రంగబలి ప్రచారానికి సంబంధించి సత్యతో చేసిన ఓ స్పూఫ్ ఇంటర్వ్యూ టీజర్ బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఏబీఎన్ రాధాకృష్ణ, గ్రేట్ ఆంధ్ర మూర్తి, సురేష్ కొండేటి, టీవీ9 దేవి, జర్నలిస్ట్ జాఫర్ లను ఇమిటేట్ చేస్తూ హీరో నాగశౌర్యను ఇంటర్వ్యూ చేశాడు కమెడియన్ సత్య.
దీంతో ఈ ఇంటర్వ్యూలపై కొన్ని ఊహాగానాలు చెలరేగాయి. గ్రేట్ ఆంధ్ర మూర్తి, సురేష్ కొండేటి లాంటి వాళ్లు వీటిని స్వాగతించారు. రాధాకృష్ణ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయంటూ కథనాలు వచ్చాయి. మరోవైపు స్వయంగా కమెడియన్ సత్య, వాటిని టెలికాస్ట్ చేయొద్దని రిక్వెస్ట్ చేసినట్టు వార్తలొచ్చాయి.
అలా చాలా బజ్ క్రియేట్ చేసిన ఆ ఇంటర్వ్యూలు ఎట్టకేలకు బయటకొచ్చాయి. ఎందుకైనా మంచిదని డిస్-క్లైమర్ వేసి మరీ ఇంటర్వ్యూల్ని బయటకు వదిలారు. ఎవ్వరి మనోభావాలు కించపరచడం లేదంటూ వీడియో రిలీజ్ చేశారు. పార్ట్-1 అంటూ ముందుగా మై హార్ట్ విత్ సత్య, ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ విద్ దేవీప్రియ అంటూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో కమెడియన్ సత్య ఎవర్ని ఇమిటేట్ చేశాడనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఈ వీడియోకు గంటల వ్యవథిలోనే లక్షల్లో వ్యూస్ వచ్చాయంటే, ఈ టీజర్ ఎంత వైరల్ అయిందో అర్థం చేసుకోవచ్చు. రంగబలి ప్రచారానికి ఈ ఐడియా బ్రహ్మాండంగా వర్కవుట్ అయింది. ఇదే ఇంటర్వ్యూ పార్ట్-2ను రేపు రిలీజ్ చేయబోతున్నారు.