దేశ వ్యాప్తంగా ఎంపీలకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటా సీట్లను రద్దు చేయడం తీవ్ర చర్చ నీయాంశమైంది. దేశ వ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాల్లో 1 నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్స్‌కి డిమాండ్ ఉంది. సీబీఎస్ఈ సిలబస్ కావడం, తక్కువ ఫీజు లతో మెరుగైన విద్యను పొందే అవకాశం ఉండడంతో పిల్లల్ని కేంద్రీయ విద్యాలయాల్లో చదివించాలని తల్లిదండ్రులు కోరుకుంటారు.
లోక్‌సభ, రాజ్యసభ్యులకు ఒక్కొక్కరికి పది చొప్పున సీట్లు కేటాయించారు. తమ పార్లమెంట్ పరిధిలోని కేంద్రీయ విద్యాలయాల్లో సీట్లను కేటాయించేందుకు గత ఏడాది వరకూ అవకాశం ఉండింది. ప్రస్తుతం కేంద్రీయ విద్యాలయాల్లో 2022-23 అకడమిక్ ఇయర్ ఈ నెల మొదటి తారీఖు నుంచి ప్రారంభమైంది. ఇప్పటికే ఫస్ట్ క్లాస్ అడ్మిషన్లు పూర్తయ్యాయి. ఇక ఎంపీల కోటా కింద అడ్మిషన్ల ప్రక్రియ జరగాల్సి వుంది. ఈ నేపథ్యంలో ఏకంగా ఎంపీల హక్కుని హరించేలా వారి కోటాను రద్దు చేయడంపై ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మొదట ప్రతి ఎంపీకి రెండేసి చొప్పున సీట్లు కేటాయించే అవకాశం ఉండేది. ఆ తర్వాత ఎంపీలు డిమాండ్ చేయడంతో ఆరు సీట్లకు పెంచారు. అయినప్పటికీ తల్లిదండ్రుల నుంచి వస్తున్న డిమాండ్లు, ఒత్తిడి మేరకు మరిన్ని పెంచాలని ఎంపీలు కోరడంతో ఆ సంఖ్యను పదికి పెంచారు.
ఈ నేపథ్యంలో ఇటీవల ఉత్తరాదికి చెందిన ఓ ఎంపీ లోక్‌సభలో మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల కోటా సీట్లకు డిమాండ్ పెరిగిందని, మరిన్న పెంచాలని కోరారు. ఒకవేళ పెంచలేని పక్షంలో అసలుకే ఎత్తేయాలని కోరడం గమనార్హం.
ఎంపీ డిమాండ్‌పై స్పీకర్ స్పందిస్తూ … అయితే ఎంపీ కోటానే ఎత్తేయాలని ప్రభుత్వానికి సూచించారు. చివరికి స్పీకర్ సూచననే మానవ వనరుల అభివృద్ధిశాఖ అమలు చేసింది. కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటాను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఎంపీలు మండిపడుతున్నారు. ఎవరో ఒకరిద్దరి డిమాండ్లను పరిగణలోకి తీసుకుని దేశ వ్యాప్తంగా అత్యున్నత చట్టసభల ప్రజాప్రతినిధులను అగౌరవపరచడం న్యాయమా? అని ప్రశ్నిస్తున్నారు.