వివేకా హత్య కేసులో ఆయన పీఏ ఎంవీ కృష్ణారెడ్డి పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టులోనే తేల్చుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం మార్గనిర్దేశం చేయడం చర్చనీయాంశమైంది.
వివేకా హత్య కేసులో తనను బాధితుడిగా పరిగణించాలని, అలాగే దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని సవాల్ చేసే అధికారం తనకు కూడా ఉన్నట్టు ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో వివేకా పీఏ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
అయితే కృష్ణారెడ్డి పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం ఎలాంటి అభిప్రాయం చెప్పలేదు. ఈ కేసులో జోక్యం చేసుకోడానికి తాము సిద్ధంగా లేమని జస్టిస్ కృష్ణమురారి, జస్టిస్ సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. కృష్ణారెడ్డి పిటిషన్‌ను ధర్మాసనం డిస్మిస్ చేస్తూ కీలక తీర్పు వెలువరించింది. ఏదైనా వుంటే తెలంగాణ హైకోర్టుకెళ్లి చెప్పుకోవాలని సూచించింది.
తమ అభిప్రాయంతో సంబంధం లేకుండా హైకోర్టు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవచ్చని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. వాదప్రతివాదులు తమ అభిప్రాయాలను హైకోర్టుకు చెప్పుకోవాలని ఆదేశించింది. దీంతో వ్యవహారం మళ్లీ హైకోర్టుకు చేరింది.
తనను బాధితుడిగా గుర్తించాలని వివేకా ఏపీ కృష్ణారెడ్డి కోరడంపై డాక్టర్ సునీత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన తండ్రి హత్యకు గురైతే పీఏ ఏ విధంగా బాధితుడు అవుతాడని డాక్టర్ సునీత ప్రశ్నిస్తున్నారు. ఈ పోరులో తెలంగాణ హైకోర్టు తీర్పు ఎలా వుంటుందో చూడాలి.