దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్నారు మేనక గాంధీ. ఆమె తనయుడు కూడా రెండు దశాబ్దంన్నర కిందట వీర హిందుత్వ నినాదాలతో భారతీయ జనతా పార్టీ నేత అయ్యారు. బీజేపీ తరఫున వరస దఫాలుగా ఎంపీగా నెగ్గుతూ వస్తున్నారు. పిలిభిత్ నుంచి వరుణ్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్నారు.
ఇలాంటి క్రమంలో ఏమైందో ఏమో కానీ.. గత పర్యాయం బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ పై నిరసన ధోరణిని అనుసరిస్తున్నారు వరుణ్ గాంధీ. ప్రత్యేకించి మోడీ ప్రభుత్వ విధానాలపై బాహాటంగానే ఆయన విమర్శలకు దిగారు. దీంతో వరుణ్ ప్రాధాన్యతను ఎప్పటికప్పుడు తగ్గిస్తూ వస్తోంది కమలం పార్టీ.
మోడీ, అమిత్ షా విధానాలను వ్యతిరేకించే వారికి అది బీజేపీ వారైనా తీవ్రమైన పరిణామాలే ఎదుర్కొనాల్సిన తప్పని పరిస్థితి తప్పదు! ఇప్పటికేవ వరుణ్ ను అతడి తల్లి మేనకను పార్టీకి సంబంధించిన పదవుల నుంచి తొలగించారు. 80 మంది సభ్యులతో కూడిన బీజేపీ కేంద్ర కమిటీలో వీరిద్దరి చోటునూ కొన్నాళ్ల కిందటే తప్పించేశారు! ప్రస్తుతం మేనక సుల్తాన్ పూర్ ఎంపీగా, వరుణ్ గాంధీ పిలిభిత్ ఎంపీగా ఉన్నారు. యూపీలోని ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల్లో వరుణ్ కు టికెట్ దక్కబోదని తెలుస్తోంది.
వరుణ్ స్థానంలో భారతీయ జనతా పార్టీ మరొక అభ్యర్థిని కూడా ఎంపిక చేసుకుందట. సాగు చట్టాలు, అలాగే లఖిన్ పుర్ ఖేరీ ఘటనను వరుణ్ ఖండించాడు కూడా. ఈ మధ్యకాలంలో ప్రత్యేకంగా ఆయన విమర్శనాస్త్రాలను సంధించనప్పటికీ.. వరుణ్ కు ఇక టికెట్ ఇచ్చేందుకు బీజేపీ సిద్దంగా లేదని స్పష్టం అవుతోంది.
మరి బీజేపీలో ఉన్నా తను ఇందిర మనవడిని అని గర్వంగా చెప్పుకునే వరుణ్ ఇప్పుడేం చేస్తారనేది ఆసక్తిదాయకమైన అంశం. సొంతంగా పార్టీని నెలకొల్పుతారా.. లేక భారత్ జోడో యాత్ర ద్వితీయ భాగానికి సిద్ధం అవుతున్న తన అన్న రాహుల్ గాంధీతో వరుణ్ కలుస్తారో!