పబ్జీ ప్రభావం.. అక్రమంగా ఇండియాలోకి పాక్ మహిళ

దేశవ్యాప్తంగా అక్రమంగా ఇండియాలో నివశిస్తున్న పాక్ జాతీయులు చాలామంది ఉన్నారు. ఎప్పటికప్పుడు ఇలాంటి వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఢిల్లీలో ఓ మహిళతో సహా, ఆమె నలుగురు పిల్లల్ని పోలీసులు అదుపులోకి…

దేశవ్యాప్తంగా అక్రమంగా ఇండియాలో నివశిస్తున్న పాక్ జాతీయులు చాలామంది ఉన్నారు. ఎప్పటికప్పుడు ఇలాంటి వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఢిల్లీలో ఓ మహిళతో సహా, ఆమె నలుగురు పిల్లల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమంగా భారత్ లోకి ప్రవేశించిన ఆమె ఇచ్చిన వివరణ చూసి పోలీసులు షాక్ అయ్యారు.

ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి, పబ్జీ ద్వారా పాకిస్థాన్ కు చెందిన ఈ 30 ఏళ్ల అమ్మాయికి కనెక్ట్ అయ్యాడు. ఇద్దరూ బాగా క్లోజ్ అయ్యారు. కొన్నాళ్ల తర్వాత ఆ క్లోజ్ నెస్ కాస్త ఇంకా పెరిగింది. దీంతో అబ్బాయి వచ్చేయమన్నాడు. ఆ అమ్మాయి వచ్చేసింది.

అయితే ఆమెకు ఇదివరకే పెళ్లయింది. నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. ఈ ఢిల్లీవాసి పిలిచాడని, ఆ పాక్ మహిళ, తన నలుగురు పిల్లలతో కలిసి ఇండియాకు వచ్చేసింది. ముందుగా పాక్ నుంచి నేపాల్ వెళ్లి, అక్కడ్నుంచి ఉత్తరప్రదేశ్ చేరుకొని, అక్కడ్నుంచి బస్ ఎక్కి గ్రేటర్ నొయిడాకు వచ్చింది.

ఆమె కోసం ఆల్రెడీ ఓ ఇల్లు అద్దెకు తీసి ఉంచాడు ఢిల్లీ వాసి. వచ్చిన వెంటనే అందులో అద్దెకు దించాడు. ఇక అంతా సెట్ అనుకున్నాడు.

కానీ అక్కడే కథ అడ్డం తిరిగింది. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఓ యువతి పాక్ నుంచి ఢిల్లీకి చేరుకున్న విషయాన్ని పోలీసులు తెలుసుకున్నారు. వెంటనే జల్లెడపట్టి రబూపుర ప్రాంతంలో అద్దెకుంటున్న మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమెకు ఆశ్రయం కల్పించిన ఢిల్లీ వాసిని కూడా అరెస్ట్ చేశారు.

ప్రస్తుతం ఈ ఇద్దర్నీ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఎలాంటి ఉగ్రవాద లింకులు లేవని తెలిస్తే, మహిళను ఆమె పిల్లలతో సహా తిరిగి పాకిస్థాన్ కు పంపిస్తారు.