కాపుల మీద విశ్వాసం వదిలించుకున్న బిజెపి!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినంత వరకు కాపు సామాజిక వర్గం మీద భారతీయ జనతా పార్టీ ఇన్నాళ్లుగా చాలా నమ్మకం పెట్టుకుంది. ఏపీలో అధికారం చెలాయిస్తున్న రెండు కీలక పార్టీలు రెండు బలమైన సామాజిక…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినంత వరకు కాపు సామాజిక వర్గం మీద భారతీయ జనతా పార్టీ ఇన్నాళ్లుగా చాలా నమ్మకం పెట్టుకుంది. ఏపీలో అధికారం చెలాయిస్తున్న రెండు కీలక పార్టీలు రెండు బలమైన సామాజిక వర్గాలకు చెందిన పార్టీలుగా ముద్రపడి ఉన్న నేపథ్యంలో.. మూడో అతిపెద్ద కులాన్ని తాము సొంతం చేసుకుంటే పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందని బిజెపి వ్యూహకర్తలు మొదట భావించారు. 

ఏపీ బీజేపీ రాజకీయాలు అన్నీ కాపు సామాజిక వర్గం చుట్టూతా ఇన్నాళ్లు తిరిగాయి. బిజెపి సారధిగా మొదట కాపు వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణను పార్టీ నియమించింది. 2014 ఎన్నికలను ఆయన సారధ్యంలోనే ఎదుర్కొన్నారు. తర్వాత పరిణామాలలో ఆయనను మార్చి, అదే కాపు సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజుని ఎంపిక చేశారు. కాపుల చేతిలో రాష్ట్ర పార్టీ పగ్గాలు పెట్టడం వలన.. కాపు సామాజిక వర్గం తమ పార్టీని ఆదరిస్తుందని బిజెపి అధినాయకులు భ్రమపడ్డారు.

వాస్తవంలో వారు అనుకున్నట్లుగా ఎంత మాత్రమూ జరగలేదు. ఎందుకంటే రాష్ట్రంలో ఎంతో బలమైన కాపు సామాజిక వర్గం మీద దాదాపుగా ప్రతి పార్టీ కూడా దృష్టి పెడుతూ ఉండడమే అందుకు కారణం. ఏ పార్టీ వచ్చినా సరే కాపులకు అంతో ఇంతో పెద్దపీట వేస్తూనే మనుగడ సాగిస్తున్నారు. 

తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడైనా, ప్రస్తుత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం లో అయినా సరే కాపులకు తగిన దామాషాలో మంత్రి పదవులు దక్కుతూనే ఉన్నాయి. ప్రత్యేకించి ఆ పార్టీలను కాపులు వ్యతిరేకించేంత పరిస్థితి, ద్వేషించేంత వాతావరణం ఏర్పడడం లేదు.

దానికి తోడు కాపు ఓటు బ్యాంకు మీద ప్రధానంగా ఆధారపడి హీరో పవన్ కళ్యాణ్ ఏకంగా జనసేన పార్టీనే నడుపుతున్నారు. గతంలో మెజారిటీ కాపులు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని సొంతంగా భావించినట్లుగానే, ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీని తమ సొంత పార్టీగా కాపులు మెజారిటీగా భావిస్తున్నారని అనడం అతిశయోక్తి కాదు.

రాష్ట్రంలో ఉన్న కాపు బ్యాంకు మీద ఇలా త్రిముఖ దాడి జరుగుతూ ఉండగా.. ఆకర్షించడానికి మూడు పెద్ద పార్టీలు ముమ్మరంగా ప్రయత్నిస్తూ ఉండగా.. రాష్ట్ర పార్టీ సారథ్యం అప్పగించినంత మాత్రాన ఆ వర్గాన్ని ఇంప్రెస్ చేయడం భారతీయ జనతా పార్టీకి సాధ్యం కాలేదు. 

రాష్ట్రంలో బిజెపి ఓటు బ్యాంకు ఒక్క శాతానికి మించి పెరగలేదు. ఈ నేపథ్యంలో కాపు కులం మీద నమ్మకాన్ని వదులుకొని ఇతర మార్గాలలో రాజకీయం చేయాలని బిజెపి సంకల్పిస్తున్నట్టుగా ఉంది. అందుకే దగ్గుబాటి పురందేశ్వరికి కొత్తగా సారథ్యం అప్పగించారని విశ్లేషకులు భావిస్తున్నారు.