గ‌దిలో అవివాహితులైన ఆడ‌, మ‌గ కానిస్టేబుళ్లు…కీల‌క తీర్పు

తాళం వేసిన గ‌దిలో అవివాహితులైన ఆడ‌, మ‌గ క‌లిసి ఉండ‌డంపై మ‌ద్రాస్ హైకోర్టు కీల‌క తీర్పు వెలువ‌రించింది. 23 ఏళ్ల పాటు సాగిన ఈ కేసు వెనుక క‌థ ఆస‌క్తిక‌రంగా ఉంది. తాజాగా వెలువ‌రించిన…

తాళం వేసిన గ‌దిలో అవివాహితులైన ఆడ‌, మ‌గ క‌లిసి ఉండ‌డంపై మ‌ద్రాస్ హైకోర్టు కీల‌క తీర్పు వెలువ‌రించింది. 23 ఏళ్ల పాటు సాగిన ఈ కేసు వెనుక క‌థ ఆస‌క్తిక‌రంగా ఉంది. తాజాగా వెలువ‌రించిన సంచ‌ల‌న తీర్పు ఆలోచ‌నాత్మ‌కంగా, స్వాగ‌తించేలా ఉంద‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కేసు పూర్వ‌ప‌రాల‌తో పాటు తీర్పు వివ‌రాల‌ను తెలుసుకుందాం.

ఇది 1998 నాటి మాట‌. చెన్నైకి చెందిన శ‌ర‌వ‌ణ‌బాబు సాయుధ ద‌ళంలో కానిస్టేబుల్‌. చెన్నైలో శ‌ర‌వ‌ణ‌బాబు ఇంట్లో అత‌నితో పాటు అదే ప్రాంతానికి చెందిన మ‌హిళా కానిస్టేబుల్ ఉంది. పెళ్లికాని యువ‌తీయువ‌కులైన వాళ్లిద్ద‌రినీ ఇంట్లో చూసిన స్థానికుల మెద‌ళ్ల‌లో చెడు ఆలోచ‌న‌లు పుట్టాయి. వాళ్లిద్ద‌రిని ఇంట్లో ఉంచి తాళం వేశారు. అనంత‌రం ఈ విష‌య‌మై పోలీస్ ఉన్నతాధికా రులకు స్థానికులు ఫిర్యాదు చేశారు.

పోలీసు అధికారులు వెంట‌నే  అక్కడికి వెళ్లారు. అప్ప‌టికే అక్క‌డ గుంపు పోగ‌య్యారు. పోలీస్ అధికారులు ఇంటి తలుపు తాళాలు తీసి లోపలికి వెళ్లారు. క‌ళ్లెదుట శరవణబాబు, మహిళా కానిస్టేబుల్ క‌నిపించారు. స్థానికుల మాదిరిగానే పోలీస్ అధికారులు కూడా వాళ్లిద్ద‌రి గురించి చెడుగా ఆలోచించారు.

అనంత‌రం విచార‌ణ జ‌రిపి  శరవణబాబు, మహిళా కానిస్టేబుల్ మ‌ధ్య వివాహేత‌ర సంబంధం ఉంద‌ని నిర్ధారించుకున్నారు. ఇది నేరంగా భావించి  శ‌ర‌వ‌ణ‌బాబును ఏకంగా డిస్మిస్ చేస్తూ క‌ఠిన నిర్ణ‌యం తీసుకున్నారు. త‌న‌ను డిస్మిస్ చేయ‌డాన్ని స‌వాల్ చేస్తూ అత‌ను   హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. ఆ పిటిషన్‌పై ఏకంగా 23 ఏళ్ల పాటు విచారణ జరిగి నేటికీ తీర్పు వెల్ల‌డైంది.

ఇరుపక్షాల వాదప్రతివాదనల తర్వాత  హైకోర్టు న్యాయమూర్తి సురే్‌షకుమార్‌ తీర్పు వెలువరించారు. మహిళా కానిస్టేబుల్‌ తప్పుచేయాలనే ఉద్దేశంతో కానిస్టేబుల్‌ శరవణబాబు ఇంటి లోపలకు వెళ్ళినట్టు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవన్నారు. అలాగే అవివాహితులైన ఆడ, మగ ఓ గదిలో ఉంటే తప్పిదంగా భావించాల్సిన అవ‌స‌రం లేద‌ని తీర్పు చెప్పారు.

తాళం వేసిన గదిలో ఓ ఆడ, మగ ఉంటే అక్క‌డ‌ వ్యభిచారం జరిగినట్లు భావించలేమన్నారు. సమాజంలో పలు అభిప్రాయాలు ఉన్నంతమాత్రాన వాటి ఆధారంగా క్రమశిక్షణా రాహిత్య చర్యలు తీసుకోవడమో, శిక్షించడమో భావ్యం కాదని న్యాయమూర్తి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శరవణబాబును మళ్లీ ఉద్యోగంలోకి తీసుకోవాల‌ని న్యాయ‌మూర్తి ఆదేశిస్తూ  తీర్పు ఇచ్చారు. ఆ మేర‌కు న్యాయ‌మూర్తి ఉత్తర్వు జారీ చేశారు. 

మెగాఫ్యామిలీ మొత్తానికి నచ్చేసింది

గెట‌ప్ శీను యాక్టింగ్ సినిమాకే హైలెట్