బండ్ల ట్వీట్ లు..వెనుక ఎవరు? ఏమిటి?

వైకాపా నాయకుడు విజయసాయి రెడ్డి మీద సినిమా నిర్మాత, బిజినెస్ మాన్ బండ్ల గణేష్ ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. శుక్రవారం అర్థరాత్రి  వేళ కూడా ట్విట్టర్ లో ట్వీట్ లు వేస్తూనే వున్నారు.…

వైకాపా నాయకుడు విజయసాయి రెడ్డి మీద సినిమా నిర్మాత, బిజినెస్ మాన్ బండ్ల గణేష్ ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. శుక్రవారం అర్థరాత్రి  వేళ కూడా ట్విట్టర్ లో ట్వీట్ లు వేస్తూనే వున్నారు. కమ్మ వాళ్లను అణచివేయాలని విజయ సాయి చూస్తున్నారనేది ఈ ట్వీట్ల వర్షానికి కారణం. కమ్మవారిని ఏం పీకలేరని, విజయసాయినే మళ్లీ దెబ్బతింటారనేది ట్వీట్లలో విషయం.

ఆంధ్ర రాజకీయాలతో సంబంధం లేని బండ్ల గణేష్ ఇన్నిట్వీట్ లు ఇంతలా ఎందుకు వేసాడు అన్నది ఒక ప్రశ్న. జగన్ అంటే ఇష్టమే కానీ విజయసాయి అంటే కాదు అని ఎందుకు చెప్పడం అన్నది రెండో ప్రశ్న. తనకు జగన్ మంత్రి వర్గంలో ఓ మంత్రితో స్నేహం వుందని ఎందుకు చెప్పడం అన్నది మూడో ప్రశ్న. ఆ మంత్రి ఎవరోకాదు బొత్స సత్యానారాయణ అన్నది అందరికీ తెలిసిందే. బొత్సకు, విజయసాయి కి మధ్య పొసగడం లేదు అన్నదీ తెలిసిందే. బొత్సను విజయనగరానికి పరిమితం చేయడం, విశాఖ పై విజయసాయ పట్టుబిగించడం, లేటెస్ట్ గా బొత్సను విద్యాశాఖకు మార్చడం వంటివి బొత్సకు విజయసాయికి మధ్య సంబంధాలను దెబ్బతీసాయి.

ఇలాంటి నేపథ్యంలో కమ్మ సామాజిక వర్గం అనే పాయింట్ ను అడ్డం పెట్టుకుని బండ్ల గణేష్ నేరుగా విజయసాయిని అంత దారుణంగా అటాక్ చేసారు. వీటన్నింటిలో అంతర్లీనంగా రెండు పాయింట్లు కనిపిస్తున్నాయి. ఒకటి విశాఖ మీద విజయసాయి పట్టు. కమ్మవారిని విజయసాయి టార్గెట్ చేయడం.

కమ్మ సామాజిక వర్గానికి విశాఖ లో పూర్తి పట్టు వుండేది. ఇది జగన్ అధికారంలోకి వచ్చేవరకు. ఇప్పుడు అక్కడ వారి అవకాశాలు అన్నీ విజయసాయి టార్గెట్ చేసారు. అంతే కాదు కమ్మ వారికి విశాఖలో అవకాశాలు లేకుండా చేస్తున్నారన్నది ఆరోపణ. విజయసాయిని విశాఖ నుంచి తరిమేయాలన్నది కమ్మవారు చేస్తున్న విశ్వప్రయత్నం. అది వారికి సాధ్యం కావడం లేదు. 

విజయసాయిని విశాఖ నుంచి పంపేస్తే తమ పట్టు మళ్లీ తాము బిగించవచ్చు అని, విజయసాయి కాకుండా మరెవరు వచ్చినా కొనేయవచ్చు అని కమ్మవారు భావిస్తున్నారేమో? కానీ అది సాధ్యం కావడం లేదు. మరోపక్క బొత్సకు కూడా విజయసాయి విశాఖ నుంచి వెళ్లిపోయాలని వుంది. విజయసాయి వుండగా బొత్స ఉత్తరాంధ్ర లీడర్ గా కాకుండా కేవలం విజయనగరం లీడర్ గా వుండాల్సి వస్తుంది.

మొత్తం మీద కమ్మవారికి కానీ, కమ్మవాడైన బండ్లకు కానీ, బండ్లనేస్తం అయిన బొత్సకు కానీ విజయసాయినే టార్గెట్ అయ్యారు. అదే విషయం ట్వీట్ల రూపంలో బయటకు వచ్చింది. అయినా బండ్ల ట్వీట్ లకు కూడా ప్రాధాన్యత వుంటుందా? అలా వుంటే 'దేవరా.. దేవరా' అంటూ నిత్యం పవన్ కళ్యాణ్ గురించి బండ్ల చేసే భజనకు ఎప్పుడో పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేసి వుండేవాడు. సినిమా మాట దేవుడెరుగు, కనీసం దగ్గరకు కూడా రానివ్వడం లేదు. 

ఈ ఈక్వేషన్ అర్థం అయితే విజయసాయి మీద బండ్ల గణేష్ ఎందుకు విరుచుకుపడ్డాడు అన్నది అర్థం అవుతుంది. అందువల్ల ఏదో కాస్సేపు కాలక్షేపం బటానీలు బండ్ల ట్వీట్ లు. అంతే.