అద్భుతరస యామిని ఇంట్రో::
“కథలు చెప్పుకోడానికి మాంచి అనువైన వాతావరణం ఏర్పడింది కదూ.. ముఖ్యమంత్రిణి గారు వరద ప్రాంతాలు చూడ్డానికి వచ్చి ఈ బంగళాలో ఇరుక్కుపోవడం, మందీ, మార్బలం ఉన్నా ఎటు వెళ్లడానికి వీలులేక నిస్సహాయంగా ఉండరావలసిరావడం, ఇంతమందిమీ ఈ రాత్రి ఇక్కడ ఎలా గడపాలో తెలియక కొట్టుమిట్టులాడడం…తోచుబాటు కోసం కథలు చెప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడినట్టుంది కదూ!” అన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఆచారి.
“నా మనస్సులో ఉన్నమాట గారు ఆచారి గారు చెప్పేసారు. చిత్రంగా ఇక్కడ చిక్కడిపోయాం కదూ. బయట చూడండి, చుట్టూ నీళ్లు. ఈ బంగళాయే ఒక దీవిలా ఉంది. ఆకాశం. భూమీ కలిసిపోయినట్టున్నాయి. పైనా, కిందా ఎక్కడ చూసినా కరక్కాయ సిరా వూసేసినట్లు ఒకటే నలుపు. రాత్రి ఎనిమిదయిందో, లేదో అప్పుడే..” అని ముఖ్యమంత్రిణి అంటూండగానే, ఇంకో జర్నలిస్టు చనువు కలిపించుకుని, “సీఎమ్ గారికి కవిత్వం వచ్చేస్తోంది. ఏం మేడమ్, పుస్తకాలు బాగా చదివే అలవాటా?'' అన్నారు.
నడివయస్కురాలైన ముఖ్యమంత్రిణి సిగ్గు పడ్డారు. “కాలేజీ రోజుల్లో బాగా అలవాటు ఉండేదండి. స్టూడెంటు పాలిటిక్స్‌లో పడిన దగ్గర్నుంచి ఆ సరదాలన్నీ వెనకబడ్డాయి. ప్రతిపక్షంలో ఉన్నా, పాలకపక్షంలో ఉన్నా సరే రాజకీయాలంటే ఫుల్ టైమ్ ఏక్టివిటీ. సాటి పొలిటీషియన్స్ గోడు వినాలి. ప్రజల కష్టాలు, కడగండ్లూ వినాలి. ఇక దాంతో మరేదీ వినడానికి టైముండదు. కానీ ఇవన్నీ విషాద గాథలే. సుఖాంతమైన కథ వినిపించడానికి మన దగ్గరకి ఎవరూ రారు. మరోరకం కథలు వినడానికీ, చెప్పడానికి కూడా తీరికేదీ?”
“మేడమ్, ఈ అనుభవం తర్వాత సస్పెన్స్ కథ విన్నట్టుగా కూడా లెక్కేసుకోండి. మనం అసలు ఈ వరదలోంచి బయట పడతామా, లేదా? బయటి ప్రపంచంతో సంబంధం తెగిపోయి, సెల్‌ఫోన్ సిగ్నల్స్ లేక, ఏ కమ్యూనికేషన్ అందని పరిస్థితుల్లో ఉన్న మనం ఎక్కడున్నామో బయటున్న వాళ్లకు తెలుస్తుందా, లేదా? లేక ఈ లోపుగానే మనం వరదలో కొట్టుకుపోతామా?” అంటూ కాస్త వెక్కిరింతగానే మాట్లాడాడు ఓ కుర్ర జర్నలిస్టు.
“ఈ కథలో డ్రామా కూడా బోల్డంత ఉంది మేడమ్, సాధారణంగా సీఎంలందరూ హెలికాప్టర్లో చూసి వెళిపోతూ ఉంటే మీరు మాత్రం కారులో బయల్దేరడం, వరద సహాయ కార్యక్రమాలెలా జరుగుతున్నాయో చూడండంటూ మా జర్నలిస్టులందర్నీ వాన్‌లో తోడు రమ్మనడం, చూసి వెళుతూంటే హఠాత్తుగా ఏరు పొంగడం, మన వాహనాలు ఢీకొని, ఏట్లో పడి మనం తెచ్చుకున్న ఫోన్లూ, వగైరా సామగ్రి అంతా కొట్టుకుపోవడం, అంతా మిస్టరీ నవల్లా లేదూ? పైగా ఈ బంగళా కూడా చూడండి. పాత జమీందారు గారి భవంతనుకుంటా. కరంటు సౌకర్యమే లేదు. దీంట్లో ఎవరో వంటవాడు, వాచ్‌మన్ ఉన్నారంతే. ఇక ఈ బిల్డింగులో పాత ఫోటోలు ఏవో చూపించడం, వాటిని చూస్తూ మీరు పూర్వజన్మ గుర్తుకు తెచ్చుకోవడం ఒకటే మిగిలింది.” అన్నాడు ముఖ్యమంత్రిణికి చాలా కాలంగా తెలిసున్న మరో జర్నలిస్టు.
ముఖ్యమంత్రిణి చిరునవ్వు నవ్వారు. “చూడండి సుబ్బారావు గారూ, ఇన్ని ఇక్కట్లు పడ్డా, నేను గానీ, చుట్టూ ఉన్న సిబ్బంది గానీ, మీ జర్నలిస్టులు గానీ ఎవ్వరమూ గాయపడలేదు. సమ్‌థింగ్ స్ట్రేంజ్ కదూ.. మీరన్నారు. చూసారూ, పూర్వజన్మ కథలనీ అలాటివి భలే ఇంట్రస్టింగ్‌గా ఉంటాయి. పక్కన గాడిపొయ్యి పెట్టి వంట వండుతున్నారులా ఉంది. మంటలూ, వాటి నీడలూ చూడండి. ఫయర్-సైడ్ స్టోరీ అంటారు చూసారా, అలాటివి చెప్పుకోడానికి మాంచి అనువుగా దెయ్యాలూ, భూతాలూ, పూర్వజన్మలూ, కనికట్టు కథలూ ఇలాటివి చెప్పుకుంటే భలే ఉంటుంది. మనని డిస్టర్బ్ చేయడానికి టీవీలు, సెల్‌ఫోన్లు ఏవీ లేవు. అందువల్ల కథలో పూర్తిగా లీనమవుతాం. ఒకసారి బయట ప్రపంచంలో పడితే అందరికీ ఉరుకులూ, పరుగులే. ఈ రాత్రి కథలతోనే తెల్లారుద్దాం. ఏమంటారు ఆచారి గారూ, కథల ఐడియా మొదలు పెట్టినది మీరేగా?”
“ఐడియా బావుంది. కానీ, ముందు మీరిది చెప్పండి. మీకు దయ్యాలంటే నమ్మకం ఉందా, లేదా? నమ్మకం లేకపోతే కథలు రక్తి కట్టవు.”
‘‘నమ్మకాల విషయానికొస్తే, ఎటూ చెప్పలేను. ఆ మాట కొస్తే దేవుడి విషయంలోనూ నా కేమీ తెలియదు. ఏదో అలవాటుగా, చిన్నప్పణ్నుంచి ఇంట్లో నేర్పించిన పద్ధతి ప్రకారం దేవుడికి దండం పెట్టుకుంటాను తప్ప, ఆయన ఉనికిని గురించి తర్కించను. అంత తీరికా లేదు, ఆసక్తి లేదు. ఎవరో వేదాంతులు చేయవలసిన పని అది, అలాగే దెయ్యాల సంగతీ… నా కిప్పటిదాకా అవి తారసిల్ల లేదు. కానీ ఆ అనుభవాలు ఎదురైన వారు చెప్పిన మాట అంత త్వరగా కొట్టేయను. ప్రతీ జ్ఞానానికి పరిమితులున్నాయి, ఏమంటారు? అన్నిటికీ సైన్స్ లో సమాధానాలు కావాలంటే భవిష్యత్తులో దొరుకుతాయేమో కానీ ప్రస్తుతానికి సైన్స్ కూడా చెప్పలేనివి కొన్ని ఉన్నాయి కదా. వాటిలోంచి కథలు చెప్పమంటున్నాను. ఒకలా ఆలోచిస్తే గ్రహణం రోజున చంద్రుణ్ని పాము మింగిందని అనుకోడంలో థ్రిల్ ఉంది. భూమి అడ్డు వచ్చి అలా తెలిసిన తర్వాత, మిస్టరీ విడిపోయి అందులో సరదా పోతుంది. అందువల్లనే ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న సైన్స్‌కి అందని విషయాల గురించి మీ అనుభవంలోకి వచ్చినవి చెప్పండని అడుగుతున్నాను.”
‘‘.. అంటే ఇంట్లో మంచంపై పడుక్కుంటే దెయ్యాలు ఎత్తుకెళ్లి పొలంలో పడేసాయని చెప్తారు. అలాటి కథలా? అవే ఉంటే మనను ఇక్కణ్నుంచి రాజధానిలో పడేయమని అడగచ్చుగా?” అన్నాడు ఇందాకటి కుర్ర జర్నలిస్టు.
“తర్కించకు బాబూ, తర్కిస్తే కథలో సొగసు పోతుంది. అలా అని లేనిపోనివి సృష్టించి చెప్పకండి. మీరిక్కడ నలభైమంది జర్నలిస్టులున్నారు. వార్తల సేకరణలో రకరకాల కథలు, కట్టు కథలూ కూడా వినివుంటారు. వాటిలో వాస్తవాలు వెతికి పట్టుకునే ప్రయత్నం చేసి వుంటారు. అవి చెప్పండి. అలాగే నాతో పాటు వచ్చిన అధికారులున్నారు. నేరవిచారణలో అనుకోకుండా ఇటువంటివి తారసిల్లి వుండవచ్చు. అన్యాయంగా చచ్చిపోయినవాళ్లు భూతాలై తమను చంపిన వాళ్లను పట్టుకోడానికి పోలీసులకు ఏదో రూపంలో సాయపడివుండవచ్చును. లేదా హైవే మీదో, చింతచెట్టు మీద నుంచో దెయ్యం లిఫ్టు అడిగిందని ఏ లారీ డ్రైవరో పోలీసు స్టేషన్లో రిపోర్టు ఇవ్వడానికి వచ్చినప్పుడు వీళ్లను కలిసి చెప్పి వుండవచ్చు, వీళ్లూ తమ అనుభవాలు చెప్పవచ్చు. వీళ్లే కాదు, నన్ను కలుసుకోవడానికి వచ్చిన స్థానిక నాయకులు ఉన్నారు. పల్లెటూళ్లలో కోరికలు తీరక నూతిలో పడి చచ్చిన స్త్రీలు కామినీ పిశాచాలయ్యారనీ, శ్మశానంలో కొరివిదయ్యాలు బాటసారికి దారి చూపించాయనీ అనేక కథలు చెప్తూ వుంటారు. దెయ్యాలొకటే కాదండి. ఇఎస్‌పీ ఉన్నవాళ్లు, ఆంజనం వేసేవాళ్లు, కలల బట్టి భవిష్యత్తు ఊహించి చెప్పేవాళ్లు, దీర్ఘరోగికి మందుగా ఏ మూలిక పేరో చెప్పి ఆ తర్వాత కనబడకుండా మాయమయిపోయే సాధువులు, బైరాగులు – ఏదైనా సరే, సమ్‌థింగ్ అన్‌కాన్నీ- తర్కానికీ, ఇప్పటిదాకా చెప్పేవాళ్లు తెలిసిన సైన్సుకీ, హేతువాదానికీ అందనిది, ప్రధానాంశంగా కలిగిన వాటిని కథల్లా చెప్పండి.’’
“సీఎమ్ గారూ, మీరు సైన్స్ పక్షపాతి అని ప్రచారం జోరుగా సాగుతోంది. చూస్తే ఇలాటి కథలు చెప్పమంటున్నారేమిటి మేడమ్?” అన్నాడు మరో ఆయన చిరునవ్వు నవ్వుతూనే. ముఖ్యమంత్రిణి పెద్ద పెట్టున నవ్వేసారు. “భలేవారే, సైంటిఫిక్ అప్రోచ్ ప్రతీదానికీ ఉండాల్సిందేనండి. కానీ ఇవి కథలు. కథల్లో అద్భుత రసం పోషింపబడాలంటే కాస్సేపు రీజనింగ్ పక్కన బెట్టాలి. శ్రీశ్రీ గారు కూడా నవరసాల కథల్లో ఆద్భుతరసం కథ క్రింద 'పెట్టెలో భద్రపరిచిన లెనిన్ మృతదేహానికి కాస్సేపు ప్రాణం వస్తే?' అన్న ఊహ మీద కథ అల్లలేదూ? కథలో రంజు ఉండాలంటే ఆ పాటి ఊహ తప్పులేదు. అలా అని మిమ్మల్ని ఊహించి చెప్పమనటం లేదు. మీ కెదురైన అనుభవాల గురించే చెప్పమంటున్నాను. చెప్పేటప్పుడు కథలా.. కాస్త మలుపు, ఓ చిన్న ట్విస్ట్ ఉండేట్లా చెప్పమంటున్నాను. ముందుగానే చిన్న రిక్వెస్టు అడిగేం కదాని వివరంగా చెప్పకండి. పదినిమిషాల్లో కథ అయిపోయేట్లా చెప్పండి. వర్ణనలు వద్దు. ఇక్కడున్న అందరికీ అలాటి కథల వాతావరణం ఎలా ఉంటుందో తెలుసు. తెలియకపోతే చుట్టూ ఒకసారి చూస్తే చాలు…”
“మొత్తానికి ఈ రాత్రంతా ఇలాటి కథలతో గడిపేద్దామంటారు. ముషాయిరాలకు 'శామ్-ఏ-ఘజల్' అని పేరు పెట్టినట్లు ఈ కథల సెషన్ కి 'ఈ యామిని- అద్భుతరస వాహిని' అని పేరు పెడదామా?” అన్నారొకరు. “పేరు బాగుంది. యామిని అంటే రాత్రి అనేగా. అంతకంటే సింపుల్‌గా 'అద్భుతరసయామిని' అని పెట్టేస్తే?” అన్నారు ముఖ్యమంత్రిణి. “ఇంకా బాగుంది.” అని అన్నారు జనం ఒక్కపెట్టున. “మరింకేం? టీలు కూడా వచ్చేశాయి. తాగుతూ కథలు మొదలు పెట్టండి.” అన్నారు ముఖ్యమంత్రిణి.
మొదటి కథ: ఛాయాచిత్రం ఛాయ
“ఈ అతీంద్రియ శక్తుల గురించి చెప్పాలంటే ఆడవాళ్లే చెప్పాలండి. గమనించారో లేదో ఈ దెయ్యాలూ అవి ఆడవాళ్లకే ఎక్కువగా కనపడతాయి. అందుచేత కథలు చెప్పడంలో కూడా లేడీస్ ఫస్ట్ అంటాను. ఎవరు ముందుకొస్తారో మరి?” అన్నారు ఆచారి గారు.
ముఖ్యమంత్రిణి గారి వ్యక్తిగత సిబ్బందిలోని ఒక మహిళా సబ్-ఇన్ స్పెక్టర్ గొంతు సవరించుకుంది. “సీఎమ్ గారు కథల గురించి బాగా చెప్పారు. నా అనుభవంలోకి వచ్చిన చిక్కుముడిని మీ అందరి ముందూ ఉంచుతున్నాను. నమ్మండి, నమ్మకపొండి. అది మీ ఇష్టం.” అంటూ మొదలు పెట్టింది. ‘‘పదేళ్ల క్రితం నేను హైదరాబాదులో ఓ పోలీసు స్టేషన్లో ఎస్.ఐ.గా పనిచేసేటప్పుడు సుభాష్ అనే ఒకాయన వరిచయమయ్యేడు. నడివయస్కుడు. బాగా డబ్బుంది. ఉద్యోగం చేసో, వ్యాపారం చేసో సంపాదించవలసిన అవసరం లేదు. పాత కెమెరాలు సేకరించడం హాబీ. అలా పోగుచేసిన వాటిలో రెండు పోయాయని కంప్లెయింట్ ఇవ్వడానికి స్టేషన్ కి వచ్చినప్పుడే నాకు పరిచయం ఏర్పడింది. నాలుగురోజులు తిరక్కుండా కెమెరాలు ఎత్తుకెళ్లిన వాణ్ని పట్టుకుని, ఆయనకు తిరిగి అప్పగించడంతో నేనంటే గౌరవం పెరిగిపోయింది. మా మధ్య స్నేహం పెరిగింది. నో ఫాన్సీ గెసింగ్ ప్లీజ్. జస్ట్ ఫ్రెండ్స్!
ఆయనింటికి చాలా మంది కళాకారులు, రచయితలు వస్తూ ఉండేవారు. ఓ ఆదివారం నాడు లంచ్‌కి పిలిచారాయన. జుమేరాత్ బజార్లో పాతరకం 'జీస్ ఐకాన్' కెమెరా దొరికిందట. అందుకు సెలబ్రేషనట. సుభాష్ వెర్రి అలాటిది. భోజనానికి విక్రమరావునీ, అతని గళ్‌ఫ్రెండ్ నుమితనీ కూడా పిలిచాడు. విక్రమరావు పేరు వినేవుంటారు. పెయింటర్. సుభాష్ క్లాసుమేటు. భోజనం రెడి కానీ సుభాష్ డార్క్‌రూమ్ లోంచి ఊడిపడడే ! ఆ ఐకాన్ కెమెరాలో ఎక్స్‌పోజ్డ్ ఫిల్మ్ కొంత ఉండిపోయిందట. దానిని జాగ్రత్తగా బయటకు తీసి వాష్ చేసి, ప్రింట్లు వేస్తున్నాట్ట. అదేం సరదాయో. నాకు చిర్రెత్తిపోయింది. డార్క్‌రూమ్ తలుపులు బాదగా, బాదగా బయటపడ్డాడు. చేతిలో టెన్ బై ఎయిట్ ఎన్‌లార్జ్‌మెంట్ ప్రింట్లున్నాయి.
ఓ ప్రింటు తీసే “విక్రమ్, దీన్ని చూసి నీ అబ్జర్వేషన్లు చెప్పరా” అంటూ అతని కిచ్చాడు. విక్రమరావు సంగతి మీకు తెలుసో, తెలియదో. ఎంత చిన్న విషయమైనా సరే, తన దృష్టిని దాటిపోదనీ, తన పరిశీలనా శక్తి వల్లనే తన చిత్రాలు గొప్పగా ఉంటాయని మహా గర్వం అతనికి. ప్రతీదాని గురించి కామెంట్స్ చేస్తూ ఉంటాడు. నేను పోలీసు ఫోర్సులో ఉన్నాను, పరిశీలన అన్నది నా వృత్తి ధర్మం. మా ఇద్దరి మధ్యా పోటీ పెట్టి ఆనందించడం సుభాష్‌కి సరదా. “ఒక హేట్‌ని చూసి మనిషి గురించి వర్ణించేసాడు. షెర్లాక్ హోమ్స్. మీరైతే అతని పూర్వజన్మను కూడా చెప్పేస్తారు.” అంటూ ఉంటాడు. సుభాష్ తీసిన పాత ఫోటోలు చూసి, అది ఏ కెమెరాతో తీసారో, ఎక్కడ తీసారో, ఎప్పుడు తీసారో, దానిలో ఉన్నవాళ్లు, ఒకరికొకరు ఏమవుతారో ఊహించి చెప్పడం మాకో ఆట. నేనేదైనా చెప్పబోతూ ఉంటే, “నువ్వు క్లూ అందించావంటే నేనొప్పుకోను.” అంటూ అరిచేస్తాడు విక్రమ్.
ఆవేళ కూడా సుభాష్ అలవాటుగా విక్రమ్ చేతికి ఫోటోలు యివ్వగానే, ఏదైనా కామెంట్ చేసి, అతన్ని ఏడిపించాలని నేను వెళ్లి అతని పక్కనే సోఫాలో కూచుని ఫోటోల వంక చూసాను. సుభాష్ ప్రింటు మంచి క్లియర్‌గా వచ్చేట్టు చాలా శ్రమించాడులా ఉంది. అన్నీ స్పష్టంగా కనబడుతున్నాయి. ఒక పెద్ద పచ్చిక బయలు. వెనక్కాల గుడి కనబడుతోంది. ఓ పక్కగా ఒక కారు కనబడుతోంది.. ఇక చూసుకోండి, మా గెస్‌వర్క్ మొదలయింది. ఫోటో తీసినది సాయంత్రం (నీడల పొడుగు బట్టి). అక్టోబరు నెల (చెట్ల మీదనున్న ఆకులు). సుమారు నలభై యేళ్ల క్రితం (కారు కొత్తగా ఉంది, అప్పటి మోడలు), రాయలసీమ ప్రాంతం (ఇళ్ల కప్పులు), అవును, నలభై యేళ్ల క్రితమే (అప్పటి సినిమా టైపు జాకెట్లు) శుక్రవారం (గుడికి వెళ్తున్న ఆడజనాభా).
మా విశ్లేషణ విని సుభాష్ పడిపడి నవ్వాడు. “ఇది చూడండోయ్” అంటూ రెండో ప్రింటు ఇచ్చాడు. ప్రాయంలో ఉన్న అమ్మాయి. ఓణీ, పరికిణీ వేసుకుని కారు నానుకుని నవ్వుతూ నిలబడింది. మేము మళ్లీ మొదలెట్టాం పెళ్లి కాలేదు (తాళిబొట్టు లేదు). కన్య (సిగ్గు) ఫోటో తీస్తున్నతనితో ప్రేమలో పడింది. (కళ్లు) ముగ్ధ, పిరికిదే కానీ ప్రేమ తెచ్చి పెట్టిన ధైర్యంతో కెమెరాలోకి సూటిగా చూస్తోంది. (పెదాలు విచ్చుకోవడం). ‘‘బాగుంది. మరి ఆ అమ్మాయి ప్రియుడెలా ఉంటాడో చూస్తారా?” అంటూ సుభాష్ ఇంకో ఫోటో ఇచ్చాడు. ఫోటో తీయడం రాని వాళ్లు తీసినట్టుంది ఇది. కాస్త వంకరగా. బొమ్మ సెంటరు కాకుండా తీసారు. ఫోటోలో ఉన్నతను కూడా కారుకి ఆనుకునే ఉన్నాడు. విక్రమ్ గుక్క తిప్పుకోకుండా చెప్పేసాడు ‘‘ఇది ఆ అమ్మాయి తీసింది, మగాడు కాస్త అహంభావిలా ఉన్నాడు. ఆ అమ్మాయి కంటే చాలా పెద్దవాడు. బహుశా తండ్రి వయసువాడు. కళ్లు మరీ దగ్గరగా ఉన్నాయి. అటువంటి వాళ్లని నమ్మకూడదు. నోరు చూడు. చిన్నషిల్లలను మోసం చేసే దోచుకునేవాడిలా ఉన్నాడు!’ అన్నాడు.
కానీ నాకు మాత్రం అలా అనిపించలేదు. మధ్యవయస్కుడిలా ఉన్నాడు, కానీ ఆ హెయిర్ స్టైల్ వల్ల పెద్దవాడిలా అనిపిస్తున్నాడేమో అన్నాను. “ఓకె, ఇది చూసి ఆ అమ్మాయి గురించి చెప్పండి.” అంటూ సుభాష్ ఇంకో ఫోటో ఇచ్చేడు. గడ్డిలో పరచిన దుప్పటి మీద పడుక్కుని ఉంది, యిందాకటి కన్య. ఫ్లాస్కు, చిన్నబుట్ట. పిక్నిక్‌కి వచ్చినట్టు తెలుస్తోంది. బట్టలు చెదరలేదు, కానీ ఓణీ మధ్యకు వచ్చేసిన తీరు, పరికిణి పై కొచ్చేసిన పద్ధతీ చూస్తే ఏదో స్ఫురిస్తోంది. ఆ నవ్వూ. కళ్లల్లో ఆ ఆనందం. కళ్ల ముందు ఊగిసలాడుతున్న ముంగురులు చూస్తే తెలుస్తోంది, అప్పుడే ఆ అమ్మాయి తొలిసారిగా శృంగారసీమల్లో విహరించి వచ్చిందని. విక్రమ్ ఫోటో చూసి చిరునవ్వు నవ్వి ఏమీ మాట్లాడలేదు. నా మనస్సులో మెదిలిన ఊహలే అతనిలో మెదిలాయి లాగుంది. పై కనడానికి సిగ్గుపడి ఊరుకున్నాడు. ఇద్దరమూ ఒకేసారి సుభాష్ కేసి చూసాం.
సుభాష్ ఏమీ మాట్లాడకుండా “ఇదీ ఆఖరి ఫోటో” అంటూ చేతికిచ్చాడు. ఆ అమ్మాయి దుప్పటి మీద వెల్లకితలా పడివుంది. ఆమె తల వెనక్కి వాలి వుంది. కళ్లు మూతలు పడివున్నాయి. నోరు ఆదోలా తెరుచుకుని వుంది. అది చూస్తూనే నేను బిగుసుకుపోయాను. వృత్తిరీత్యా ఆలాటి ఫోటోలు చాలా చూసాను. పొరబాటు పడే అవకాశమే లేదు. “ఆమె చచ్చిపోయింది. నాకు తెలును.” అన్నాను తత్తరపడుతూ, ఆ మధ్యవయస్కుడు ఈ చిన్నపిల్లను మభ్య పెట్టి, ఆమె యవ్వనం దోచుకుని చంపేసాడులా వుంది. పైగా శవాన్ని ఫోటో కూడా తీసే మనోవికారం కూడా ఉన్నట్లుంది. విక్రమ్ కూడా అదే విషయం గ్రహించినట్లున్నాడు. వాంతి వచ్చినట్లయింది కాబోలు బాత్‌రూమ్‌కి పరిగెట్టాడు.
అన్యమనస్కంగానే భోజనాలు ముగించి కూచున్నాము. అప్పటికే సుభాష్ అరడజను సార్లు అడిగాడు. “పోలీసు ఇన్‌స్పెక్టరువి కదా, నువ్వేమి చేయలేవా?” అంటూ. నేనూ డజను సార్లు చెప్పాను “నాకు మతి లేదనుకుంటారు. ఈ ఫోటోలు నలభై ఏళ్ల క్రిందటివి. అసలు అంతకాలం ఎక్స్‌పోజ్డ్ ఫిలిం రోలు కెమెరాలో ఎలా వుండగలదో నాకు అంతుపట్టటం లేదు. పాతకాలం ఫిల్మ్ రోల్స్ క్వాలిటీ బాగుండేదనుకోవాలా? నాకు నమ్మకం లేదు. పైగా ఆ చివర్లో ఉన్న ఫోటో కోర్టులో సాక్ష్యంగా పనికిరాదు. కెమెరా ట్రిక్ యేమో. ఆ అమ్మాయి చచ్చిపోలేదేమో. బాధపడుతోందేమో. ప్రథమంగా రతిలో పాల్గొన్న మీదట ఏ కడుపు నొప్పో.. పోన్లే అది కాకపోయినా.. చావే అనుకున్నా.. అసలది రాయలసీమో, కోనసీమో, మరో సీమో. అలాటి గుళ్లు అనేక చోట్ల వుంటాయి. అసలా ఫోటోల మధ్య వ్యవధి ఎంత వుందో, అన్నీ ఒకేసారి తీసేరన్న నమ్మకం ఏమిటి? అసలా మనుష్యులు బతికివున్నారన్న నమ్మకం ఎమిటి?
కానీ వాళ్లెవ్వరూ నా మాట పట్టించుకోలేదు. అందరికీ ఒకటే పట్టుదల. ఆ పెద్దమనిషి గోముఖ వ్యాఘ్రం. అన్యాయంగా ఓ పిల్లను అనుభవించి, చంపేశాడు. వాడు బతికుంటే వెతికి పట్టుకుని ఉరికంబ మెక్కించాలి. చెబితే నమ్మరు, అనుమానం ఉన్నచోటకల్లా వెళ్లి వెతుకుదామంటారు. వెంటనే బయలు దేరదామంటారు. వాళ్లకేం, డబ్బున్నవాళ్లు, ఏదో కాలక్షేపం కావాలి. నాకు సెలవు దొరకద్దూ? వినలేదు, పట్టుబట్టారు. ఇంకోలా చెప్పాలంటే, ఏదో అజ్ఞాత శక్తి నన్ను ఈ వింతయాత్రలో పాల్గొనేట్లా చేసింది. సిఎమ్ గారు కథ క్లుప్తంగా చెప్పమన్నారు కాబట్టి, వివరాలు వదిలేస్తున్నాను. రాయలసీమలోనే కారేసుకుని మూడు రోజులు తిరిగేమండి, ఆ గుడి ఫోటో చూపించి అది ఎక్కడుందో చెప్పమనడం, వాళ్లు తెలీదనడం. చివరికి అలంపురం దగ్గర ఓ గైడ్ నడిగేను నేను.
చూస్తూనే “రామ్మునగపల్లి నాగేశ్వరుడి గుడి కదా. ఎప్పుడిదో పాత ఫోటో ఇది.” అన్నాడు. “ఆ ఊరు చూసి వచ్చేశామయ్యా బాబూ, అక్కడ గుడి ఇలా లేదు.” అన్నాను. “పదేళ్ల క్రితం క్వారీ వాళ్ల బాంబు దెబ్బకి గోపురం కూలిపోయింది. ఆ పచ్చికబయలు ఇప్పుడెందుకుంటుందండి? దేవస్థానం భూములన్నీ ఆక్రమించేసి అమ్మేసుకున్నారుగా’ అన్నాడు. పొలోమని వెనక్కి వెళ్లి రామ్మునగపల్లి చేరుకున్నాం. గుడిని గుర్తుపట్టాం. విక్రమ్ సుమిత్రల ఆనందానికి అంతులేదు. అపర షెర్లాక్ హోమ్స్‌లా పోజు కొట్టేసారు. ఆ ఊరి దగ్గర్లో ఉన్న తాలూకా కేంద్రంలో మకాం వేసి పదిమైళ్ల వ్యాసార్ధంలో ఉన్న ఊళ్లన్నీ చుట్టబెడతామన్నారు. నాకు మాత్రం సంతోషం కలగలేదు, ఎండుకనో! లాడ్జిలోనే పడుక్కున్నాను.
వాళ్లు ముగ్గురూ ఆ అమ్మాయి ఫోటో తీసుకుని ఊళ్ల మీద పడ్డారు. అరవై ఏళ్లు పైబడ్డ ముసలమ్మలను మధ్యాహ్నం కునుకు తీయనీకుండా లేపి అది చూపించి ఎవరో తెలుసా అని అడిగేరుట. ఎవరూ తెలియదన్నారు. టీ తాగడానికి రూమ్ కొచ్పారు. అంతా విని “మీ కో విషయం తట్టిందా? ఆ అమ్మాయి పదహారేళ్ల పిల్ల. మనం అనుకున్నట్లు చచ్చిపోయి వుంటే ఇక్కడ ఎక్కువ కాలం నివసించడానికి అవకాశం లేదు కదా. కానీ ఆ ఫోటోలో మగాడు, పోని మీ దృష్టిలో హంతకుడు, ఎక్కువ కాలం బతికి వుండవచ్చు గదా. మీరు అతని గురించి అడగవలసింది.’’ అన్నాను. నా మాటలు వింటూనే వాళ్లు టీ కూడా తాగకుండా పరిగెట్టారు.
అందరికంటే ముందు నుభాష్ రొప్పుతూ, రోజుతూ వచ్చి పడ్డాడు. “నువ్వు చెప్పింది నిజం. పట్టేశాం. అతను ఇక్కడ చాలా కాలం ఉన్న డాక్టర్. డా. ఆదోని నరహరి. రిటైరయ్యేవరకూ ఈ ఊళ్లోనే ఉన్నాట్ట.” అన్నాడు. “నేనప్పుడే అనుకున్నాను. ఆ వాలకం చూసి డాక్టరే అనుకున్నాను. ఎవర్నయినా చంపడానికి డాక్టరుకున్న అవకాశాలు మరెవ్వరికి ఉండవు.” అంది నుమిత్ర కళ్లు తిప్పుకుంటూ. తెలివితేటల్లో తనూ ఎవ్వరికి తీసిపోనని చూపాలని మహా తాపత్రయం.” రిటైరయ్యేక ఎక్కడికి వెళ్లాడని అడిగి చూసాను. ఎవరికీ తెలియదట. కొడుకు దగ్గరికి వెళ్లాడేమో అని కొందరూ. పోయేడని కొందరూ అంటున్నారు. కొడుకా, కూతురా అని కూడా అనుమానమే.”.
