కొత్త మంత్రుల సంబ‌రాలు ఇలా..!

ఏపీ మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ నేప‌థ్యంలో.. కేబినెట్ లో చోటు ద‌క్కిన వారు ఫుల్ జోష్ తో క‌నిపిస్తూ ఉన్నారు. పార్టీ అధికారంలోకి వ‌చ్చిన దాదాపు మూడేళ్ల త‌ర్వాత మంత్రి హోదాను పొందిన వారు, ఇప్పుడు…

ఏపీ మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ నేప‌థ్యంలో.. కేబినెట్ లో చోటు ద‌క్కిన వారు ఫుల్ జోష్ తో క‌నిపిస్తూ ఉన్నారు. పార్టీ అధికారంలోకి వ‌చ్చిన దాదాపు మూడేళ్ల త‌ర్వాత మంత్రి హోదాను పొందిన వారు, ఇప్పుడు ఆ ఆనందాన్ని సంబ‌రంగా జ‌రుపుకునే ప‌నిలో ఉన్న‌ట్టున్నారు.

ప్ర‌త్యేకించి వీరు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై అపార‌మైన కృత‌జ్ఞ‌త‌ను చూపుతున్నారు. త‌మ స‌కుటుంబ స‌ప‌రివార స‌మేతంగా వీరంతా ముఖ్య‌మంత్రిని క‌లిసి థ్యాంక్సులు చెబుతున్నారు. ప‌నిలో ప‌నిగా సీఎంతో కుటుంబ స‌మేతంగా ఫొటోలు దిగి సోష‌ల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

ఇక సీఎంతో స‌మావేశాల అనంత‌రం.. వీరు డైరెక్టుగా సొంత నియోజ‌క‌వ‌ర్గాల బాట ప‌డుతున్నారు. అక్క‌డ అనుచ‌ర‌వ‌ర్గాలు వీరికి హార‌తులు ప‌డుతున్నాయి. మంత్రులుగా సొంత నియోజ‌క‌వ‌ర్గంలోకి వ‌చ్చిన వైనాన్ని వీరు అలా హ‌డావుడిగా సెల‌బ్రేట్ చేసుకున్నారు.

కొత్త మంత్రుల్లో అంబ‌టి రాంబాబు మాత్రం కాస్త భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మంత్రి ప‌ద‌వి ద‌క్క‌గానే ఆయ‌న డైరెక్టుగా ఇడుపుల‌పాయ‌కు వెళ్ల‌డం గ‌మ‌నార్హం. ఇడుపాల‌య‌లో వైఎస్ స‌మాధి వ‌ద్ద నివాళి ఘ‌టించి.. తన‌కు ద‌క్కిన అవ‌కాశం ప‌ట్ల అంబ‌టి కృత‌జ్ఞ‌త వెళిబుచ్చారు. వైఎస్ రాజ‌శేఖర‌ రెడ్డి అనుచ‌రుడిగా రాజ‌కీయాల్లో గుర్తింపు ద‌క్కించుకున్న త‌న‌ను ఆయ‌న త‌న‌యుడు మంత్రిని చేయ‌డం ప‌ట్ల అంబ‌టి ఉద్విగ్నుడ‌య్యాడు. వైఎస్ కు ఆశృనివాళి ఘ‌టించారు అంబ‌టి రాంబాబు.

మొత్తానికి కొత్త మంత్రులు త‌మ త‌మ ