తెలంగాణ బీజేపీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. తాజాగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పుస్తెలు అమ్మి ఎన్నికల్లో పోటీ చేసిన బండి సంజయ్‌కి యాడ్స్ ఇవ్వడానికి రూ. 100కోట్లు ఎక్కడి అంటూ ప్రశ్నించారు. అదే వంద కోట్లు తనకు ఇస్తే తెలంగాణను దున్నేసేవాణ్ణి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పార్టీ కోసం 10ఏళ్లుగా పని చేస్తున్న పార్టీ తనకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని.. దుబ్బాకలో కూడా తన వల్ల మాత్రమే గెలిచానంటూనే మరోసారి దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందుతానని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తా అని చెప్పిన అమిత్ షా ఆయన్ను గెలిపించలేకపోయారని.. పార్టీ సింబల్ అనేది చివరి అంశంగా పేర్కొన్నారు.
రెండేళ్లుగా జిహెచ్ఎంసిలో ఫ్లోర్ లీడర్లను, శాసన పక్ష నాయకుడిని కూడా నియమించలేదని.. పార్టీ నడిపించేది ఇలాగేనా అంటూ ప్రశ్నించారు. జాతీయ అధ్యక్షుడిపై ప్రధానికి ఫిర్యాదు చేస్తానన్నారు. తనకు జాతీయ అధికార ప్రతినిధి లేకపోతే బీజేపీ శాసన పక్ష నేత లేదా రాష్ట్ర అధ్యక్షుడు హోదాలో ఏదో ఒకటి ఇస్తేనే పార్టీలో ఉంటానంటూ ఇన్ డైరెక్ట్‌గా హెచ్చరించారు. లేనిపక్షంలో తన దారి తను చూసుకుంటానన్నారు.
కాగా ఎన్నికలకు ఆరు నెలలు మాత్రమే ఉన్న తెలంగాణ బీజేపీలో గొడవలు మాత్రం తారా స్థాయికి చేరుకున్నాయి. ఈటల, బండి సంజయ్‌లు వర్గాలుగా విడిపొయి మీడియాలో ఒకరిపై ఒకరు విమర్శించుకుంటున్నారు. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మాత్రం విభేదాలు పక్కకు పెట్టి పార్టీ కోసం కష్టపడుతున్నారు. ఎన్నికల దృష్టిలో పెట్టుకొని జాతీయస్థాయిలో పార్టీ ప్రక్షాళన పై దృష్టి పెట్టింది బీజేపీ అధిష్టానం.. త్వరలోనే తెలంగాణ బీజేపీలో కూడా మార్పులు రాబోతున్నాయి అంటూ సంకేతాలు వస్తున్నాయి.