అభివృద్ధి పనులు చేసి, బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్న తమ నాయకుల్ని చూస్తుంటే కన్నీళ్లొస్తున్నాయని ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పనులు చేస్తే సంవత్సరాల తరబడి బిల్లులకు నోచుకోని పరిస్థితి తెలిసిందే. ఖజానా సొమ్మంతా సంక్షేమ కార్యక్రమాల అమలుకే సరిపోతోంది.
ఇటీవల తమకు బిల్లులు చెల్లించాలని కోరుతూ కాంట్రాక్టర్లు వినూత్న నిరసనకు దిగిన సంగతి తెలిసిందే. బిల్లుల విషయంలో ప్రభుత్వ బాధితులుగా పార్టీలకు అతీతంగా కాంట్రాక్టర్లంతా ఉన్నారు. ఈ నేపథ్యంలో వసంత కృష్ణప్రసాద్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.
తన నియోజకవర్గ పరిధిలో సుమారు రూ.200 కోట్ల పనులకు బిల్లులు రావాల్సి ఉందన్నారు. మైలవరం పంచాయతీ ఉపసర్పంచ్ సీతారెడ్డి రూ.2.5 కోట్ల పనులు చేశారన్నారు. బిల్లులు ఆలస్యం కావడంతో 5 ఎకరాల మామిడి తోటను సీతారెడ్డి అమ్ముకున్నారని వాపోయారు. ఈ విషయం తెలిసి ఆయనకు క్షమాపణ చెప్పినట్టు వసంత కృష్ణప్రసాద్ తెలిపారు.
స్వగ్రామంపై ప్రేమతోనే బిల్లులు ఆలస్యమైనా సొంత నిధులు ఖర్చు చేసి పనులు పూర్తి చేశానని సీతారెడ్డి చెప్పడంతో తనకు కన్నీళ్లు వచ్చాయన్నారు. ఇదిలా ఉండగా వసంత కృష్ణప్రసాద్ వ్యాఖ్యలపై నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. సీతారెడ్డికి కనీసం పొలం ఉండడం వల్ల అమ్ముకున్నారని, అది లేని వాళ్లు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేయడం విశేషం.
సంక్షేమం పేరుతో ఇతరులను ఇబ్బంది పెట్టడం సబబా అని ప్రశ్నిస్తున్నారు. ఇలా ఐదేళ్లు పాలించేందుకేనా అధికారం కట్టబెట్టిందని నిలదీసేవాళ్ల సంఖ్యకు కొదవలేదు.