తిరుమలకు భక్తులు పోటెత్తడం, దర్శనానికి ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో టీటీడీపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. జగన్ ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా, కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుని దర్శించుకోకుండా అడ్డు తగులుతోందని మరోసారి విమర్శలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో టీటీడీపై విమర్శలను అదనపు ఈవో ధర్మారెడ్డి ఖండించారు. టీటీడీ ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్లే భక్తులకు అనవసర ఇబ్బందులు తలెత్తాయనే వాదనను ఆయన తప్పు పట్టారు.
బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ భక్తుల కోసం ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. తిరుమలకు భారీగా భక్తులు వచ్చినా ఏం చేయాలన్న దానిపై చర్యలు తీసుకున్నామన్నారు. భక్తులు భారీగా వస్తారని ముందుగానే ఊహించామన్నారు. అందుకే ముందస్తుగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ధర్మారెడ్డి చెప్పుకొచ్చారు. టైమ్‌స్లాట్ వల్ల తిరుమలలో భక్తులకు త్వరగా దర్శన భాగ్యం కల్పించామన్నారు. ఈ నెల 9,10, 11 తేదీలకు ఒకేరోజు టోకెన్లు పంపిణీ చేశామన్నారు.
అయితే రెండు రోజుల గ్యాప్ తీసుకుని తిరిగి కౌంటర్లు తెరవాలని భావించామన్నారు. వారాంతాల్లో దర్శనానికి వచ్చే వారి భక్తుల సంఖ్య పెరిగిందన్నారు. రోజుకు 35 వేలు చొప్పున దర్శన టోకెన్లు పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ నేపథ్యంలో భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారని తెలిసి కౌంటర్లు మూసివేశామన్నారు. నేరుగా కౌంటర్ల వద్దకే బస్సులను పంపి తిరుమలకు చేర్చామన్నారు.
టోకెన్లు లేకున్నా నేరుగా దేవుని దర్శించుకునే భాగ్యాన్ని కల్పించామన్నారు. భక్తుల రాకను పసిగట్టే అన్నీ సిద్ధంగా ఉంచుకుని అరగంటలో సౌకర్యాలు కల్పించామన్నారు. పరిస్థితిని ఊహించి ఏర్పాట్లన్నీ సిద్ధం చేసిన తమపై విమర్శలు చేస్తారా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నట్టు ధర్మారెడ్డి తెలిపారు. టీటీడీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అనొద్దని ఆయన వేడుకున్నారు.