అందరికీ నీరసం వచ్చేసింది. హైదరాబాదుకి తిరిగి పోదామన్నారు. తిరుగు ప్రయాణంలో కారు ట్రబుల్ ఇచ్చి, ఆదోనిలో ఆగిపోవాల్సివచ్చింది. కారు మెకానిక్కి అప్పజెప్పి ఒక లాడ్జిలో బస చేసాం. లంచ్ అయ్యేక వాళ్లు ముగ్గురూ పక్క రూములో పేక ఆడుతూంటే. నా చేతులు పక్కనున్న టెలిఫోన్ డైరెక్టరీ మీద పడ్డాయి. సడన్‌గా ఒక ఆలోచన వచ్చింది. సొంతూరి పేరు మీదే ఇంటి పేర్లు వస్తాయి. డాక్టరు నరహరి ఇంటి పేరు ఆదోని. అతనిది ఆదోనేమో! ఉద్యోగంలో రిటైరయ్యేక సొంత ఊరికి వచ్చి స్థిరపడడం రివాజు. ఒకవేళ ఆయన ఇక్కడే యీ ఊరిలోనే స్థిరపడ్డాడా? డైరక్టరీ పేజీలు తిప్పి చూసాను. డాక్టరు ఆదోని నరహరి అని ఒక ఎంట్రీ ఉంది. అనుకోకుండానే సంబరు తిప్పాను. ఆయన అయి వుండడులే! ఆ పేరు మీద ఎందరో వుండి వుండవచ్చు. ఒకవేళ యితను అతని మనవడని తేలినా, ఏం ప్రయోజనం? తాత చేసినదానికి మనుమడికి శిక్ష వేయరుగా! పోనీ తాతను పట్టుకుని కోర్టు కెక్కించడానికి సాక్ష్యనూ? సంపన్ననూ? ఈ ఫోటోల సాక్ష్యంతో కేసు పెడితే ముందు నా ఉద్యోగం పోతుంది. పోలీసుఫోర్స్‌లో ఉండి ఇంత బుర్ర లేకుండా మాట్లాడుతున్నావేమిటని జడ్జి తిట్టిపోస్తాడు.
ఫోన్ మోగింది. 'హలో' అని అవతలి వైపు వినబడగానే నాకు ఇది ఆయన గొంతుకే అనిపించింది ఎందుకో. “నేను హైదరాబాదు నుంచి వచ్చానండి. మాకో కెమెరా దొరికింది. వాటిలో ఫోటోలు కొన్ని ఉండిపోయాయి. ఆ ప్రింట్లు చూసి మీవేమో…” అని నేను అన్నంతలోనే “జీన్ ఇకానేగా. నీ గురించి చాలా కాలంగా కాచుకుని ఉన్నానమ్మా, త్వరగా రా.” అన్నాడాయన. నేను తెల్లబోయాను. ఫోన్ డైరెక్టరీలో ఉన్న అడ్రసు సాయంతో ఆటోలో ఒక్కత్తిని ఆయనింటికి చేరాను. ఫోటోలతో సహా. ఇంట్లో ఆయన ఒక్కడే పడక్కుర్చీలో కూచుని ఉన్నాడు. పండు ముదుసలి కానీ గాంభీర్యం తగ్గలేదు. నేనిచ్చిన ఫోటోలన్నీ వరసగా చూసాడు. ఆ అమ్మాయి ఫోటో చూస్తూనే “పాపం, లక్ష్మి” అన్నాడు. నాలుగో ఫోటో చూస్తూనే ” ఆ అమ్మాయి నా దగ్గరికి వైద్యానికి వచ్చేది. నేను చాలా జాగ్రత్తపడాల్సి వచ్చింది. పెళ్లయి. ముగ్గురు పిల్లలున్న వాణ్ని. అమ్మాయికి డబ్బుంది, కానీ తల్లిదండ్రులు ఏదో రోగం వచ్చి పోయారు. ” అన్నాడు.
ఆఖరి ఫోటో ఇవ్వడానికి నేను జంకుతూంటే ఆయనే చేతిలోంచి తీసుకున్నాడు. తేరిపార చూసి, “ఆమె చచ్చిపోయిందని నీకు తెలిసింది కదామ్మా” అన్నాడు. మెల్లగా తలూపాను. “నిజం తెలుసుకోవాలను కుంటున్నావు కదూ?” తలూపాను. “నీతో వచ్చినవాళ్లకు నిజం తెలుసుకోవడం కంటె నన్ను శిక్షించడమే కావాలనుకుంటాను. జీవితమే పెద్ద శిక్ష అని తెలుసుకోరు వాళ్లు. నీకే నా మీద జాలి వుంది కదూ. అందుకనే నీతో నిజం చెబుతున్నానమ్మా. ఇప్పటిదాకా ఎవరికీ నా నేరమూ తెలీదు, నేను అనుభవించిన శిక్షా తెలియదు. అంటే నేను చంపేశానని అనుకోకమ్మా. నా భార్యకు తెలియకుండా ఆమెతో వ్యవహారం నడపడమే నా నేరం. అది నా చేతుల్లో లేకపోయింది. లక్ష్మి యవ్వనం అటువంటిది. ఆమెకు నా పై ఉన్న మోహం అలాటిది. నన్ను వివశం చెసే ఆమె ప్రేమబలం అలాటిది. కాని నా భార్యకు తెలిస్తే ఆమె బాధ పడుతుందని నా వర్రీ. అందుకే ఎక్కడెక్కడికో వెళ్లేవాళ్లం లక్ష్మీ, నేనూ. ఆ రోజు అలాగే రామ్మునగపల్లి చేరాం. అక్కడే ఫోటోలు తీసుకున్నాం. మీరనుకుంటున్నట్టు నేను ఆమెను పాడు చేయలేదు. జస్ట్. కాస్త రొమాంటిక్‌గా ఉన్నామంతే. ఆ రోజుల్లో అదే గొప్పగా ఉండేది. ఆమె ఫోటో తీస్తూ, వ్యూఫైండర్లోంచి చూస్తూండగానే ఆమె తూలడం కనబడింది. చాలా బలహీనమైన గుండె తనది. నాకు తెలుసు. ఆ పాటి ఆనందానికే తట్టుకోలేక పోయింది. వెంటనే దగ్గరకు పరిగెట్టాను. ఎంతో ప్రయత్నించాను. కానీ లాభం లేకపోయింది. ఆమెను అక్కడే వదిలేసి రావలసి వచ్చింది.”
