ప్రమాణ స్వీకారాలు జరిగిన మొదటి రోజు ఏకంగా 11 మంది ఎమ్మెల్యేల నుంచి అసమ్మతి.. రెండో రోజు ఆ సంఖ్య పూర్తిగా 5కి పడిపోయింది.. మూడో రోజు 2కి పడిపోయింది.. ఇప్పుడు సున్నా. పార్టీలో ముసలం లేదు. అసమ్మతి స్వరం లేదు. అంతా జై జగన్ అనేశారు. ఆవేశంతో ఆందోళనలు చేసినోళ్లు సర్దుకున్నారు. కాస్త సీరియస్ గా ఉన్నోళ్లతో జగన్, సజ్జల మాట్లాడి సర్దిచెప్పారు. ఏ అసమ్మతి ఎమ్మెల్యే.. ఏ స్టేట్ మెంట్ ఇచ్చారో చూద్దాం.
మాజీ మంత్రి బాలినేని..
” నేను వైఎస్ఆర్ కుటుంబంలో వ్యక్తిని, నేను రాజీనామా చేస్తున్నానని తప్పుడు ప్రచారం చేసినవాళ్లపై పరువు నష్టం కేసు వేస్తా. మంత్రి పదవి లేదు అని తెలిసినప్పుడు కాస్త ఫీలయ్యా అంతే. జగన్ తోనే ఉంటా, వైసీపీ నాయకుడిగానే పనిచేస్తా. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం కష్టపడతా “
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి..
మంత్రి పదవి రాలేదని తెలిసిన రోజు మీడియా ముందు ఏడ్చేశారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మరుసటి రోజే జగనన్న మాట, గడపగడపకు కోటంరెడ్డి బాట అనే పేరుతో జనంలోకి వెళ్లారు. పార్టీ నాయకులకు రాజీనామాలు చేయొద్దని తేల్చి చెప్పారు. జగన్ వెంటే ఉంటానన్నారు. జగన్ జట్టులోనే కొనసాగుతానన్నారు.
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి..
“వైసీపీ అంటే మా పార్టీ. వైఎస్ జగన్ వెంట మొదటి నుంచీ నడిచిన వ్యక్తిని నేను. కేబినెట్ లో సామాజిక సమీకరణలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు భాగస్వామ్యం కల్పించారు. అందువల్ల సీనియర్లకు అవకాశం రాలేదు. 2024 ఎన్నికలే మా టార్గెట్. ఏ బాధ్యత ఇచ్చినా పూర్తి స్థాయిలో పనిచేస్తా.”
సామినేని ఉదయభాను..
“మంత్రి పదవిపై నేను అసంతృప్తితో ఉన్నానన్న ప్రచారం అవాస్తవం. జగన్ ఇచ్చిన పని ఏదైనా సంతోషంగా చేస్తా. పార్టీ కోసమే పనిచేస్తా.”
కొలుసు పార్థ సారథి..
” నాపై కూడా తప్పుడు ప్రచారం జరిగింది. సీఎం జగన్ కు అంతా వివరించా. పార్టీకోసం కష్టపడతా. 2024లో వైసీపీకి భారీ మెజార్టీ వచ్చేటట్టు పనిచేస్తా.”
చివరిగా మేకతోటి సుచరిత..
” వైఎస్ కుటుంబంలో మనిషిగా నాకు ఎప్పుడూ ఆదరణ ఉంది. రాజకీయాల్లో ఉన్నంత కాలం జగన్ వెంటే ఉంటాను. కేబినెట్ లో కొంతమందిని మారుస్తామని సీఎం జగన్ ముందే చెప్పారు. కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యల వల్లే ఇంటి నుంచి బయటకు రాలేకపోయాను. కేబినెట్ పునర్ వ్యవస్థీరణ విషయంలో సీఎం జగన్ నిర్ణయానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాను. నేను పంపింది ఒక లేఖ అయితే దాన్ని రాజీనామా లేఖ అంటూ తప్పుడు ప్రచారం చేశారు.”
ఇదీ అసంతృప్తులు అనుకుంటున్నవారు చెప్పిన మాటలు. అంటే దాదాపుగా అందరూ జగన్ తో మాట్లాడిన తర్వాత స్థిమితపడ్డారు. మంత్రి పదవి దక్కకపోవడంతో కాస్త దిగులు పడ్డా, అనుచరులు ఆందోళన వ్యక్తం చేసినా.. ఇప్పుడంతా సర్దుకున్నారు.
జగన్ తోనే ఉంటామని, జగన్ జట్టుగానే రాజకీయాలు చేస్తామని చెప్పారు. దీంతో టీడీపీ, దాని అనుకూల మీడియా ఆశ నెరవేరలేదు. ఇక ఈ ఇష్యూని సాగదీసేందుకు కూడా వారికి అవకాశం లేదు.