ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెం పోరస్ ఫ్యాక్టరీ ప్రమాద మృతులకు సీఎం జగన్ సముచిత సాయాన్ని అందించేందుకు ముందుకొచ్చారు. ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.25 లక్షలు చొప్పున సాయం అందిస్తామని సీఎం ప్రకటించారు.
బుధవారం అర్ధరాత్రి వేళ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలి భారీ ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందగా, 13 మంది తీవ్రగాయాలపాలయ్యారు. క్షతగాత్రులను విజయవాడ జీజీహెచ్‌కు తరలించారు.
ఇదిలా వుండగా ఈ దుర్ఘటనపై ప్రధాని మోదీ, సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన వారి ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షలు, తీవ్ర గాయాలపాలైన వారికి రూ.5 లక్షలు, స్వల్పం గా గాయపడిన వారికి రూ.2 లక్షలు చొప్పున నష్టపరిహారం అందిస్తామని సీఎం ప్రకటించారు.
అలాగే ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేయాలని కలెక్టర్, ఎస్పీని సీఎం ఆదేశించారు. గాయపడిన వారికి పూర్తి స్థాయిలో వైద్య సహాయం అందాలని ముఖ్య మంత్రి అధికారులను ఆదేశించారు. అక్కిరెడ్డిగూడెం పాలిట శాపంగా మారిన పరిశ్రమను ఎట్టి పరిస్థితుల్లోనూ తరలించాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు.
రసాయన పరిశ్రమను తరలించే వరకూ ఆందోళనలు కొనసాగిస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. తాత్కాలికంగా పరిశ్రమను సీజ్ చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.