2వేల రూపాయల నోట్లను ఉపసంహరిస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటన చేసింది. ఆ తర్వాత వారం, పది రోజుల పాటు అది సంచలనంగా మారింది. ఉపసంహరణపై ఎన్నో చర్చావేదికలు, విశ్లేషణలు జరిగాయి. ఇప్పుడంతా చల్లారింది. మరి ఇప్పటివరకు 2వేల నోట్ల ఉపసంహరణ ఏ మేరకు జరిగింది?
దీనిపై ఆర్బీఐ తాజాగా స్పందించింది. జూన్ చివరి నాటికి దేశవ్యాప్తంగా చలామణిలో ఉన్న 2వేల నోట్లలో 76శాతం నోట్లు వెనక్కి వచ్చినట్టు సంస్థ ప్రకటించింది. వీటి విలువను 2 లక్షల 72వేల కోట్ల రూపాయలుగా వెల్లడించిన రిజర్వ్ బ్యాంక్ ఇండియా.. ప్రస్తుతం మార్కెట్లో 84వేల కోట్ల రూపాయల 2వేల నోట్లు మాత్రమే ఉన్నాయని తెలిపింది.
మే 19న పెద్ద నోటు ఉపసంహరణను ప్రకటించింది ఆర్బీఐ. ఈ ఉపసంహరణకు సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చింది. ప్రారంభంలో కొన్ని బ్యాంకుల నుంచి ఇబ్బందులు తలెత్తినప్పటికీ, ఆ తర్వాత అన్నీ సర్దుకున్నాయి.
ప్రధాన బ్యాంకుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు వెనక్కి వచ్చిన నోట్లలో 87 శాతం నోట్లు డిపాజిట్ల రూపంలో ఉన్నాయట. మిగిలిన 13 శాతం నోట్లను మాత్రమే చిన్న నోట్ల కింద మార్చుకొని, డబ్బులు తీసుకెళ్లారని ఆర్బీఐ తెలిపింది. దీని వల్ల చిన్న నోట్ల కొరత సమస్య ఎదురుకాలేదని సంస్థ తెలిపింది.
ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ప్రకారం చూసుకుంటే, గడువు కంటే ముందే 2వేల నోట్లు అన్నీ వెనక్కి వచ్చే అవకాశం ఉందని ఆర్బీఐ ఆశాభావం వ్యక్తం చేసింది. తిరిగి ఆ నోట్లను మార్కెట్లలోకి పంపిణీ చేస్తారా చేయరా అనే అంశంపై అధికారులు స్పందించలేదు.