విశాఖ ఉక్కు మీద ఒట్టేయనున్న రాహుల్

విశాఖ ఉక్కు అంధ్రుల హక్కు అంటూ అయిదేళ్ళ పాటు ఉద్యమిస్తేనే కానీ స్టీల్ ప్లాంట్ రాలేదు. దాదాపుగా నలభై మంది దాకా ఆత్మ బలిదానం చేస్తేనే తప్ప ఉక్కు దక్కలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్…

విశాఖ ఉక్కు అంధ్రుల హక్కు అంటూ అయిదేళ్ళ పాటు ఉద్యమిస్తేనే కానీ స్టీల్ ప్లాంట్ రాలేదు. దాదాపుగా నలభై మంది దాకా ఆత్మ బలిదానం చేస్తేనే తప్ప ఉక్కు దక్కలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ కి 1971లో  శంకుస్థాపన చేసిన పదేళ్ళ తరువాత కానీ కల సాకారం కాలేదు. ఆ తరువాత పదేళ్ళకు కానీ విశాఖ ఉక్కు ఉత్పత్తిని ప్రారంభించలేదు.

ఇలా కాంగ్రెస్ హయాంలోనే విశాఖ ఉక్కు కర్మాగారం ఎన్ని చిక్కులు పడాలో అన్నీ పడింది. విశాఖ ఉక్కుకు సొంత నిధులు కేటాయించమని మొత్తుకున్నా కాంగ్రెస్ ప్రభుత్వాలు మొర ఆలకించలేదు. అదే చేసుంటే విశాఖ ఉక్కు విషయంలో ఈనాటి బీజేపీ ప్రభుత్వం కన్నెత్తి చూసేది కాదు.

బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేయలనుకుంటోంది. విశాఖ ఉక్కుతో కధ మొదలెడుతోంది. రెండేళ్ళుగా ఆ దిశగా చురుకుగా కార్యక్రమాలు సాగుతున్నాయి. విశాఖ ఉక్కు కర్మాగారం ఈ రోజున పరిస్థితి ఏంటి అంటే నిధుల కోసం వెతుకులాటగా ఉంది. ఆర్ధికంగా దిన దిన గండంగా పరిస్థితి ఉంది.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు విశాఖకు ఆగస్ట్ నెలలో రాహుల్ గాంధీ వస్తున్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రాహుల్ గాంధీ విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం కానీయబోమని ఒట్టేయనున్నారట. ఆయన కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని విశాఖను కాపాడుతామని చెప్పనున్నారని అంటున్నారు.

ఈలోగానే ఉక్కు కధను కంచికి చేర్చాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని అంటున్నరు. రాహుల్ గాంధీ కనుక విశాఖ ఉక్కు ప్రైవేట్ కానీయం అంటే చాలా అర్జంటుగానే కేంద్రం ఆ పని పూర్తి చేసేస్తుంది అన్న బెంగ కూడా ఉందిట. 

రాహుల్ చాలా కాలం క్రితమే విశాఖ రావాలని విశాఖ ఉక్కు మీద కాంగ్రెస్ కి చిత్తశుద్ధి ఉందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. రెండు మార్లు కేంద్రంలో అధికారంలో ఉన్నపుడు సొంత నిధులు ఎందుకు కేటాయించలేదు అన్న ప్రశ్నకు మాత్రం కాంగ్రెస్ వద్ద జవాబు లేదు అంటున్నారు.