టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకు రాజకీయంగా ఉజ్వల భవిష్యత్ ఉండాలని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆకాంక్షించారు. టీడీపీ నేత భవిష్యత్‌ను ఆ పార్టీ బద్ధ వ్యతిరేకి అయిన నాని సానుకూల కోణంలో ఆకాంక్షించడం విశేషం. ఇవాళ వంగవీటి మోహన్‌రంగా 76వ జయంతిని గుడివాడలోని వైసీపీ కార్యాలయంలో కొడాలి నేతృత్వంలో ఘనంగా నిర్వహించడం చర్చనీయాంశమైంది.
కొడాలి నాని, వల్లభనేని వంశీ, వంగవీటి రాధా రాజకీయంగా వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా మంచి స్నేహితులు. ఈ ముగ్గురు చెట్టపట్టాలేసుకుని తిరగడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేని సంగతి తెలిసిందే. ఎందుకంటే చంద్రబాబునాయుడు, నారా లోకేశ్‌లను కొడాలి నాని, వల్లభనేని వంశీ తీవ్రస్థాయిలో తిడుతుండటం టీడీపీ నేతలకు అసలు నచ్చడం లేదు.
ఒక్కోసారి చంద్రబాబు, లోకేశ్‌లను వ్యక్తిగతంగా తిడుతున్నా, వంగవీటి రాధా అవేవీ పట్టించుకోకుండా వారితో సవాసం చేయడం ఏంటని టీడీపీ నేతల ప్రశ్న. ఈ నేపథ్యంలో వంగవీటి రాధా జయంతిని కొడాలి నాని నిర్వహించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
కొడాలి నాని మాట్లాడుతూ కులం కోసం కాకుండా, పేదల బాగు కోసం కష్టపడిన మహోన్నత వ్యక్తి రంగా అని కొనియాడారు. నమ్ముకున్న సిద్ధాంతాల కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడిగా ఆయన అభివర్ణించారు. ప్రస్తుత రాజకీయాల్లో రంగా పేరుపై ప్రభుత్వాలే మారిపోయే పరిస్థితి వుందన్నారు. రంగా తనయుడు రాధాబాబుకు రాజకీయాల్లో ఉజ్వల భవిష్యత్‌ను దేవుడు ఇవ్వాలని కొడాలి నాని కోరుకున్నారు.