మాంసం మద్యం: కొత్త రచ్చకు తెరలేపిన యోగి!

ఏదో ఒక వివాదాన్ని తమ చుట్టూ ఉంచుకోకుంటే.. భారతీయ జనతా పార్టీలో చాలా మంది నాయకులకు నిద్ర పట్టదు, భోజనం సహించదు. అలాంటి వివాదప్రియులైన నాయకుల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ కూడా ఒకరు. …

ఏదో ఒక వివాదాన్ని తమ చుట్టూ ఉంచుకోకుంటే.. భారతీయ జనతా పార్టీలో చాలా మంది నాయకులకు నిద్ర పట్టదు, భోజనం సహించదు. అలాంటి వివాదప్రియులైన నాయకుల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ కూడా ఒకరు. 

ముస్లిం అయిన వారి ఆస్తులను నేలమట్టం చేయించడం దగ్గరినుంచి, ఎడాపెడా నేరగాళ్లను ఎన్ కౌంటర్లు చేసి ఏరిపారేయడం వరకు ఆయన నిత్యం తన పేరు చుట్టూ ఒక వివాదాన్ని ప్రిఫిక్స్ గానో, సఫిక్స్ గానో తగిలించుకుంటూ పాలన సాగిస్తున్నారు. అలాంటి యోగి ఆదిత్యనాధ్ సరికొత్తగా అయోధ్య చుట్టూ మరో వివాదానికి తెరలేపారు. రామజన్మభూమిగా పరిగణిస్తున్న అయోధ్యలో మద్యం, మాంసం లను పూర్తిగా నిషేధిస్తూ ఒక కొత్త ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా అధికారిక నిర్ణయం రాకపోయినప్పటికీ.. దీనిమీద అప్పుడే దేశవ్యాప్తంగా గగ్గోలు మొదలైంది.

అయోధ్యలో రామాలయం పూర్తయ్యేనాటికి పవిత్ర పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దినట్లయితే.. ఆలయ పరిసరాల్లో మద్యం మాంసం విక్రయాలను నిషేధించడం సబబు అనిపించుకుంటుంది గానీ, మొత్తం అయోధ్య నగరమంతా మద్యమాంసాలను నిషేదించడం అనేది కొంచెం అతి అనిపించుకుంటోంది. 

భారత దేశమే హిందూదేశం. ఈ దేశంలో హిందూ దేవాలయాలు ప్రతిచోటా ఉంటాయి. పవిత్ర పుణ్యక్షేత్రాలుగా ప్రశస్తమైనవి, ఎంతో ప్రాముఖ్యం, పాపులారిటీ ఉన్న క్షేత్రాలు కూడా వందల సంఖ్యలో ఉంటాయి. ఈ దేశానికి అయోధ్య ఒక్కటే పుణ్యక్షేత్రం, ధార్మిక స్థలం కాదు. ప్రతి క్షేత్రమూ విశిష్టమైనదే. దాదాపు హిందూ ఆలయాలున్న ప్రతిచోటా మద్యమాంసాలమీద నిషేధాజ్ఞలు ఉంటాయి. అయితే ఊరంతా కాదు! కేవలం.. ఆలయం పరిసర ప్రాంతాలు, ఆలయ మాడ వీధులు, ఆలయానికి ఉండే రాజమార్గం లలో మాత్రమే.. మద్యమాంసాల విక్రయాన్ని నిషేధిస్తుంటారు. కానీ యోగి కాస్త అతిశయం జోడించి.. అయోధ్య నగరం మొత్తం నిషేధించాలని అంటున్నారు. 

దీనికి ముడిపెట్టి.. అసలు రాముడు క్షత్రియుడే కదా.. మాంసాహారే కదా.. ఊరంతా మాంసం నిషేదించడం కాదు కదా.. రాముడికి మాంసం నైవేద్యం పెడితేమాత్రం తప్పేంటి అనే మాటలు ఇప్పుడు బిజెపి వ్యతిరేకులనుంచి వినవస్తున్నాయి. 

అయితే యోగి ఆదిత్యనాద్ ప్రతిపాదన చాలా కుట్రపూరితమైనదిగా కొన్ని వర్గాలు అభివర్ణిస్తున్నాయి. తిరుమలలో కంప్లీట్ గా మద్య మాంసాలను నిషేధించారంటే అర్థముంది. ఎందుకంటే అక్కడ ప్రెవేటు ఆస్తులే ఉండవు. వ్యక్తుల నివాసాలు ఉండవు. కానీ అయోధ్య నగరంలో అందరూ ఉంటారు. మరి ఇక్కడ అలాంటి నిషేధం ఎలా అని ప్రశ్నిస్తున్నారు. 

అయోధ్యలో సుమారుగా 60 నుంచి 80 వేల మంది జనాభా ఉంటారనేది అంచనా. వీరిలో 93 శాతం హిందువులు కాగా, 6 శాతం ముస్లిములు. మిగిలిన అన్ని మతాలు కలిపి ఒక్కశాతమే. మద్య మాంసాలు నిషేధిస్తే.. ముస్లిములు ఏం తినాలి? అనేది ప్రశ్న. వారి పట్ల ద్వేషపూరితంగానే సీఎం యోగి ఇలాంటి అనుచితమైన ప్రతిపాదన తెచ్చారనే వాదన బలంగా వినిపిస్తోంది. మరి ఈ వివాదాన్ని బిజెపి ఎలా సద్దుమణిగేలా చేస్తుందో చూడాలి.