చంద్రబాబు Vs పవన్.. పార్ట్ టైమ్ పాలిటిక్స్

పవన్ కల్యాణ్ పార్ట్ టైమ్ పాలిటిక్స్ చేస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే. ఓవైపు సినిమాలు చేస్తూ, మధ్యలో ఖాళీ టైమ్ దొరికితే ఏపీ రాజకీయాల్లో వేలు పెడతారాయన. ఇప్పుడు చంద్రబాబు కూడా తన దత్తపుత్రుడ్నే…

పవన్ కల్యాణ్ పార్ట్ టైమ్ పాలిటిక్స్ చేస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే. ఓవైపు సినిమాలు చేస్తూ, మధ్యలో ఖాళీ టైమ్ దొరికితే ఏపీ రాజకీయాల్లో వేలు పెడతారాయన. ఇప్పుడు చంద్రబాబు కూడా తన దత్తపుత్రుడ్నే ఫాలో అవుతున్నారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకునే బాబు కూడా పార్ట్ టైమ్ పాలిటిక్స్ షురూ చేశారు. పవన్ ఏపీలో చేస్తుంటే, బాబు ఇప్పుడు తెలంగాణలో మొదలుపెట్టారు.

అవును.. తెలంగాణలో పార్టీ మొత్తం చాప చుట్టేసినా తిరిగి సమయానుకూలంగా స్పందిస్తున్నారు బాబు. ఇటీవలే అక్కడ నాయకులతో సమావేశమయ్యారు. నియోజకవర్గ ఇన్ చార్జ్ లు, కో-ఆర్డినేటర్లను నియమించారు. మిగిలిన ఆ పది మందితోనే కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు.

తెలంగాణ అంటే అంత మోజెందుకు..?

తెలంగాణలో టీఆర్ఎస్ ని తట్టుకుని నిలబడేందుకు కాంగ్రెస్, బీజేపీ కొట్టుకుంటున్నాయి. ఈ మధ్యలో టీడీపీ తన ఉనికి చాటుకోవాలనుకుంటోంది. అయితే టీడీపీకి అక్కడ అంత సీన్ లేదు. తెలుగుదేశాన్ని ఆంధ్రా పార్టీగా భావిస్తున్నారు తెలంగాణ ప్రజలు. ఇప్పటికే ఆ పార్టీని కూరలో కరివేపాకులా తీసి అవతల పడేశారు. 

లోకల్, నాన్ లోకల్ అనే ఫీలింగ్ ఉన్నంత కాలం అక్కడ టీడీపీకి అంత సీన్ లేదు. అందుకే తెలంగాణలో జగన్ అసలు పార్టీయే లేకుండా ముందు జాగ్రత్తపడ్డారు. కానీ బాబుకి మాత్రం ఇంకా ఆ ఆశ చావలేదు. అందుకే అప్పుడప్పుడు అక్కడ పార్టీని కదిలిస్తున్నారు.

ప్రస్తుతం తెలంగాణలో టీడీపీకి చెప్పుకోదగ్గ నాయకులెవరూ లేరు. అంతా టీఆర్ఎస్ లోకి వలస వెళ్లిపోయారు. టీఆర్ఎస్ హౌస్ ఫుల్ కావడంతో బీజేపీ, కాంగ్రెస్ లో కూడా తమకు అంత సీన్ లేదనుకున్నవారే టీడీపీలో మిగిలిపోయారు. వారితో పార్టీని నెట్టుకొస్తున్నారు బాబు. 

చంద్రబాబుకి ముందు చూపు ఉంటే ముందు ఏపీలో పార్టీని చక్కదిద్దాలి. అది పక్కనపెట్టి తెలంగాణలో పార్టీ కోసం పాకులాడుతున్నారు. అది కూడా పార్ట్ టైమ్ పాలిటిక్స్ చేస్తున్నారు. అలా తనది జాతీయ పార్టీ అని చెప్పుకునేందుకు ఆయన పాకులాడుతున్నట్టు కనిపిస్తోంది.

ఇక పవన్ కల్యాణ్ అయితే ఏ ఎన్నికలొచ్చినా తెలంగాణలో తాము కూడా ఉన్నాం అంటారు. కమిటీల పేరుతో హడావుడి చేస్తుంటారు. ఆఖరి నిమిషంతో అన్నీ తీసుకెళ్లి బీజేపీ చేతిలో పెడుతుంటారు. ఈ విషయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరూ ఇద్దరే.

బాబు బుర్రను తక్కువ అంచనా వేయలేం..

ఉన్నఫలంగా చంద్రబాబు ఇలా తెలంగాణలో పార్ట్ టైమ్ పాలిటిక్స్ మొదలుపెట్టడానికి మరో రీజన్ కూడా కనిపిస్తోంది. చంద్రబాబుకి ఏపీ ప్రజలు షాకిచ్చిన తర్వాత ఎక్కువకాలం తెలంగాణలోనే ఉన్నారు. అలా ఆయనకి అక్కడ అటాచ్ మెంట్ పెరిగిందేమో. 

హడావిడిగా మళ్లీ నియోజకవర్గ ఇన్ చార్జిలంటూ పని మొదలు పెట్టారు. మరి దీని వెనక బీజేపీ హస్తముందో, లేక హస్తం పార్టీ ప్రోత్సాహం ఉందో తేలాల్సి ఉంది. ఎవరో ఒకరికి ఉపయోగపడేందుకే బాబు ఇలా సడన్ ఎంట్రీ ఇచ్చారనేది పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట.