అనూహ్యంగా తెరపైకి పురందేశ్వ‌రి

ఏపీ బీజేపీ అధ్య‌క్ష రేస్‌లోకి అనూహ్యంగా ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి పేరు తెర‌పైకి వ‌చ్చింది. ఏపీ బీజేపీ చీఫ్‌గా సోము వీర్రాజు ప‌ద‌వీ కాలం పూర్తి కావ‌డంతో కొత్త నాయ‌క‌త్వానికి బాధ్య‌త‌లు అప్ప‌గించేందుకు జాతీయ నాయ‌క‌త్వం…

ఏపీ బీజేపీ అధ్య‌క్ష రేస్‌లోకి అనూహ్యంగా ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి పేరు తెర‌పైకి వ‌చ్చింది. ఏపీ బీజేపీ చీఫ్‌గా సోము వీర్రాజు ప‌ద‌వీ కాలం పూర్తి కావ‌డంతో కొత్త నాయ‌క‌త్వానికి బాధ్య‌త‌లు అప్ప‌గించేందుకు జాతీయ నాయ‌క‌త్వం సిద్ధ‌మైంది. ఈ క్ర‌మంలో బీజేపీ జాతీయ కార్య‌ద‌ర్శి స‌త్య‌కుమార్‌కు దాదాపు ఏపీ బీజేపీ చీఫ్ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం ఖ‌రారైన‌ట్టు వార్త‌లొచ్చాయి.

అయితే బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం మాత్రం మ‌రోలా ఆలోచించింది. ఏపీ బీజేపీ చీఫ్‌గా పురందేశ్వ‌రిని నియ‌మిస్తూ ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి. 2014లో బీజేపీలో చేరిన పురందేశ్వ‌రి వివిధ హోదాల్లో ప‌ని చేశారు. కాంగ్రెస్ పార్టీలో రెండుసార్లు ఆమె ఎంపీగా ఎన్నిక‌య్యారు. అలాగే మ‌న్మోహ‌న్‌సింగ్ నేతృత్వంలోని కేబినెట్‌లో మంత్రిగా కూడా ప‌ని చేశారు.

పురందేశ్వ‌రిపై బీజేపీ జాతీయ నాయ‌క‌త్వం మొగ్గు చూప‌డం ఆస‌క్తిక‌ర ప‌రిణామం. త‌ద్వారా టీడీపీ, వైసీపీల‌కు స‌మాన దూర‌మ‌నే సంకేతాల‌ను బీజేపీ అధిష్టానం ఇచ్చిన‌ట్టైంది. ఎన్నిక‌ల స‌మ‌యంలో పురందేశ్వ‌రికి ఏపీ బీజేపీ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం కీల‌క ప‌రిణామంగా చెప్పొచ్చు. 

బీజేపీలో అంద‌రికీ ఆమోద‌యోగ్య నాయ‌కురాలిగా పురందేశ్వ‌రి మంచి పేరు పొందారు. మాటల్ని పొదుపుగా వాడుతుంటారు. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు దూరంగా వుంటారు. విధాన‌ప‌ర‌మైన చ‌ర్చ‌కు ఆమె ప్రాధాన్యం ఇస్తుంటారు.