కమెడియన్ అంటే సినిమాలకే పరిమితం చేయడం అన్యాయమే. రెండు, రెండున్నర గంటల సినిమాకే కాసేపు నవ్వుకునేందుకు హాస్య నటుడు అవసరమైతే, ఇక జీవితం మాటేమిటి? రీల్ అయినా, రియల్ లైఫ్ అయినా హాస్యం తప్పనిసరి. కాసింత హాస్యం లేకపోతే, అదే వెలతి. సినిమాల్లో కంటే రాజకీయాల్లో కామెడీ పండించే వాళ్లు ఎక్కువవుతున్నారు.
అలాంటి వారి జాబితాలో అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాము నవ్వులపాలవుతూ ప్రజలను నవ్వించడంలో జేసీ బ్రదర్స్‌కు సాటి వచ్చే మరో పొలిటీషియన్ కనిపించరు. తాజాగా జేసీ ప్రభాకర్‌రెడ్డి తనదైన రీతిలో కామెడీ చేయడం విశేషం.
ఇటీవల నంద్యాలలో సీఎం జగన్ తన వెంట్రుక కూడా పీకలేరని ప్రతిపక్షాల్ని, ఎల్లో మీడియాధిపతులను ఉద్దేశించి అన్న సంగతి తెలిసిందే. దీనికి జేసీ ప్రభాకర్‌రెడ్డి వక్రభాష్యం చెప్పి ఔరా అనిపించారు. వెంట్రుక కూడా పీకలేరని జగన్ అన్నది వైసీపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి అని జేసీ ప్రభాకర్‌రెడ్డి చెప్పుకొచ్చారు. ప్రజలనో, మరొకరినో ఉద్దేశించి జగన్ పరుషంగా మాట్లాడ్డారని అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు.
ఇష్టం వచ్చినట్టు మంత్రివర్గం విస్తరణ చేసినా తననెవరూ ఏమీ చేయలేరనేది జగన్ వెంట్రుక పీకుడు భాషగా అర్థమని ఆయన అన్నారు. మంత్రి వర్గ విస్తరణలో తనదే వేదవాక్కు అని సొంత పార్టీ ఎమ్మెల్యేలకు చెప్పకనే చెప్పారన్నారు. కానీ విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు హాజరైన సభలో జగన్ అలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు.