అపుడెపుడో బాలయ్య సినిమా ఒకటి వచ్చింది. అందులో ఒక వైపే చూడు, రెండవ వైపు చూడాలనుకోకు అని డైలాగ్ ఉంటుంది. ఈ డైలాగ్ ఇపుడు ఒక వైసీపీ ఎమ్మెల్యేకు సరిగ్గా సరిపోతుంది. ఆయన ఎవరో కాదు ఉమ్మడి విశాఖ జిల్లా పాయకరావు పేటకు చెందిన గొల్ల బాబూరావు. ఆయన ఇంతకాలం తనలో సహనాన్నే చూశారు అని అంటున్నారు. ఇక మీదట క్యాడర్ కోసం రెండవ వైపు కోణాన్ని కూడా చూపిస్తాను అని అంటున్నారు.
ఇంతకీ బాబూరావుకు వచ్చిన కష్టమేంటి, ఆయన ఎందుకు ఇలా అగ్రెస్సివ్ మోడ్ లోకి వెళ్ళారు అని చూస్తే ఆయన కూడా విస్తరణ బాధితుడే. మంత్రి పదవి రేసులో ఉన్న ఆయనకు పదవి దక్కలేదు. ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ఇద్దరికి మంత్రి పదవులు లభిస్తే అందులో ఫస్ట్ టైమ్ గెలిచిన గుడివాడ అమరానాధ్ కి ఒక చాన్స్ ఇచ్చారు.
అలాగే రెండు సార్లు గెలిచిన బూడి ముత్యాలనాయుడుకు కూడా అవకాశం ఇచ్చారు. మరి మూడు సార్లు గెలిచి అత్యంత విశ్వాసం పార్టీ పట్ల తాను చూపిస్తే ఇదేనా తనకు దక్కిన బహుమతి అని బాబూరావు ఫైర్ అవుతున్నారు. పాయకరావు పేటకు చెందిన నాలుగు మండలాల క్యాడర్ తో ముఖ్య నాయకులతో ఆయన చలో సజ్జల ఆఫీస్ అని వచ్చేశారు.
ఆ తరువాత సజ్జల రామక్రిష్ణారెడ్డితో భేటీ అయ్యారు. ఆయన ఏం చెప్పారో బాబూరావు ఎలా విన్నారో తెలియదు కానీ ఇక మీదట ఆయన తగ్గేదే లే అంటున్నారు. జగన్ తనను నిర్లక్ష్యం చేశారని బాధ పడుతున్నారు. తాను మెత్తగా ఉన్నానని కూడా మధనపడుతున్నారు.
నాడు బలమైన కాంగ్రెస్ ని సైతం ఎదిరించి ఎమ్మెల్యే పదవిని వదులుకుని జగన్ వెంట వచ్చానని, ఉప ఎన్నికల్లో పోటీ చేసి మరే గెలిచి వచ్చానని చెప్పుకున్నారు. మరి తనకు తన విధేయతకు ఏదీ విలువ అని బాబూరావు కాస్తా గట్టిగానే ప్రశ్నిస్తున్నారు.
మొత్తానికి ఇంత వరకూ ఒక ఎత్తు, ఇక మీదట మరో ఎత్తు అని బాబూరావు విజయవాడ వేదికగానే తేల్చేశారు. మరి ఆయన భవిష్యత్తు రాజకీయం ఎలా ఉంటుందో చూడాలి. ఏది ఏమైనా బాబూరావుకు జస్ట్ మిస్ మినిస్టర్ కుర్చీ అని క్యాడర్ అయితే కన్నీటి పర్యంతం అవుతున్నారు.