జీవీఎల్ విశాఖ ఆశలు అవిరి…చిన్నమ్మే బాస్

ఏపీ బీజేపీలో జరిగిన ఒక కీలక పరిణామం వల్ల విశాఖ బీజేపీ రాజకీయం కూడా పూర్తిగా మారిపోతోంది. విశాఖలో రెండేళ్ళ క్రితం సొంత ఇల్లు కొనుక్కుని ఇక్కడే తన రాజకీయం అని చెబుతూ వచ్చిన…

ఏపీ బీజేపీలో జరిగిన ఒక కీలక పరిణామం వల్ల విశాఖ బీజేపీ రాజకీయం కూడా పూర్తిగా మారిపోతోంది. విశాఖలో రెండేళ్ళ క్రితం సొంత ఇల్లు కొనుక్కుని ఇక్కడే తన రాజకీయం అని చెబుతూ వచ్చిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుకు ఇపుడు విశాఖ ఎంపీ సీటు అందని పండే అంటున్నారు.

విశాఖ ఎంపీ సీటు విషయంలో జీవీఎల్ కి ఎదురు నిలిచిన వారు దగ్గుబాటి పురంధేశ్వరి. ఆమె 2024లో విశాఖ నుంచి పోటీ చేయలని అనుకుంటున్నారని తెలుస్తోంది. 2009లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి విశాఖ నుంచి గెలిచిన పురంధేశ్వరి అప్పట్లో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. 2014 నాటికి బీజేపీలో చేరిన ఆమెను రాజంపేట నుంచి పోటీ చేయించిది బీజేపీ.

అపుడే విశాఖ సీటు కోసం ఆమె పట్టుబట్టినా హరిబాబు అక్కడ ఉండడం వల్ల వీలు కాలేదు అంటారు. 2019 నాటికి ఆమెకు విశాఖ సీటు బీజేపీ ఇచ్చింది. పొత్తులు లేకపోవడం వల్ల ఆమెకు డిపాజిట్ దక్కలేదు. 2024లో పొత్తులు ఉంటాయని భావించిన జీవీఎల్ తానే ఎంపీ అని చాలా కాలం క్రితం నుంచే హడావుడి చేస్తున్నారు. తన సామాజికవర్గం ఓట్లను కూడా ఆయన లెక్క చూసుకుంటూ పోటీకి తయార్ అవుతున్నారు.

సరిగ్గా ఈ సమయంలో అనుహ్యమైన పరిణామంగా పురంధేశ్వరికి ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పోస్ట్ ని కేంద్ర పార్టీ ఇచ్చింది. ఇక ఆమె బాస్ గా మారిపోయారు. ఆమె కోరుకున్న సీటు తెచ్చుకోకపోతే ఆ పదవికి విలువ ఏముంది. హైకమండ్ సైతం ఆమె విశాఖ నుంచి పోటీ చేస్తానంటే కాదనే పరిస్థితి అసలు ఉండవు. దాంతో ఇపుడు జీవీఎల్ విశాఖ ఎంపీ ఆశలు ఒక్కసారిగా నీరుకారిపోయాయని అంటున్నారు. 

కేంద్ర పెద్దల వద్ద జీవీఎల్ ని పరపతి ఉందని ఆయనే పోటీ చేస్తారని అనుచరులు అంటున్నా అది ఎంత వరకూ జరిగే పని అన్నదే ఆలోచించాలి.