ఆ ప్ర‌శ్న మాత్రం అడ‌గొద్దు!

శ‌వ రాజ‌కీయాలు చేయ‌డంలో టీడీపీ కంటే గోతికాడ న‌క్క‌లే న‌య‌మ‌ని ప్ర‌త్య‌ర్థులు విమ‌ర్శిస్తున్నారు. ప్ర‌తిదీ రాజ‌కీయం చేయ‌డానికి టీడీపీ తాప‌త్ర‌య ప‌డ‌డంపై వైసీపీ నేత‌లు మండిప‌డుతున్నారు. అనంత‌పురం జిల్లా క‌ళ్యాణ‌దుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చ‌ర‌ణ్…

శ‌వ రాజ‌కీయాలు చేయ‌డంలో టీడీపీ కంటే గోతికాడ న‌క్క‌లే న‌య‌మ‌ని ప్ర‌త్య‌ర్థులు విమ‌ర్శిస్తున్నారు. ప్ర‌తిదీ రాజ‌కీయం చేయ‌డానికి టీడీపీ తాప‌త్ర‌య ప‌డ‌డంపై వైసీపీ నేత‌లు మండిప‌డుతున్నారు. అనంత‌పురం జిల్లా క‌ళ్యాణ‌దుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చ‌ర‌ణ్ మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకున్న త‌ర్వాత మొద‌టిసారిగా సొంత నియోజ‌క‌వ‌ర్గానికి శుక్ర‌వారం రాత్రి వెళ్లారు. ఈ సంద‌ర్భంగా క‌ళ్యాణ‌దుర్గంలో మంత్రి స్వాగ‌త సంబ‌రాలు ఓ శిశువు ప్రాణం తీసింద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాప‌ను ఆస్ప‌త్రికి తీసుకెళుతుండ‌గా ఉష‌శ్రీ చ‌ర‌ణ్ స్వాగ‌త సంబ‌రాలు అడ్డంకిగా మారాయి. త‌మ‌ను ముందుకెళ్ల‌కుండా పోలీసులు అడ్డుకోవ‌డం వ‌ల్లే ఆస్ప‌త్రికి పోలేక‌పోయామ‌ని, పాప మృతి చెందింద‌ని కుటుంబ స‌భ్యులు ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబునాయుడు తీవ్రంగా మండిప‌డ్డారు.

మంత్రి ఆర్భాటం కోసం ప‌సికందు మృతి చెందింద‌ని చంద్ర‌బాబు ఆరోపించారు. సంబ‌రాల కోసం ట్రాఫిక్‌ను నిలిపివేసి ప‌సిపాప ప్రాణాలు పోయేందుకు వైసీపీ నేత‌లు కార‌ణ‌మ‌య్యార‌ని మండిప‌డ్డారు. చిన్నారి ఆస్ప‌త్రికి వెళ్ల‌డం కంటే మంత్రుల ర్యాలీలే ముఖ్య‌మా అని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. ఇప్పుడు పోలీసులు ఏం చెబుతార‌ని ఆయ‌న నిల‌దీశారు. క‌డుపు కోత‌తో త‌ల్లడిల్లుతున్న త‌ల్లిదండ్రుల‌కు మంత్రి ఏం స‌మాధానం చెబుతార‌ని చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. మంత్రి సంబ‌రాల వ‌ల్లే ప‌సికందు మృతి చెంది వుంటే ఖ‌చ్చితంగా ఎవ‌రైనా ప్ర‌శ్నించాల్సిందే.

ఇందుకు మంత్రులెవ‌రైనా బాధ్య‌త వ‌హించాల్సిందే. కానీ పుష్క‌రాల్లో ప‌దుల సంఖ్య‌లో మ‌ర‌ణించ‌డానికి కార‌కులెవ‌ర‌ని మాత్రం చంద్ర‌బాబును ఎవ‌రూ ప్ర‌శ్నించ‌కూడ‌దు. నాడు చంద్ర‌బాబు ప్ర‌చార యావ‌ భ‌క్తుల ప్రాణాల్ని బ‌లిగొంది. నాడు అర‌కొర న‌ష్ట‌ప‌రిహారం చెల్లించి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం చేతులు దులుపుకుంది. 

బాబు పాపాల త‌డి ఆర‌నే లేదు. కానీ ఆయ‌న మాత్రం చావుల్ని సొమ్ము చేసుకోడానికి మీడియా ముందుకు రావ‌డం విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. ఏ నైతిక హ‌క్కు ఉంద‌ని చంద్ర‌బాబు క‌ళ్యాణ‌దుర్గం ప‌సిపాప మృతిపై మాట్లాడుతున్నార‌నే ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి.