టీఆర్ఎస్ నేత, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన కుమార్తె డాక్టర్ తాటి మహాలక్ష్మి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఇటీవల తాటి మహాలక్ష్మి వైద్య విద్య పూర్తి చేసింది. ఉన్నత విద్య చదివి తనకు మంచి పేరు తీసుకొస్తుందని భావించిన వెంకటేశ్వర్లుకు తీవ్ర శోకాన్ని మిగిల్చి, అనంత లోకాలకు వెళ్లిపోయింది.
సారపాకలో మహాలక్ష్మి తుదిశ్వాస విడిచింది. గురువారం తెల్లవారి ఎండెక్కినా కూతురు గది తలుపులు తెరవకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానించారు. దీంతో గది తలుపులు తట్టి నిద్రలేపేందుకు యత్నించారు. మహాలక్ష్మి నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. గది తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. ఉరికి వేలాడుగా విగతజీవిగా కనిపించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
మహాలక్ష్మిని కిందికి దింపి వెంటనే భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రిలో కూతురి శవాన్ని చూసి వెంకటేశ్వర్లు కన్నీటిపర్యంతం అయ్యారు. ఆయన్ను ఓదార్చడం ఎవరివల్లా కాలేదు.
ఎంబీబీఎస్ పూర్తయి, పీజీ అడ్మిషన్ కోసం ప్రిపేర్ అవుతున్న కూతురిని విగతజీవిగా చూడాల్సి రావడంపై మాజీ ఎమ్మెల్యే తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.