'మూడు, నాలుగు విడతల రుణమాఫీని జగన్ ఎగ్గొట్టి అన్యాయం చేశాడు.. అసలు పార్టీకి ప్రజలు ఎందుకు ఓటేయాలి?' అని ప్రశ్నించారు తెలుగుదేశం పార్టీ నేత కిమిడి కళా వెంకట్రావు! అసలు తెలుగుదేశం పార్టీకి ఏమైంది? అనే ప్రశ్న తలెత్తుతుంది ఈ విమర్శను వింటే.
అసలు తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ నేతలకూ తామేం మాట్లాడుతున్న స్పృహ ఉండే మాట్లాడుతున్నారా? లేక ఆ పార్టీకే సిగ్గు ఉండదా? అని సామాన్యుడు అనుకుంటే.. అందుకు కారణం కచ్చితంగా టీడీపీ నేతలే! రుణమాఫీ గురించి కోరి మరీ తిట్టించుకుంటే తప్ప తెలుగుదేశం పార్టీకి ఆనందం దక్కేలా లేదనే క్లారిటీ కూడా ఇక్కడ వస్తోంది.
2014 ఎన్నికల ముందు అధికారం ఇవ్వండి చాలూ.. సర్వరుణాలూ మాఫీ అని, తాకట్టులోని బంగారాలను కూడా విడిపిస్తామంటూ తెలుగుదేశం నేతలు వీధివీధీ తిరిగి ప్రచారం చేశారు. అప్పట్లో వీళ్లు రాసిన గోడల మీద రాతలు ఇంకా చెరగలేదు కొన్ని ప్రాంతాల్లో.
తీరా అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించి, సర్వరుణమాఫీ కాస్తా.. సర్వ షరతుల మాఫీ అయ్యింది. మెజారిటీ మందిని, మెజారిటీ రుణాలను మినహాయించి, ఐదు విడతల మాఫీ అంటూ కామెడీ మొదలుపెట్టారు. ఐదేళ్ల అధికార కాలంలో మూడు విడతల మాఫీ చేసినట్టుగా ప్రకటించుకున్నారు. ఆ సొమ్ములు రైతుల అప్పులపై బ్యాంకర్లు వేసిన వడ్డీలకు కూడా సరిపోలేదు!
తమ చేతగాని తనం, తాము చేసిన మోసాన్ని రైతులు ఏమైనా మరిచిపోతున్నా.. తెలుగుదేశం నేతలే దాన్ని గుర్తు చేస్తూ ఉంటారు. జగన్ ప్రభుత్వం రుణమాఫీ చేయాలట. ఇది దాదాపు రెండేళ్లుగా టీడీపీ వినిపిస్తున్న వాదన. హామీ ఇచ్చింది చంద్రబాబు, ఆ హామీతో అధికారాన్ని పొందింది చంద్రబాబు, చేతగాని దద్దమ్మలా మూడు విడతల మాఫీ అంటూ.. రైతుల చెవుల్లో పూలు పెట్టింది తెలుగుదేశం పార్టీ నేతలు.
ఇప్పుడు ఆ హామీని జగన్ అమలు చేయాలట. ఏదో ఒకసారి మాటమాత్రంగా అడిగారంటే అదే వాళ్ల చేతగాని తనాన్ని వాళ్లే ఒప్పుకోవడం. అయితే టీడీపీకి అలాంటి విలువలు ఏమీ లేవు కాబట్టి.. రుణమాఫీ విషయంలో జగన్ మోసం చేశాడు.. అనేంత వరకూ వచ్చింది!
చంద్రబాబు నాయుడు అంటే.. ఏదేదో మాట్లాడతారు, పంచాయతీ ఎన్నికలకు మెనిఫెస్టో విడుదల చేస్తారు.. ఆయనకు ఏదో అయ్యిందనే అభిప్రాయం జనాల్లో బలపడుతూ ఉంది. ఆయనకు ధీటుగా మిగతా టీడీపీ నేతలు కూడా ఇలా మాట్లాడటం.. చంద్రబాబుకే కాదు, మిగతా వాళ్లకూ ఏదో అయ్యిందనే అభిప్రాయన్ని ఏర్పరిచేలా ఉంది!