రష్మిక, శృతిహాసన్, కీర్తిసురేష్ లాంటి హీరోయిన్లు ఈ 6 నెలల్లో కనువిందు చేశారు. తమ సినిమాలతో ఆకట్టుకున్నారు. మరి మిగతా హీరోయిన్ల పరిస్థితేంటి? ఇప్పటివరకు బోణీ కొట్టని హీరోయిన్లు ఎవరు? ఈ లిస్ట్ చాలా పెద్దది.
ఈ ఏడాది ఇంకా బోణీ కొట్టలేదు పూజా హెగ్డే. ఆచార్య తర్వాత ఎఫ్3లో స్పెషల్ సాంగ్ తో కనిపించింది పూజా. ఆ తర్వాత ఇప్పటివరకు ఆమె నుంచి తెలుగులో సినిమా రాలేదు. మరి మిగిలిన ఈ 6 నెలల్లో ఆమె నుంచి సినిమా వచ్చే అవకాశం ఉందా? నో ఛాన్స్.
మిల్కీ బ్యూటీ తమన్న పరిస్థితి కూడా ఇంతే. ఈ 6 నెలల్లో ఆమె నుంచి సినిమా రాలేదు. అయితే మలి అర్థభాగంలో ఆమె అలరించబోతోంది. చిరంజీవితో కలిసి తమన్న చేసిన భోళాశంకర్ మూవీ ఆగస్ట్ లో థియేటర్లలోకి వస్తోంది. అలా ఈ ఏడాది తనకంటూ ఓ తెలుగు సినిమాను రిజర్వ్ చేసుకుంది.
టాలీవుడ్ మొత్తం మారుమోగిపోతోంది శ్రీలీల పేరు. ఆమె చేతిలో అరడజనుకు పైగా సినిమాలున్నాయి. ప్రస్తుతం హీరోలంతా ఆమెనే కోరుకుంటున్నారు. చేతిలో ఇన్ని సినిమాలున్నాయి కానీ ఇప్పటివరకు శ్రీలీల నుంచి ఈ ఏడాది ఒక్క మూవీ కూడా రిలీజ్ కాలేదు. తొలి అర్థభాగంలో తెరపై ఆమె కనిపించనేలేదు. సెకెండాఫ్ లో ఆమె సందడి చేయనుంది.
కాజల్ కూడా సెకెండాఫ్ లోనే మెరవనుంది. పెళ్లి తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ, ఆల్రెడీ రీఎంట్రీ ఇచ్చింది. త్వరలోనే భగవంత్ కేసరి సినిమాతో తెలుగు ప్రేక్షకులముందుకు రాబోతోంది.
అనుష్క అయితే పూర్తిగా కనిపించడం మానేసింది. దాదాపు మూడేళ్ల నుంచి గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ… ఈ ఏడాది తెరపైకి రాబోతోంది. నవీన్ పొలిశెట్టితో కలిసి అనుష్క చేస్తున్న మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా ఆగస్ట్ లో థియేటర్లలోకి రానుంది.
అటు రాశిఖన్నా, రకుల్, అనుపమ పరమేశ్వరన్ కూడా ఈ 6 నెలలు కనిపించలేదు. రాశి ఖన్నా నుంచి రాబోయే 6 నెలల్లో కూడా సినిమా వచ్చే ఛాన్స్ లేదు. ఇక రకుల్ నుంచి ఓ సినిమా రిలీజైనా అది ఓటీటీకే పరిమితమైంది. పైగా తెలుగు సినిమా కాదది. అనుపమ పరమేశ్వరన్ నుంచి కూడా ఈ 6 నెలల్లో సినిమా రాలేదు.