ఈమధ్య కాస్త ఓపెన్ గా మాట్లాడుతున్నాడు శౌర్య. ప్రభాస్ లాంటి హీరో సినిమానే బాగాలేకపోతే మొదటి రోజుకే ప్రేక్షకులు తిప్పికొడుతున్నారంటూ పరోక్షంగా ఆదిపురుష్ రిజల్ట్ పై స్పందించాడు. ఇప్పుడు హీరోలు, వాళ్ల మార్కెట్లపై కూడా అంతే సూటిగా రియాక్ట్ అయ్యాడు. ప్రస్తుతం హీరోలకు ఫ్యాన్స్ లేరని, సినిమాలకే ఉన్నారని అంటున్నాడు ఈ హీరో.
సినిమాలు ఫ్లాప్ అవ్వడం వల్ల హీరోల మార్కెట్ దెబ్బతింటోందనే విషయాన్ని అంగీకరించట్లేదు శౌర్య. ఏ హీరోకూ మార్కెట్ నిలకడగా లేదంటూ కుండబద్దలుకొట్టాడు. ఈ కాలం హిట్ అయిన సినిమా ఏ రేంజ్ కు వెళ్తుందో ఊహించడం కష్టంగా ఉందని, అదే విధంగా మూవీ ఫ్లాప్ అయితే ఎంత డిజాస్టర్ అవుతుందో కూడా ఊహించలేకపోతున్నామన్నాడు.
కాబట్టి ఇండస్ట్రీలో హీరోల కంటే సినిమాలకే వాల్యూ ఎక్కువంటున్నాడు శౌర్య. సినిమా ఆడితేనే హీరోకు గుర్తింపు ఉంటుందని చెబుతున్నాడు. రాజమౌళి వల్ల హీరోల మార్కెట్ వాల్యూ బాగా పెరిగిందన్న శౌర్య.. అదే టైమ్ లో ఏ హీరోకూ స్థిరంగా మార్కెట్ లేదని అంటున్నాడు.
నాగశౌర్య నటించిన రంగబలి సినిమా ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి వస్తోంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో ఇలా ఓపెన్ గా మాట్లాడాడు. తను నటించిన ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి కూడా ఫ్లాప్ అయిన విషయాన్ని ఒప్పుకున్నాడు.