మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ రాజకీయ సంకరాన్ని సృష్టిస్తోంది! బీజేపీ అక్కడి ప్రభుత్వంలో ప్రధాన పార్టీ. అయితే సీఎం మాత్రం శివసేన నేత! శివసేన నుంచి చీల్చుకు వచ్చిన వారి మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. అయితే చీలిక పక్షమే అసలు శివసేన అని ఎన్నికల కమిషను, కోర్టులు అన్నీ చెప్పాయి!
అదే అనుకుంటే.. ఎన్సీపీ చీలిక పక్షం కూడా వెళ్లి ఆ ప్రభుత్వంలో భాగమైంది. ఈ మధ్యనే శివసేన- షిండే పక్షంలో ముసలం మొదలైందని, బీజేపీని వదిలి షిండే పక్షంలోని కొంతమంది ఎమ్మెల్యేలు తిరిగి ఠాక్రే వద్దకు వెళ్లిపోవచ్చనే టాక్ మొదలైంది. అలా వెళ్లే వారిలో షిండేనే ఉన్నా పెద్ద ఆశ్చర్యం లేదనే ప్రచారమూ జరిగింది. పేరుకు ముఖ్యమంత్రి అయినా షిండే కన్నా డిప్యూటీ సీఎం ఫడ్నవీసే ముఖ్యమనే విషయం అర్థమయ్యే అంశమే.
ప్రభుత్వంలో తనకు తెలియకుండా జరుగుతున్న పరిణామాలతో విసిగిపోయి షిండే మూడు రోజులు అలిగి వెళ్లాడనే ప్రచారమూ జరిగింది. అప్పుడే.. అజిత్ పవార్ ను బీజేపీ తన దారికి తెచ్చుకుందనే వార్తలూ వచ్చాయి. అప్పట్లోనేమో అలాంటిదేం లేదన్న అజిత్, చివరకు మొత్తం ఎమ్మెల్యేలందరితోనూ వెళ్లి కమలంతో కలిసి పోయారు!
అజిత్ పవార్ తో పాటు 42 మంది ఎమ్మెల్యేలు 3 ఎమ్మెల్సీలు ఇంకా ఇద్దరు ఎంపీలు కూడా వెళ్లినట్టుగా బీజేపీ క్యాంప్ ప్రకటిస్తోంది. అయితే ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ మాత్రం తిరిగి శరద్ పవార్ ను వెళ్లి కలిశారట! మరి ఈ తిరుగుబాటుకు శరద్ పవార్ ఆశీస్సులు ఉండనే ఉంటాయనే వారూ ఉన్నారు. అయితే పవార్ మాత్రం అజిత్ కు తన ఆశీస్సులు లేవన్నాడు!
మరి ఈ కలగూరగంపతో భారతీయ జనతా పార్టీ ఏం సాధిస్తుందనేది ఆసక్తిదాయకమైన అంశం! ఇటీవలి సర్వేల్లో మహారాష్ట్రలో కాంగ్రెస్- శివసేన(ఠాక్రే)- ఎన్సీపీలు కలిసి పోటీ చేస్తే బీజేపీని దెబ్బతీసే అవకాశం ఉందనే అభిప్రాయం వెళ్లడైంది. ఎమ్మెల్యేలను చీల్చుకున్నంత మాత్రానా వారికి అధికారంలో వాటా ఇచ్చినంత మాత్రానా శివసేన పూర్తిగా శూన్యం అయిపోదనే అభిప్రాయం అయితే ఆ సర్వేల్లో వెళ్లడైంది.
మరి వీలైతే ఠాక్రేతో సంబంధాలను పునరుద్ధరించుకునే ప్రయత్నం చేస్తుందనుకున్న బీజేపీ.. ఇప్పుడు ఎన్సీపీనీ మరో శివసేనగా చేసింది. మరి ఇలాంటి చీలికల పేలికలతో బీజేపీ తను బలోపేతం అవుతుందని అనుకుంటున్నట్టుగా ఉంది. అయితే ఈ పరిణామాలన్నింటినీ ప్రజలు ఎలా తీసుకుంటారనేదే అసలు ప్రశ్న!