ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు ముందుంది ముసళ్ల పండగ అని ప్రభుత్వ పెద్దలు హెచ్చరిస్తున్నారు. రాజ్యాంగ పదవిని అడ్డు పెట్టుకుని తనకిష్టమొచ్చినట్టు ఆదేశాలు, నిర్ణయాలు తీసుకుంటూ స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని నిమ్మగడ్డ కలలు కంటున్నారని, అది జరగని పని అని వారు అంటున్నారు.
ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ అనంతరం, పదవీ విరమణ చేసినా నిమ్మగడ్డ అంత సులభంగా తప్పించుకోలేరని, తన అరాచకానికి తగిన ప్రాయశ్చిత్యాన్ని అనుభవించి తీరుతారని ప్రభుత్వ పెద్దలు బహిరంగంగానే హెచ్చరిస్తుండడం గమనార్హం.
ఆరు నూరైనా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు జైలు తప్పదా? అంటే ప్రభుత్వ పెద్దల వాదన ప్రకారం “తప్పద”నే చెప్పాలి. మరోవైపు ఉద్యోగులకు ఎస్ఈసీ ఇస్తున్న భరోసా ఏ మాత్రం ప్రయోజనం కలిగించిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజ్యాంగ పదవిని అడ్డు పెట్టుకుని తమను ముప్పుతిప్పలు పెట్టాలని పొంతనలేని చిత్రవిచిత్ర ఆదేశాలు ఇస్తున్న నిమ్మగడ్డ కథేంటో చూడాలని ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది.
పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిన్న మీడియాతో అన్న మాటలను పరిశీలిస్తే నిమ్మగడ్డపై మున్ముందు ప్రభుత్వం అనుసరించే వైఖరి ఎంత కఠినంగా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు.
తనను గృహనిర్బంధం చేస్తూ ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలపై మంత్రి స్పందిస్తూ …నిమ్మగడ్డ ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరు కావాల్సిందేనని, ఆయనకు మూడేళ్ల జైలు శిక్ష తప్పదని స్పష్టం చేశారు. జైలు శిక్షలు న్యాయస్థానాలు విధించాల్సిన అంశమైనప్పటికీ, అందుకు తగ్గట్టు నేరారోపణ రుజువు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉంటుంది.
నిమ్మగడ్డను ఏదైనా ఇబ్బంది పెట్టాలనుకుంటే, ప్రభుత్వం చేతిలో ఉన్న ఏకైక ఆయుధం ప్రివిలేజ్ కమిటీ. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ అనంతరం ప్రివిలేజ్ కమిటీ సిఫార్సులు, ఆదేశాలను వేగవంతం చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లను ప్రభుత్వ పెద్దలు సిద్ధం చేసుకున్నట్టు సమాచారం.
ఇది కాకుండా నిమ్మగడ్డపై మిగిలిన విమర్శలన్నీ రాజకీయ పరమైనవే. ఇవి మీడియాలో ప్రచారానికి తప్ప ఇటు ప్రభుత్వానికి, అటు ఎస్ఈసీకి వచ్చే లాభనష్టాలేవీ ఉండవని గ్రహించాలి. ఇక ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులు ఎలాంటి అభద్రతా భావానికి గురి కాకుండా నిబద్ధత, నైతికతతో విధులు నిర్వహించాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ కోరుతుండడంపై ఉద్యోగుల నుంచి పెద్దగా పాజిటివ్ సంకేతాలు రావడం లేదు.
అసలు నిమ్మగడ్డ తనను తానే రక్షించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని, ఎన్నికల అనంతరం పదవీ విరమణ చేయనున్న నిమ్మగడ్డ గతేంటో ఆయనకే తెలియదని, అలాంటిది ప్రభుత్వంతో కలిసి పని చేయాల్సిన తాము ఆయన మాటలు విని నష్టపోలేమనే భావనలో ఉద్యోగులు ఉన్నారు.