సినిమాల ఫలితాల సంగతి పక్కనపెడితే, ప్రతి నెల టాలీవుడ్ రిలీజుల లైనప్ మాత్రం బాగుంటోంది. ఈనెల కూడా బాగుంది. నాగశౌర్య హీరోగా నటించిన రంగబలి నుంచి మొదలుపెడితే, నెలాఖరుకు వచ్చే పవన్ కల్యాణ్ 'బ్రో' వరకు ప్రతి వారం ఓ హైప్ ఉన్న సినిమా థియేటర్లలోకి వస్తోంది.
ముందుగా ఈవారం సంగతి చూద్దాం. ఈ వారం రంగబలి, భాగ్ సాలే సినిమాలు బాగా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. నాగశౌర్య హీరోగా నటించిన రంగబలి సినిమా టీజర్, ట్రయిలర్ రెండూ క్లిక్ అయ్యాయి. దీనికి తోడు వినూత్నంగా ప్రచారం కూడా చేస్తున్నారు. అటు భాగ్ సాలేది కూడా ఇదే వరస. శ్రీసింహా కోడూరి హీరోగా నటించిన ఈ సినిమా ట్రయిలర్ కూడా బాగా క్లిక్ అయింది. అంతకంటే ముందు సిద్ధు జొన్నలగడ్డ వాయిస్ తో విడుదల చేసిన వీడియో కూడా వైరల్ అయింది.
ఈ రెండు సినిమాలపైనే ఈవారం అంచనాలున్నాయి. వీటితో పాటు సర్కిల్, రుద్రంగి, 7:11PM అనే మరో 3 సినిమాలు కూడా వస్తున్నాయి. లాంగ్ గ్యాప్ తర్వాత నీలకంఠ దర్శకత్వంలో సర్కిల్ సినిమా వస్తుండగా.. జగపతిబాబు లీడ్ రోల్ లో రుద్రంగి, సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో 7:11PM సినిమాలు వస్తున్నాయి.
రెండో వారంలో.. బేబీ మూవీ థియేటర్లలోకి వస్తోంది. సాయిరాజేష్ డైరక్ట్ చేసిన ఈ సినిమాను ఎస్కేఎన్ నిర్మించాడు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి హీరోహీరోయిన్లు. ఈ సినిమాలో 2 సాంగ్స్ పెద్ద హిట్టయ్యాయి. అవే ఈ సినిమాను లైమ్ లైట్లో నిలబెట్టాయి. దీంతో పాటు శివకార్తికేయన్ హీరోగా నటించిన మహావీరుడు సినిమా కూడా ఇదే వారంలో వస్తోంది.
మూడో వారంలో.. అన్నపూర్ణ ఫొటోస్టూడియో, హత్య లాంటి సినిమాలొస్తున్నాయి. అన్నపూర్ణ ఫొటోస్టుడియో ట్రయిలర్ బాగుంది. అంతకుమించి ఈ సినిమాపై ప్రస్తుతానికైతే బజ్ లేదు. ఇంకా టైమ్ ఉంది కాబట్టి ఏం చేస్తారో చూడాలి. ఇక బిచ్చగాడు-2 తర్వాత విజయ్ ఆంటోనీ నుంచి వస్తున్న మూవీ హత్య. ఈ సినిమా కూడా ఇదే వారంలో వస్తోంది (21న) వస్తోంది.
జులై నెలకు ఫినిషింగ్ టచ్ ఇవ్వబోయే సినిమా బ్రో. పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ హీరోలుగా నటించిన మూవీ ఇది. ఈ నెలలో వస్తున్న ఒకే ఒక్క పెద్ద సినిమా కూడా ఇదే. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే-మాటలు అందించాడు. ఇప్పటికే రిలీజైన టీజర్ పెద్ద హిట్టయింది.
ఇలా ఈనెల మూవీస్ లైనప్ చూడ్డానికి బాగానే ఉంది. ఎన్ని క్లిక్ అవుతాయో చూడాలి. జూన్ నెలలో కూడా లైనప్ దాదాపు ఇలానే కనిపించింది. కానీ ఆదిపురుష్ రూపంలో ఇండస్ట్రీకి పెద్ద దెబ్బ తగిలింది. ఈనెల అలాంటి షాకులు తగలకుండా ఉంటే అదే చాలు.