1987లో వంగవీటి మోహన్‌రంగా చైతన్య రథం అనే సినిమాను తెరకెక్కించారు. ఆ సినిమా తాజాగా చర్చకు వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా వంగవీటి రంగా తనయుడు రాధా చెప్పడంతో అందరి దృష్టి ఆ సినిమాపై పడింది. ఎందుకంటే వంగవీటి రంగా నాడు కాంగ్రెస్ పార్టీలో చురుకైన నాయకుడు. టీడీపీకి కొరకరాని కొయ్య. వంగవీటి మోహన్‌రంగా బతికి వుంటే కొందరి ఆగడాలు కొనసాగవనే ఉద్దేశంతోనే ఆయన్ను అంతమొందించారు.
రంగా హత్యానంతరం ఎన్టీఆర్ నేతృత్వంలోని టీడీపీ 1989లో దారుణ ఓటమిని మూట కట్టుకోవాల్సి వచ్చింది. రంగాకు సినిమాలపై ఆసక్తి ఉన్న విషయాన్ని ఆయన కుమారుడు రాధా ఇవాళ బయట పెట్టారు. రంగా 76వ జయంతిని పురస్కరించుకుని విజయవాడలోని ఆయన విగ్రహానికి రాధాకృష్ణ మూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాధా మాట్లాడుతూ తన తండ్రిని కులం, మతం, పార్టీలకు అతీతంగా అందరూ గుండెల్లో పెట్టుకున్నారన్నారు.
భౌతికంగా దూరమైనా కొన్ని తరాలకు స్ఫూర్తి ఇచ్చారన్నారు. భవిష్యత్‌లో రంగా అభిమానులంతా ఐకమత్యం చూపాలని ఆయన కోరారు. రంగా పేరు చెప్పుకుని నాయకులుగా కొందరు ఎదిగారని, వారు పట్టించుకోక పోయినా ప్రజల మనసుల్లో రంగా ఉన్నారన్నారు. రంగా పేరు చెప్పుకునే పాలకులే ఆయన పేరు జిల్లాకు ఎందుకు పెట్టలేదో చెప్పాలని డిమాండ్ చేయడం గమనార్హం.
1987లో తన తండ్రి చైతన్య రథం సినిమా నిర్మించారన్నారు. ఆ సినిమా కోసం అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారని చెప్పుకొచ్చారు. ఒక ప్రింట్ దొరికితే దానిని సరి చేసి పూర్తి స్థాయిలో ఆధునీకరించినట్టు రాధా తెలిపారు. రంగా జయంతిని పురస్కరించుకుని ఇవాళ సినిమాను అమెరికాలో విడుదల చేసినట్టు ఆయన వెల్లడించారు. త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో సినిమాను అందుబాటులోకి తెస్తామన్నారు. సోషల్ మీడియాలో సినిమాను అందరూ ఉచితంగా చూసేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదిలా వుండగా రాధాతో పాటు జయంతి వేడుకలో పాల్గొన్న జనసేన నాయకుడు పోతిన మహేశ్ మీడియాతో పాటు నాలుగేళ్లుగా జగన్‌పై రాజకీయంగా ప్రతీకారం తీర్చుకునేందుకు ఎదురు చూస్తున్నారన్నారు. వంగవీటి రంగాకు నిజమైన వారసుడు రాధానే అని అన్నారు. జగన్‌కు రాజకీయంగా గుండెపోటు తెచ్చేలా రాధా చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు.