ఏపీ మంత్రివర్గం పునర్వ్యస్థీకరణ నేపథ్యంలో… తమకు చోటు దక్కక, అసహనానికి, అసంతృప్తికి గురి అయిన పలువురు నేతలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నుంచి ఓదార్పు దక్కుతోంది. తాజా పునర్వ్యస్థీకరణలో తమకు చోటు దక్కుతుందని చాలా మంది నేతలే ఆశించారు. వారిలో కొందరికి మంత్రి పదవులు దక్కాయి కానీ, మరి కొందరికి మాత్రం నిరాశే మిగిలింది.
ఇలాంటి నిరాశవాదుల్లో.. మంత్రి పదవిని కోల్పోయిన వారు కూడా ఉన్నారు. హోం మంత్రిత్వ శాఖ హోదా నుంచి .. మాజీ మంత్రి అయిన మేకతోటి సుచరిత, మరో సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్లు తీవ్రంగా అసంతృప్తికి గురైనట్టుగా మొదట వార్తలు వచ్చాయి. వీరు జగన్ మీద గరం అవుతున్నారని, రాజీనామాలే అని కూడా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా హడావుడి చేసింది. అయితే.. సదరు నేతలు చల్లారారు.
తను వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడిని అంటూ బాలినేని తన తెల్లజెండాను చూపించేశారు. ఇక ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం మేకతోటి సుచరిత పూర్తిగా సానుకూలంగా స్పందించారు. ఏకంగా ఎమ్మెల్యే పదవికే రాజీనామా ఇచ్చిందనే వార్తల్లో నిలిచిన సుచరిత, చివరకు అదో కృతజ్ఞత లేఖ అని పేర్కొన్నారు.
ఇక మంత్రి పదవిని ఆశించి పొందలేకపోయిన వారికి కూడా జగన్ ఓదార్పు దక్కుతోంది. వీరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కాపు రామచంద్రారెడ్డి, గొర్ల బాబూ రావు వంటి వారు ఉన్నారు. సీఎంతో సమావేశం అనంతరం.. వీరిలో కొందరికి భవిష్యత్తులో అవకాశం అనే భరోసా దక్కిందట. దీంతో వీరు చల్లారినట్టుగా సమాచారం. మొత్తానికి అలిగిన వారికి ముఖ్యమంత్రితో సమావేశం, భవిష్యత్ పై భరోసా మాత్రం లభిస్తున్నట్టుగా ఉంది!