బండి సంజయ్ కు వ్యతిరేకంగా తెలంగాణ భారతీయ జనతా పార్టీలో కుట్ర జరుగుతున్నదా? ఆయనను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించేలా అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు వ్యూహాత్మక కదలికలు పార్టీలో చోటు చేసుకుంటున్నాయా? అనే అనుమానాలు పలువురిలో కలుగుతున్నాయి. ఈ అనుమానాలను మించి బండి సంజయ్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారందరినీ కూడా తెరవెనుక నుంచి కిషన్ రెడ్డి ఎగదోస్తున్నారా? వారికి తన లోపాయికారీ ప్రోత్సాహం అందిస్తున్నారా అనే అభిప్రాయం కూడా కొందరికి కలుగుతోంది.
బిజెపి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఢిల్లీలో విలేకరులతో ముచ్చటిస్తూ బండి సంజయ్ వైఖరి మీద ఎడాపెడా విరుచుకుపడిన సంగతి అందరికీ తెలిసిందే. తనకు పార్టీలో అన్యాయం జరిగిందని తనకు వ్యతిరేకంగా కుట్ర జరిగిందని అర్థం వచ్చేలాగా రఘునందన్ రావు చాలా అంశాలు వెల్లడించారు. అయితే ఆయన బండి సంజయ్ మీద ఏయే ఆరోపణలు చేశారనేది ఇక్కడ ప్రధానం కాదు. ఎక్కడ నించుని ఆ ఆరోపణలను మీడియా దృష్టికి తీసుకువచ్చారు అనేది మనం గమనించాలి.
తన నియోజకవర్గంలో అభివృద్ధి పనుల గురించి చర్చించేందుకే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వద్దకు వెళ్లానని రఘునందన్ రావు ఒక ముసుగు తగిలించుకున్న మాట చెప్పి ఉండవచ్చు గాక! కానీ, అదే కిషన్ రెడ్డి ఇంటి ప్రాంగణంలో నిల్చుని ఆయన మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్ ను ఉతికి ఆరేశారు. కిషన్ రెడ్డి ప్రోద్బలం ప్రోత్సాహం లేకుండానే ఇంతటి తీవ్రమైన వైఖరిని రఘునందన్ రావు ప్రదర్శించగలరా అని పలువురు అనుమానిస్తున్నారు.
కేవలం రఘునందన్ రావు మాత్రమే కాకుండా భారతీయ జనతా పార్టీలోని చాలామంది నాయకులు బండి సంజయ్ కు వ్యతిరేకంగా ఏకమవుతున్న వాతావరణం కనిపిస్తోంది. ఎందుకంటే రెండు మూడు రోజులుగా ట్విట్టర్లో బండి సంజయ్ నాయకత్వం మీద రాష్ట్ర బిజెపి పార్టీని ప్రక్షాళన చేయడం మీద రకరకాల సెటైర్లు కురిపిస్తున్న మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇవాళ ఈటలను ఆయన ఇంటి వద్ద కలిశారు. ఆయనతోపాటు బండారు దత్తాత్రేయ కూడా ఉన్నారు.
ఈటల కూడా బండి సంజయ్ మీద కస్సుమంటన్నా సంగతి తెలిసిందే. ఈటల, కోమటిరెడ్డి రాజగోపాల్ ఇద్దరూ ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో కూడా బండి సంజయ్ మీద ఆరోపణలనే అధిష్టానానికి నివేదించినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇలా ఈ నాయకులందరూ కూడా ఒక్కసారిగా బయటపడి, బండి సంజయ్ గురించి మాట్లాడడం వెనుక కిషన్ రెడ్డి ప్రమేయం ఉన్నదని అనుమానం పలువురికి కలుగుతోంది.
రాష్ట్ర బిజెపి సారధిగా బండిని తప్పిస్తే ఆయనకు ఉన్నపళంగా కేంద్ర మంత్రి పదవిని కట్టబెడతారేమోనని కిషన్ ఆలోచిస్తుండవచ్చు. దానివలన తన పదవి పోవచ్చు. పదవి పోకపోయినప్పటికీ తెలంగాణలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉంటే తన ప్రాధాన్యం తగ్గవచ్చు.
ఇలాంటి లెక్కలు వేసుకుని కిషన్ రెడ్డి బండి సంజయ్ కు వ్యతిరేకంగా నాయకులను ఎగదోస్తున్నారేమో అనే అభిప్రాయం ఏర్పడుతుంది. అధిష్ఠానం వద్ద బండి ప్రతిష్ఠను దిగజార్చేందుకే జరిగే ప్రయత్నాలేమో అని పలువురు అనుకుంటున్నారు.