పదేళ్ల క్రితం నాటి కేసుకు సంబంధించి మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై నాంపల్లి సెషన్స్ కోర్టు కొట్టి వేస్తూ, ఘాటు హితవు చెప్పింది. ఈ హిత హెచ్చరికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2012లో నిజామాబాద్, నిర్మల్‌లో మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలకు సంబంధించి నమోదైన కేసుల్లో ఇవాళ నాంపల్లి సెషన్స్ కోర్టు తీర్పునిచ్చింది.
విద్వేష ప్రసంగాలు చేసినట్టు ఆధారాలు చూపకపోవడంతో కేసులను కోర్టు కొట్టివేసింది. ఈ సందర్భంగా కేసులు కొట్టి వేయడాన్ని విజయంగా భావించి సంబరాలు చేసుకోవద్దని గట్టిగా హితవు చెప్పింది. 2012 డిసెంబర్ 8న నిజామాబాద్‌లో, అదే నెల 22న నిర్మల్‌లో హిందూ మతస్తులను రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారనే అభియోగంపై అక్బరుద్దీన్‌పై కేసు నమోదైంది.
నాడు ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి కఠిన చర్యలు చేపట్టారు. అక్బరుద్దీన్‌ను అరెస్ట్ చేయించి ఔరా అనిపించారు. దీనిపై 2013, జనవరి 2న నిర్మల్, నిజామాబాద్ పోలీసులు అక్బరుద్దీన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కోర్టు ఆదేశాలతో 40 రోజుల పాటు అక్బరుద్దీన్ జైల్లో ఉన్నారు.
2016లో సీఐడీ, నిర్మల్ పోలీసులు చార్జిషీట్లు వేశారు. చార్జిషీట్లో ఏ1గా అక్బరుద్దీన్, ఏ2గా యాయాఖాన్ను చేర్చారు. అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యల వీడియోలను ఫోరెన్సిస్ సైన్స్ ల్యాబోరేటరీ (సీఎఫ్ఎస్ఎల్)కి పంపారు. ఈ కేసును దశాబ్ద కాలం పాటు విచారించిన నాంపల్లి సెషన్స్ కోర్టు ఇవాళ తీర్పునిచ్చింది.
మతవిద్వేషాలను రెచ్చగొట్టినట్టు నిరూపించడంలో పోలీసులు విఫలమయ్యారని కోర్టు పేర్కొంది. వీడియోలను సాక్ష్యంగా పరిగణించలేమని పేర్కొంది. అయితే ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని పేర్కొంది. కేసుల కొట్టివేతను అక్బరుద్దీన్ విజయంగా భావించొద్దని కీలక వ్యాఖ్యలు చేసింది. ఎంతో కాలంగా ఉత్కంఠ రేపుతున్న కేసులో నాంపల్లి సెషన్స్ కోర్టు కీలక తీర్పు ఇవ్వడం విశేషం.