సీనియర్ ఐఏఎస్ అధికారి, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి వై.శ్రీలక్ష్మి అత్యుత్సాహం మళ్లీ సమస్యను తీసుకొచ్చింది. కోర్టు ధిక్కరణ కేసులో ‘సేవా శిక్ష’కు సమ్మతించి, తిరిగి పునఃసమీక్షించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించడంపై న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
పాఠశాలల ప్రాంగణాల్లో గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలను తొలగించాలని గతంలో హైకోర్టు ఆదేశాలను పాటించని కేసులో 8 మంది ఐఏఎస్ అధికారులపై జస్టిస్ బట్టు దేవానంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ధిక్కరణపై కఠిన శిక్షకు న్యాయస్థానం సిద్ధమైంది. అయితే ఐఏఎస్ అధికారులు క్షమాపణ కోరడంతో హైకోర్టు కూడా సానుకూల తీర్పు వెలువరించింది. ‘సేవా శిక్ష’ విధించింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో సామాజిక సేవ చేయాలని ఆదేశించింది.
నెలలో ఒక ఆదివారం చొప్పున 12 ఆదివారాలు సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులతో గడపాలని, ఒక పూట వారికయ్యే భోజన ఖర్చులను ఐఏఎస్ అధికారులే భరించాలని న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఆదేశించారు. ఈ తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ శ్రీలక్ష్మి అనుబంధ పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కోర్టు ధిక్కరణకు గాను మొదట రెండు వారాల సాధారణ జైలు శిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధించామని.. భేషరతుగా క్షమాపణలు చెబుతూ.. సామాజిక సేవ చేయడానికి అంగీకరించడం వల్లే శిక్షను సవరించామని న్యాయమూర్తి గుర్తు చేశారు. సామాజిక సేవకు అంగీకరించి.. ఇప్పుడు పునఃసమీక్షించాలని కోరుతూ రివ్యూ పిటిషన్ వేయడం ఏంటని న్యాయమూర్తి ప్ర శ్నించారు. న్యాయస్థానం దృష్టిలో పిటిషనర్‌కు విధించింది అసలు శిక్షే కాదన్నారు.
శ్రీలక్ష్మి అనుబంధ పిటిషన్‌ను కోర్టు కొట్టి వేసింది. ఇదే సందర్భంలో పాఠశాలల ప్రాంగణాల్లో సచివాలయాలు, ఆర్బీకేలను తొలంగించినట్టు న్యాయస్థానానికి తప్పుడు అఫిడవిట్ సమర్పించారని, ఈ విషయం జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ విచారణలో నిర్ధారణ అయ్యిందని, కావున ఐఏఎస్ అధికారులపై తిరిగి ధిక్కరణ కేసు తెరుస్తామని న్యాయమూర్తి తేల్చి చెప్పారు.
దీంతో ధిక్కరణ కేసు వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. కోర్టు ఆదేశాలను అమలు చేయకుండా తప్పించుకునే ప్రయత్నాలను ఉపేక్షించేది లేదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. తన తమ్ముడు బీఆర్ అంబేడ్కర్ కూడా ఈ రాష్ట్రంలో ఐఏఎస్ అధికారిగా ఉన్నారని.. ఈ ఎనిమిది మంది ఐఏఎస్‌లలో ఆయన ఉన్నా ఇదే శిక్ష వేసేవాడినని జస్టిస్ బట్టు దేవానంద్ స్పష్టం చేయడం విశేషం. ఇదిలా వుండగా శ్రీలక్ష్మి ఒకటి ఊహిస్తే, అందుకు భిన్నంగా కోర్టు స్పందించింది. శ్రీలక్ష్మి పిటిషన్ వల్ల తిరిగి అందరిపై ధిక్కరణ కేసు తెరవడానికి కారణమైందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.