ఆతిథ్యరంగంలో తిరుపతిని ఎదగనివ్వరా?

తిరుపతిలో ఓబెరాయ్ గ్రూపు ఒక అంతర్జాతీయ స్థాయి హోటల్ పెట్టడానికి సంబంధించిన ప్రాజెక్టు డీల్ కుదిరింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో దీనికి సంబంధించి శంకుస్థాపన కూడా జరిగింది. జూపార్క్ పక్కనే 20 ఎకరాల…

తిరుపతిలో ఓబెరాయ్ గ్రూపు ఒక అంతర్జాతీయ స్థాయి హోటల్ పెట్టడానికి సంబంధించిన ప్రాజెక్టు డీల్ కుదిరింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో దీనికి సంబంధించి శంకుస్థాపన కూడా జరిగింది. జూపార్క్ పక్కనే 20 ఎకరాల స్థలాన్ని ఇందుకోసం కేటాయించారు. నిర్మాణ పనులు కూడా దాదాపుగా ప్రారంభం అయినట్టే. అయితే ఈ ఓబెరాయ్ గ్రూపు హోటల్ నిర్మాణానికి ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలంటూ.. స్థానికంగా పోరాటాలు ప్రారంభం అయ్యాయి.

సాధారణంగా ఇలాంటి పోరాటాలను మనం సినిమాల్లో, రాజకీయాల్లో చూస్తుంటాం. ఒక చోట ఒక పెద్ద ప్రాజెక్టు పని మొదలవుతుంది. స్థానికంగా ఒక సామాజిక ఉద్యమకారుడు ప్రజలను పోగేసి పెద్ద పోరాటం నడిపిస్తాడు. ఆ పోరాటానికి గుర్తింపు రాగానే.. వెళ్లి ఆ ప్రాజెక్టు వారితో ఒక డీల్ కుదుర్చుకుంటాడు. రహస్య డీల్ లో పెద్దమొత్తం చేతులు మారుతుంది. బహిరంగ డీల్ లో ఆ ప్రాంతానికి ఆ ప్రాజెక్టు వారు చిన్న మేలు చేసేలా ఒప్పందం అవుతుంది. పోరాటం ఆగుతుంది.

రాజకీయ నాయకులకు ఇలాంటి అలవాట్లు చాలా ఉంటాయి. ఒక గ్రామానికి మంచి రోడ్డు వస్తూంటే కూడా, ఆ కాంట్రాక్టరు తమకు ఆమ్యామ్యా ముట్టజెప్పేదాకా అక్కడ రోడ్డు రావడానికి వీల్లేదని కిరాయి పోరాటాలు నడిపిస్తుంటారు. ఇవి కూడా అలాంటివి అని కాదు గానీ.. తిరుపతిలో హోటల్ కు వ్యతిరేకంగా రెండు పోరాటాలు మొదలయ్యాయి.

తిరుక్షేత్రాల రక్షణ సమితి, రాయల్ పీపుల్ ఫ్రంట్ అంటూ రెండు సంస్థలు పుట్టుకొచ్చాయి. ఒకటి హిందూత్వ ముసుగుతో తిరుపతి- తిరుమల రెండు క్షేత్రాలను కాపాడడానికి పుట్టుకొచ్చిన సంస్థగా ముసుగువేసుకున్నది. రెండోది ఒక కులం ప్రాపకాన్ని నమ్ముకుని ముందుకొచ్చినది అని స్పష్టంగా కనిపిస్తోంది. అస్తిత్వ సమస్యతో బాధపడేవాళ్లు సాధారణంగా ఇలాంటి పోరాటాలు నడిపిస్తూ ఉంటారు. వీరిప్పుడు ఓబెరాయ్ గ్రూపు హోటల్ తిరుపతికి రావడానికి వీల్లేదని అంటున్నారు. ఆ హోటల్లో మద్యం, మాంసం, స్పా, స్విమ్మింగ్ పూల్ లాంటి విదేశీ సంస్కృతిని ప్రోత్సహించేవి ఉంటాయి గనుక.. ఆ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం రద్దు చేయాలనేది వీరి డిమాండు. సనాతన ధర్మ పరిరక్షణ ముసుగులో మరికొందరు కూడా వీరితో జతకలిసి గొంతెత్తుతున్నారు.

వీరి పోకడ చూస్తే ఆతిథ్యరంగంలో తిరుపతిని అసలు బతకనిచ్చేలా కనిపించడం లేదు. జగన్ హయాంలో మొదలైన ప్రాజెక్టు గనుక.. అనుమతులు రద్దయిపోవాలి అనే ఏడుపు తప్ప మరొకటి కనిపించడం లేదు. సనాతన ముసుగులో ఉన్న వీరందరూ శాకాహారులేనా, మద్యం ముట్టనివారేనా అంటే చెప్పలేం. తాము తింటారు, తాగుతారు.. కానీ తిరుపతిలో ఒక హోటల్ లో అలా జరగడానికి వీల్లేదని అంటారు.

ధర్మపరిరక్షణకు హద్దు ఎక్కడ ఉంటుంది. ఇవాళ మద్యం, మాంసం తిరుమలలో నిషేధం. అక్కడ అనుమతించరు. మంచిదే. తిరుపతిలోని హోటళ్లలో కూడా వద్దని అప్పుడప్పుడూ కొందరు అంటుంటారు. తిరుపతిలోని నివాసాల్లో కూడా నిషేధించాలని ముందుముందు గొంతెత్తరని గ్యారంటీ ఏమిటి? దీనికి లిమిట్ ఎక్కడ ఉంటుంది.

వచ్చే ప్రతి ప్రాజెక్టకు వ్యతిరేకంగా ఇలాంటి బూటకపు పోరాటాలు చేస్తూ ఉంటే.. అసలు ఆతిథ్యరంగంలో తిరుపతి విస్తరిస్తుందా? సూడో పోరాటాలతో జరుగుతున్నది ద్రోహం కాదా? అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి. నిజంగానే ధర్మ పరిరక్షణ అంటూ వారిలో చైతన్యం ఉంటే, వారి డిమాండులో సహేతుకత, న్యాయం ఉంటే కోర్టుకే వెళ్లడానికి అవకాశం ఉంటుంది. ప్రెస్ క్లబ్ కు వెళ్లి ప్రచారం కోసం పాకులాడ్డం కాదు- అని తిరుపతి ప్రజలు భావిస్తున్నారు.

6 Replies to “ఆతిథ్యరంగంలో తిరుపతిని ఎదగనివ్వరా?”

Comments are closed.