కూటమి నేతలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీకి సమయం ఆసన్నమైంది. వంద రోజుల పాలన పూర్తయిన సందర్భంగా కూటమి నేతలకు శుభవార్త చెప్పడానికి ప్రభుత్వ పెద్దలు సిద్ధంగా ఉన్నారు. ఇవాళ్టి సాయంత్రానికి నామినేటెడ్ పోస్టులుఎవరెవరికి ఇవ్వాలో జాబితా రెడీ కావచ్చని టీడీపీ వర్గాలు చెప్పాయి.
ఈ నెల 20వ తేదీ లేదా మరో రెండు రోజుల్లో జాబితా విడుదలకు ప్రభుత్వ పెద్దలు కసరత్తు చేస్తున్నారని తెలిసింది. ఆశావహులు ముఖ్యంగా లోకేశ్‌ను ప్రసన్నం చేసుకోడానికి శ్రమిస్తున్నారు. సీనియర్ నేతలు మాత్రం చంద్రబాబుతో పాటు లోకేశ్‌ను కూడా కలుస్తూ, వినతులు ఇవ్వడం విశేషం.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న జాబితా నిజం కాదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కొందరు నేతలు తమకు పదవులు రాకపోయినా ఫర్వాలేదని, గిట్టని వారికి మాత్రం ఇవ్వొద్దనే ప్రతిపాదన కూడా ప్రభుత్వ పెద్దల వద్ద పెడుతున్నట్టు తెలిసింది. పార్టీకి మొదటి నుంచి పని చేసిన నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు, లోకేశ్ భావిస్తున్నట్టు చెబుతున్నారు.
నామినేటెడ్ పోస్టుల భర్తీ తర్వాత పదవులు రాని వారు అసంతృప్తి వెళ్లగక్కే అవకాశం వుంది. అందుకే ప్రభుత్వ పెద్దలు జాగ్రత్తగా జాబితా తయారు చేస్తున్నట్టు తెలిసింది. రెండు మూడు రోజుల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఉత్కంఠ వీడనుంది.