వైసీపీలో విభేదాల‌పై అధిష్టానం ప్రేక్ష‌క‌పాత్ర‌

నెల్లూరు వైసీపీలో విభేదాల‌పై అధిష్టానం ప్రేక్ష‌క‌పాత్ర పోషిస్తోంది. మొగ్గ ద‌శ‌లోనే స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించాల్సిన పార్టీ పెద్ద‌లు, అందుకు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డికి మంత్రి ప‌ద‌వి ద‌క్క‌డం, నెల్లూరు…

నెల్లూరు వైసీపీలో విభేదాల‌పై అధిష్టానం ప్రేక్ష‌క‌పాత్ర పోషిస్తోంది. మొగ్గ ద‌శ‌లోనే స‌మ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించాల్సిన పార్టీ పెద్ద‌లు, అందుకు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డికి మంత్రి ప‌ద‌వి ద‌క్క‌డం, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాద‌వ్‌కు అమాత్య ప‌ద‌వి పోవ‌డంతో వైసీపీలో విభేదాలు ర‌చ్చ‌కెక్కాయి.  అనిల్‌కుమార్‌తో కాకాణికి విభేదాలున్న‌ప్ప‌టికి ఏనాడూ బ‌జారుకెక్క‌లేదు.

కానీ కాకాణి మంత్రి కావ‌డంతో ఒక్క‌సారిగా అనిల్‌కుమార్ న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌ల‌తో త‌న అసంతృప్తిని వ్య‌క్తం చేయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత మొద‌టిసారిగా కాకాణి జిల్లాకు వ‌స్తున్నారు. ఇదే రోజు నెల్లూరు న‌గ‌రంలోని గాంధీబొమ్మ వ‌ద్ద అనిల్‌కుమార్ భారీ బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించుకోవ‌డం స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఒక‌వైపు నెల్లూరు వైసీపీలో వ‌ర్గ‌విభేదాలు లేవ‌ని అనిల్‌కుమార్ చెబుతున్న‌ప్ప‌టికీ, ఆచ‌ర‌ణ మాత్రం పూర్తి విరుద్ధంగా ఉంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తాను సొంత నియోజ‌క‌వ‌ర్గంలో నిర్వ‌హిస్తున్న బ‌హిరంగ బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న ఎలా అవుతుంద‌ని అనిల్ ప్ర‌శ్నించ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. తాను నిర్వ‌హించేది పోటీ స‌భ ఎంత మాత్రం కాద‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. స‌మావేశాన్ని వాయిదా వేసుకోవాల‌ని అధిష్టానం చెప్ప‌లేద‌న్నారు. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో స‌భ నిర్వ‌హించాల‌ని భావిస్తే అధిష్టానం ఎందుకు అడ్డుకుంటుంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించ‌డం విశేషం.  

రాజ‌కీయ నాయ‌కుల మాట‌ల‌కు అర్థాలే వేరు. అవునంటే కాద‌ని, కాదంటే అవున‌ని జ‌నాల‌కు బాగా తెలుసు. కాకాణి జిల్లాకు వ‌చ్చే రోజే అనిల్ బ‌హిరంగ స‌భ ఎందుకు నిర్వ‌హించాల‌ని అనుకుంటున్నారో నెల్లూరు జిల్లా ప్ర‌జ‌ల‌కు తెలియంది కాదు. కానీ అనిల్‌, కాకాణి మ‌ధ్య విభేదాలు అంతిమంగా అధికార పార్టీకే న‌ష్ట‌మ‌ని చెప్పొచ్చు. 

ఇప్ప‌టికైనా విభేదాలున్న ఎమ్మెల్యేల‌ను కూచోపెట్టి స‌మ‌స్య ప‌రిష్క‌రించ‌క‌పోతే, భ‌విష్య‌త్‌లో అధికార పార్టీకి న‌ష్టం త‌ప్ప‌క పోవ‌చ్చు. వైసీపీకి కంచుకోట లాంటి నెల్లూరులో స్వ‌ప‌క్షంలోనే విప‌క్షం త‌యారై, చివ‌రికి ప్ర‌తిప‌క్షానికి మేలు చేసేలా ఉన్నార‌నే ఆవేద‌న సొంత పార్టీలో నెల‌కుంది.