీజర్ ప్రకటనతో. ఎర్లీ అవర్స్ లో టీజర్ విడుదల ఇదే తొలిసారి కావచ్చు. కానీ ఫ్యాన్స్ బయటకు చెప్పకపోవచ్చు. మిగిలిన వాళ్లు మరి కాస్త లౌడ్ గా బయటకు చెప్పొచ్చు. టీజర్ కాస్త అసంతృప్తినే మిగిల్చింది.
టీజర్ అనకుండా, ఈ వీడియో సలార్ రెండు భాగాల అనౌన్స్ మెంట్..లేదా సలార్ సైజు, స్టామినా చెప్పే గ్లింప్స్ అంటే సరిపెట్టుకునే అవకాశం వుండేది. మారు మాట్లాడడానికి చాన్స్ వుండేది కాదు. 1.46 నిమషాల టీజర్ లో చివరి ఇరవై సెకెండ్లు ఎండ్ టైటిల్స్ హడావుడికే సరిపోయింది. 1.12 నుంచి 1.20 వరకు అంటే ఎనిమిది సెకెండ్ల పాటు ప్రభాస్ ను చూపించారు. అది కూడా ఫేస్ ను పూర్తిగా చూపించనే లేదు. అతని మీద మాంచి పవర్ ఫుల్ డైలాగు పడనే లేదు.
కానీ ఈ మొదటి 1.12 నిమషాల పాటు ఇచ్చిన బిల్డప్, చూపించిన సీన్లు, కనిపించిన సెటప్ అంతా మాత్రం ఓ రేంజ్ లో వుంది. మళ్లీ మరో కేజిఎఫ్ 2 లెవెల్ సినిమా చూస్తున్నామనే ఫీల్ ను పక్కాగా కలిగించింది. అదే ఫ్యాన్స్ కు అయినా, మరెవరికైనా సంతృప్తి.
ఇది టీజరే కదా..ట్రయిలర్ ముందు వుంది కదా అని అనుకోవాల్సిందే. అయిన మన ప్రభాస్ ను సరిగ్గా చూపించలేదని, డైలాగు పెట్టలేదని మనమే ఫీలయితే, అక్కడ పృధ్వీ రాజ్ ఫ్యాన్స్ పరిస్థితి ఏమిటో?
ఒకటి మాత్రం వాస్తవం. టీజర్ కోసం సోషల్ మీడియాలో కలిగిన సంచలనం, హడావుడి చూస్తుంటే ఈ సినిమా కనీవినీ ఎరుగని ఓపెనింగ్ తీసుకుంటుంది అన్నది పక్కా అనుకోవాల్సిందే.