జ‌గ‌న్‌తో ఫ‌స్ట్ రివ్యూకే మంత్రి డుమ్మా

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త మంత్రి వ‌ర్గం కొలువుదీర‌డ‌మే ఆల‌స్యం, వెంట‌నే ప‌నిలోకి దిగింది. కొత్త కేబినెట్ ఏర్పాటైన త‌ర్వాత  మొట్ట‌మొద‌ట‌గా వైద్యారోగ్య‌శాఖ‌పై ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ స‌మీక్షించారు. ఈ స‌మావేశానికి కొత్త మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీ…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త మంత్రి వ‌ర్గం కొలువుదీర‌డ‌మే ఆల‌స్యం, వెంట‌నే ప‌నిలోకి దిగింది. కొత్త కేబినెట్ ఏర్పాటైన త‌ర్వాత  మొట్ట‌మొద‌ట‌గా వైద్యారోగ్య‌శాఖ‌పై ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ స‌మీక్షించారు. ఈ స‌మావేశానికి కొత్త మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా వైద్యారోగ్య చేప‌ట్టాల్సిన ప‌నులు, మంత్రిగా నిర్వ‌ర్తించాల్సిన విధుల‌పై జ‌గ‌న్ దిశానిర్దేశం చేశారు. రెండో రోజు బుధ‌వారం విద్యాశాఖ‌పై ముఖ్య‌మంత్రి రివ్యూ నిర్వ‌హించారు.

జ‌గ‌న్ చేప‌ట్టిన ఫ‌స్ట్ రివ్యూకే సంబంధిత శాఖ మంత్రి బొత్స స‌త్యనారాయ‌ణ హాజ‌రు కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. మంగ‌ళ‌వారం కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి విజ‌య‌వాడ దుర్గాదేవి అమ్మ‌వారిని సంద‌ర్శించుకున్నారు. కానీ మ‌రుస‌టి రోజు నిర్వ‌హించిన స‌మీక్ష స‌మావేశానికి మంత్రి గైర్హాజ‌రు కావ‌డం వార్త‌ల‌కెక్కింది.

ఇటీవ‌ల మంత్రివ‌ర్గ పునర్వ్య‌స్థీక‌ర‌ణ‌లో భాగంగా బొత్స‌కు విద్యాశాఖ కేటాయించారు. గ‌తంలో ఆయ‌న మున్సిప‌ల్‌శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఆ శాఖ‌ను ఆదిమూల‌పు సురేష్‌కు కేటాయించారు. గ‌తంలో ఆదిమూల‌పు సురేష్ నిర్వ‌హించిన విద్యాశాఖ‌ను బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు కేటాయించ‌డం విశేషం.

ఇదిలా వుండ‌గా విద్యాశాఖ‌పై సీఎం రివ్యూకు హాజ‌రు కాలేన‌ని ముఖ్య‌మంత్రి కార్యాల‌యానికి బొత్స స‌మాచారం అందించిన‌ట్టు తెలిసింది. త‌న సోద‌రుడి కుమార్తె వివాహ ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షించాల్సి వుండ‌డంతో బొత్స హాజ‌రు కాన‌ట్టు తెలిసింది. ఏపీ స‌ర్కార్ విద్యాశాఖ‌కు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. 

సీఎం జ‌గ‌న్ నేతృత్వంలో విద్యాశాఖ‌లో అనేక మార్పులు చేప‌ట్టారు. నాడు-నేడు పేరుతో విద్యాసంస్థ‌ల రూపురేఖ‌లే మార్చారు, మార్చుతున్నారు. ఆంగ్ల మాధ్య‌మం ప్ర‌వేశ పెట్టి గ్రామీణులు, పేద విద్యార్థుల‌కు ఇంగ్లీష్ చ‌దువు చెప్పేందుకు కీల‌క ముంద‌డుగు వేసింది. ఈ నేప‌థ్యంలో బొత్స విద్యాశాఖ‌లో విధుల నిర్వ‌హ‌ణ‌పై ఆస‌క్తి నెల‌కుంది.