“అక్కడే వదిలేసి పారిపోయారా?” కాస్త కటువుగానే అడిగాను.
“ఏం చేయగలను? దౌర్భాగ్యుణ్ని. నా పరువు ప్రతిష్ట.. పైగా డాక్టర్ని! పేషంట్లతో సంబంధం పెట్టుకుంటున్నానని పేరుబడితే .. అందుకే., అలా చేయాల్సి వచ్చింది…. కానీ దానికి శిక్ష అనుభవించాను. ఆమె శరీరం వారం రోజుల తర్వాత బయటపడింది. జంతువులు పీక్కుని… ఎందుకులే అవన్నీ… పోస్టుమార్టమ్ జరిగింది. ఆమెది సహజమరణమేనని ధృవీకరించారు. ఆమెకున్న రోగం వల్ల ఆరునెలలకు మించి బతికివుండేది కాదని డాక్టర్లు అన్నారు. ఇదిగో. ఆనాటి పేపర్ రిపోర్ట్ చూడు.”
“చూస్తాను లెండి. అంటే మీరు దాటేశారన్నమాట.” అన్నాను కసిగా . “లేదమ్మా. పోస్ట్‌మార్టమ్ టైములో ఆ ఏరియా పోలీసు సర్జన్‌గా నా అభిప్రాయం కోసం నన్ను రమ్మన్నారు. ఆమెనలా చూడడమే బతుకంతా నేను అనుభవించిన శిక్ష.” నేనేమీ మాట్లాడలేదు. “మరి కెమెరా ఏమయింది?” అని అడిగాను. “ఆ సంఘటన తర్వాత ఆ కెమెరాను నేను ముట్టుకోలేదు. మా బట్టల అలమారులో అలాగే పడేసి వుంచాను. మా ఆవిడకు విసుగు పుట్టిందేమో. ఎప్పుడో ఓ నాడు తీసి బయట పారేసింది.” “అదే మాకు దొరికింది. నలభై ఏళ్ల నాటిదైనా మీ కథంతా బయటకు వచ్చింది. నిజం నీడలా మిమ్మల్ని వెంటాడింది.’’ ‘‘అదే నేను కోరుకున్నానమ్మా. నీతో చెప్పుకున్న తర్వాతనే నాకు మనశ్శాంతి లభించింది. నన్ను అర్థం చేసుకోగలిగిన దానివి నీ వొక్కత్తివే. అందుకే నన్ను చేరుకునే మార్గాలన్నీ నీకే తట్టాయి.” అన్నాడా వృద్ధుడు.
ఏం మాట్లాడాలో నాకు తోచలేదు. లేచి వచ్చేశాను. మావాళ్ల పేకాట ఇంకా కానట్టుగా ఉంది. వచ్చి నిద్రపోయాను. లేచాక నా అనుభవమంతా మా వాళ్లతో చెప్పాను. ఆ ముసలాయన్ని అలా పదిలేసి రావడం తప్పన్నారు. పోలీసు స్టేషన్‌కి లాక్కెళ్లాల్సిందే నన్నారు. నేను వద్దంటున్నా సుభాష్ అదే నంబర్‌కి ఫోన్ చేసాడు. ఫోన్ ఎత్తినవాళ్లు డాక్టర్ ఆదోని నరహరి పోయి మూడురోజులయిం దన్నారు.”
కథ ముగిసినట్టుగా ఆమె ఆగి ఊపిరి పీల్చుకోగానే ముఖ్యమంత్రి గారు “చిత్రంగా ఉంది, అంటే ఆయన కన్ఫెషన్ చెప్పడానికే మిమ్మల్ని రప్పించాడంటారా?” అని అడిగారు.
“ఆవేళ మధ్యాహ్నం మీరు కల గని ఉంటారు. మేడమ్” అన్నాడు ఒక జర్నలిస్టు.
“పోనీ అలాగే అనుకున్నా, అన్నేళ్ల పాటు ఫోటో రీలు పాడవకుండా ఉండడం సాధ్యమా చెప్పండి. పైగా ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నేను తర్వాత లైబ్రరీకి వెళ్లి ఆయన చూపించిన పాత పేపరుకై వెతికాను. ఆ వార్తతో పాటు అమ్మాయి ఫోటో కూడా వేశారు. ఫోటోలో అమ్మాయే. మూడు రోజుల క్రితం పేపరు చూస్తే యీయన మరణవార్త, ఫోటో ఉన్నాయి. అవేళ మధ్యాహ్నం ఆయన ఇంట్లో చూసినట్లుగానే ఫోటోలో ఉన్నాడు. అదే వ్యక్తి’’ అంటూ ముగించింది, ఆ మహిళా సబ్-ఇన్ స్పెక్టర్. (రాబర్ట్ వెస్టాల్ రాసిన ‘‘ఇన్ కెమెరా’’ అనే కథ ఆధారంగా) (వచ్చే నెల రెండో బుధవారం యీ సీరీస్‌లో మరో కథ)
– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2022)