రాజకీయ నాయకులు, సినీజనాలకు పబ్లిసిటీ పిచ్చి. జనాల నోళ్లలో ఎంత నానితే అంత క్రేజ్ అని ఫీలవుతుంటారు. అందుకే ఒక్కోసారి వ్యక్తిగత విషయాల్ని కూడా పంచుకుంటారు. అయితే ఉన్నట్టుండి సడెన్ గా వీళ్లకు కూడా ప్రైవసీ అనే పదం గుర్తొస్తుంది. ప్రతి అంశంతో పబ్లిసిటీ కోరుకునే తారలు, కొన్నిసార్లు తమకు కూడా ప్రైవసీ కావాలంటూ గోల చేస్తుంటారు. కానీ ఇది ఎలా కుదురుతుంది?
'మీ వ్యక్తిగతం మీ ఇష్టం, జనాల్లోకి వస్తే ఏమైనా అంటాం'.. ఇది చాలా కామన్. కాబట్టి ఏది జనాల్లో పెట్టాలి, ఏది పెట్టకూడదు అనే నిర్ణయాల్ని తారలే తీసుకోవాలి. ఉదాహరణకు పెళ్లిళ్లనే తీసుకుందాం. పెళ్లి విషయంలో ఫుల్ పబ్లిసిటీ కోరుకుంటారు తారలు. ప్రేమించినవాడు ఎవడో చెప్పడం నుంచి అతడ్ని పెళ్లాడే వరకు డైలీ సీరియల్ కింద రోజుకో ట్విస్ట్ ఇస్తుంటారు. రకరకాల ఫొటోలు పెడుతుంటారు.
ఇక పెళ్లి టైమ్ కు వచ్చేసరికి ఆ ప్రచారం పీక్ స్టేజ్ కు చేరుతుంది. డెస్టినేషన్ వెడ్డింగ్, డిజైనరీ దుస్తులు, ఖరీదైన గిఫ్టులు, వెడ్డింగ్ కార్డులు.. ఇలా ప్రతి అంశాన్ని ప్రమోషన్ లానే చూస్తారు. చివరికి పెళ్లి తర్వాత హనీమూన్ ను కూడా తమ ప్రచారానికి వాడుకున్న తారలు కోకొల్లలు.
మరి ఇంత హంగామా చేసిన తర్వాత కొన్నాళ్లకు ఆ పెళ్లి పెటాకులైతే ఏంటి పరిస్థితి? పెళ్లికి అంత హైప్ ఇచ్చినప్పుడు ఆటోమేటిగ్గా విడాకులకు కూడా ప్రచారం వస్తుంది. కానీ ఇది మాత్రం తారలకు వద్దు. పెళ్లిని ఓటీటీలకు అమ్ముకునే తారలు, పెటాకుల అంశం మాత్రం చిన్న టాబ్లాయిడ్ లో వచ్చినా తట్టుకోలేరు. విడాకుల్ని కవర్ చేయొద్దంటే ఎలా కుదురుతుంది.? కుదరదంటే కుదరదంతే.
ఈ విషయంలో మీడియా అత్యుత్సాహాన్ని ప్రశ్నించే వాళ్లు కూడా ఉంటారు. వాళ్లు బయటకు చెప్పకుండా మీరెందుకు మైకులు పట్టుకొని వెంటపడతారని అడిగే వాళ్లు కూడా ఉన్నారు. అలాంటి వాళ్లకు తెలియని అంశం ఒకటే. తాము ఫలానా చోట ఉంటాం, కెమెరాలతో రమ్మని మీడియాకు ఉప్పందించేది వీళ్లే. ఫలానా వ్యక్తితో డేటింగ్ చేస్తున్నామని తెరవెనక లీకులు వదిలేది వీళ్లే. ఫలానా చోట పెళ్లి అంటూ ఇండైరెక్ట్ గా ట్వీట్లు వేసేది వీళ్లే. ఈ విషయంలో ఈ తారల పీఆర్ యూనిట్లు చేసే హడావుడి నభూతో..
లీకుల రూపంలో మీడియాకు టిఫిన్లు పెట్టేది వీళ్లే, ఆ తర్వాత విడాకుల రూపంలో ఫుల్ మీల్స్ అందించేది కూడా వీళ్లే. అలాంటప్పుడు మీడియాది తప్పు ఎలా అవుతుంది? ఒకట్రెండు విషయాల్లో మీడియా అత్యుత్సాహం చూపించొచ్చేమో కానీ.. 95శాతం కేసుల్లో మీడియాను వెంట తిప్పుకునే తారలే ఎక్కువ.
వ్యక్తిగత అంశాల్ని తమ వ్యక్తిగతం వరకు మాత్రమే ఉంచుకుంటే ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. పెళ్లి గుంభనంగా చేసుకుంటే విడాకుల వ్యవహారం కూడా అంతే సింపుల్ గా ముగుస్తుంది. ఈ చిన్న లాజిక్ ను తారలు మిస్సవుతున్నారు. విడాకుల విషయానికొచ్చేసరికి తమకు ప్రైవసీ కావాలంటూ ట్వీట్లు పెడుతున్నారు. ఇది ఎలా కుదురుతుంది?