సాధారణంగా టాలీవుడ్ నటులు సినిమా సంగతులు తప్ప రాజకీయ విషయాలు అసలు మాట్లాడరు. తమ వ్యాపారాలు, ఇతరత్రా వాటికి ఇబ్బంది లేని అంశాలపై మాత్రమే టాలీవుడ్ నటులు స్పందించడానికి ఆసక్తి చూపుతుంటారు. మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంపై నోరెత్తే సాహసం టాలీవుడ్ నటులకు అసలు లేదు.
ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రముఖ అభ్యుదయ నటుడు ఆర్.నారాయణమూర్తి ఓ సలహా ఇచ్చారు. 'బీజేపీ, కాంగ్రెస్తో ఈ దేశానికి మేలు జరగదు. కేసీఆర్ గారూ మీరే చొరవ తీసుకుని వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్య నాయకులందరినీ ఏకం చేసి ఫెడరల్ ఫ్రంట్ పెట్టండి’ అని సలహా ఇచ్చారు.
సిరిసిల్లా జిల్లాలోని వేములవాడలో ఓ కార్యక్రమానికి హాజరైన నారాయణమూర్తి మాట్లాడుతూ కేసీఆర్కు ఫెడరల్ ఫ్రంట్ పెట్టాలని సలహా ఇవ్వడానికి కారణం లేకపోలేదు. గతంలో పలు సందర్భాల్లో కేసీఆర్ మాట్లాడుతూ బీజేపీకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ శక్తి అవతరించాల్సిన అవసరం ఉందన్నారు.
ఆ శక్తి ఫెడరల్ ఫ్రంట్ రూపంలో ముందుకు వస్తుందని, దానికి తానే నాయకత్వం వహిస్తానని స్పష్టం చేశారు. ఆ తర్వాత కేసీఆర్ ఆ విషయాన్నే ప్రస్తావించలేదు. ఈ నేపథ్యంలో కేసీఆర్కు నారాయణమూర్తి గుర్తు చేయడం గమనార్హం. రైతుల ఆందోళనకు కవులు, సామాజిక కార్యకర్తలు అండగా నిలవాలని నారాయణమూర్తి పిలుపునిచ్చారు.