అనగనగా ఓ ఐపీఎస్ అధికారి. తెలుగుదేశం ఏలుబడి సాగినంత కాలమూ వారికి చెంచాగిరీ చేయడంలో తరించిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నామరూపాల్లేకుండా తొక్కేయడానికి తన వంతు కృషి చేశారు. అయినా ఆయన కష్టం ఫలించలేదు. జగన్ సర్కారు రాగానే.. ఆయనను పక్కన పెట్టింది. సుప్రీం కోర్టు దాకా వెళ్లి తిరిగి సర్వీసులోకి వచ్చారు. సర్వీసులోకి రావొచ్చు గానీ.. ప్రభుత్వం ఆయనను అనుమానంగానే చూస్తున్నదని ఆయన అనుమానం. ప్రభుత్వంతో చిన్న సమస్య వచ్చినా వెంటనే కోర్టుకు వెళ్లిపోతారు. నేను విదేశాలకు వెళ్లాలనుకున్నాను.. నాకు పర్మిషన్ ఇవ్వమని ప్రభుత్వానికి చెప్పండి.. అంటూ తాజాగా కోర్టుకు వెళ్లాడు. ఆయన మరెవ్వరో కాదు.. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు.!
చంద్రబాబునాయుడు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉండగా.. ఆయన పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ గూఢచారి విభాగంగా.. సదరు ప్రభుత్వ శాఖను తయారుచేసేశారు. ప్రత్యర్థి పార్టీల నాయకుల కదలికల మీద కన్నేసి ఉంచడమే తన జీవితధ్యేయంగా భావించారు. ఎన్నికల కోసం ప్రభుత్వం చేయగల సకల అరాచక కార్యక్రమాలకు తనవంతు తోడ్పాటు అందించారు. కానీ పాపం వారి కష్టం ఫలించలేదు.
కోర్టు ఆదేశాల ద్వారా తిరిగి విధుల్లోకి వచ్చిన ఏబీ వెంకటేశ్వరరావు.. తాజాగా విదేశాలకు వెళ్లాలని అనుకున్నారు. అయితే ప్రభుత్వోద్యోగులు విదేశాలకు వెళ్లదలచుకుంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. తెలుగుదేశం హయాంలో గూఢచారి పనిచేసిన ఆయన విదేశాలకు వెళ్లి అక్కడినుంచి కూడా పార్టీ అనుకూల గూఢచర్య పనుల్లో నిమగ్నం కారనే గ్యారంటీ ఏమీ లేదని ప్రజల అభిప్రాయం. అలా జనం అనుమానించదగినంత.. ఆరోపణలు కీలక ఐపీఎస్ ఆఫీసర్ అయిన ఆయన మీద ఉన్నాయి. ఇలాంటి వ్యక్తులను విదేశాలకు అనుమతించడం దేశసమగ్రతకే ప్రమాదకరం అని ఎవరికైనా అనిపించి ఉండవచ్చు.
ఏబీ వెంకటేశ్వరరావుకు విదేశీయాత్రకు అనుమతి ఎందుకు రాలేదో గానీ.. ఆ వ్యవహారం మీద కూడా ఆయన కోర్టును ఆశ్రయించారు. తనకు అనుమతి ఇప్పించాలనేది ఆయన తాజా పిటిషన్. ఆయన విదేశాలకు వెళ్లడం వలన.. ఏదైనా అనూహ్య ఉపద్రవాలు తలెత్తిత్తే బాధ్యత ఎవరు వహించాలనేది ఒక ప్రశ్న. అయితే ఆయన కోర్టు తలుపులు తడుతున్న తీరు చూస్తే.. ముందు ముందు తన సెలవు చీటీని కూడా కోర్టుకు పంపి.. సెలవు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిందిగా కోరుతారని.. పలువురు జోకులేసుకుంటున్నారు.