కొన్ని దొంగతనాల తీరు చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఇలా కూడా చేస్తారా అనిపిస్తుంది. ఇది కూడా అలాంటి దొంగతనమే. ఖమ్మం జిల్లాకు చెందిన శంకర్ అనే వ్యక్తి లోకల్ గా దొంగతనాలు చేయడు. విమానంలో కేరళ వెళ్లి మరీ చోరీలు చేస్తాడు. అదే ఇతడి స్టయిల్.
గడిచిన 2 నెలల్లో 4 సార్లు కేరళ వెళ్లాడు శంకర్. ప్రతిసారి విమానంలోనే వెళ్లాడు. ఎయిర్ పోర్టులో దిగిన వెంటనే ఆటో మాట్లాడుకుంటాడు. తిరువనంతపురం సిటీ మొత్తం చక్కర్లు కొడతాడు. ఎక్కడైనా ఇంటికి తాళం వేసి ఉందంటే చాలు, ఆ లొకేషన్ ను గూగుల్ మ్యాప్ లో పిన్ చేసుకుంటాడు.
బాగా చీకటి పడిన తర్వాత శంకర్ తన పని స్టార్ట్ చేస్తాడు. పొద్దున్న పిన్ చేసుకున్న లొకేషన్ కు గూగుల్ మ్యాప్ సహాయంతో చేరుకుంటాడు. వెంట తెచ్చిన సరంజామాతో తాళం తీసి, ఇంట్లోకి చొరబడి దొంగతనం చేస్తాడు. ఏవి పడితే అవి దొంగతనం చేయడు. కేవలం బంగారం మాత్రమే తీసుకుంటాడు. దీనికి కూడా ఓ కారణం ఉంది.
దొంగిలించిన వస్తువుల్ని అమ్మే క్రమంలో పట్టుబడే ప్రమాదం ఉంది. అందుకే అన్ని వస్తువులు తీసుకోడు. కేవలం బంగారం తీసుకుంటాడు. వాటిని కూడా అమ్మడు. జస్ట్ తాకట్టు పెడతాడంతే. అలా వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని విమాన టిక్కెట్లకు ఉంచుకొని, మిగతా డబ్బుతో జల్సా చేస్తాడు.
సిటీలో వరుసగా, ఒకే తరహాలో 3 దొంగతనాలు జరగడంతో కేరళ పోలీసులకు అనుమానం వచ్చింది. సీసీటీవీ ఫూటేజ్ సహాయంతో దర్యాప్తు ప్రారంభించి వ్యక్తి ఎవరనేది తెలుసుకున్నారు. ఆటో డ్రైవర్ ఇచ్చిన కీలక సమాచారంతో కూపీ లాగారు. ఎప్పట్లానే మరోసారి దొంగతనం కోసం ల్యాండ్ అయ్యాడు ఖమ్మం శంకర్. అప్పటికే వల పన్ని ఉన్న పోలీసులు,శంకర్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడు చెప్పిన వివరాలు విని షాక్ అయ్యారు.