కోవిడ్ పుణ్యమా అని గత రెండేళ్లలో ప్రారంభించిన సినిమాలు అన్నీ బడ్జెట్ ను మింగేసాయి. వడ్డీల భారం పెరిగిపోయింది. నిర్మాతలయినా, బయ్యర్లయినా కరోనా భారాన్ని మోయాల్సి వచ్చింది. రాబోతున్న సినిమాల పరిస్థితి కూడా ఇదే. ఈ నెలలో విడుదలవుతున్న మెగాస్టార్ ప్లస్ రామ్ చరణ్ కాంబినేషన్ ఆచార్య సినిమా భారీ బ్లాక్ బస్టర్ అయితే తప్ప నిర్మాతకు పెద్దగా ప్రయోజనం లేదని తెలుస్తోంది.
ఖర్చులు తడిసి మోపెడయిపోవడమే దానికి కారణం. సినిమాను చాలా కాలం తీయాల్సి వచ్చింది. మార్పులు, చేర్పులు, బెటర్ మెంట్ కోసం ఎక్కువ వర్కింగ్ డేస్ అవసరం పడ్డాయి. దానివల్ల సినిమా బడ్జెట్ పెరిగిపోయింది. ఈ సినిమాను మంచి రేట్లకే విక్రయించారు ఆంధ్రలో కీలకమైన మూడు ఏరియాలను కొరటాల శివ సన్నిహితుడే విడుదల చేస్తున్నారు.
ఇదిలా వుంటే మహేష్ బాబుతో మైత్రీ మూవీస్ నిర్మించిన సర్కారు వారి పాట కూడా ఓవర్ బడ్జెట్ అని వినిపిస్తోంది. ఈ సినిమా నిర్మాణానికి కూడా చాలా టైమ్ పట్టింది. కోవిడ్ ఖర్చులు అదనపు భారంగా పడ్డాయి.
షెడ్యూళ్లు, బెటర్ మెంట్లు ఇలా చాలా ఖర్చులు తప్పలేదు. గత రెండు రోజులుగా నిర్మాతలయిన మైత్రీ మూవీస్ ఈ పని మీదే వున్నారు. అసలు టోటల్ ఖర్చు ఎంతయింది, ఎంత రేట్లకు అమ్మితే వర్కవుట్ అవుతుందీ అన్నది లెక్కలు కడుతున్నారు.
అనిల్ రావిపూడి సినిమా ఎఫ్ 3 బడ్జెట్ కూడా గట్టిగానే అయింది. ఈ సినిమా మీద రెమ్యూనిరేషన్లు భారీగా పడ్డాయి. దాదాపు ముఫై కోట్లకు పైగా రెమ్యూనిరేషన్లే అయ్యాయి. కానీ ఆచార్య, సర్కారువారి పాట సినిమాలతో పోల్చుకుంటే ఆ ఖర్చు తక్కువే. మార్కెట్ గట్టిగా వుంది కాబట్టి ఎఫ్ 3 కి పెద్దగా సమస్య కాదు.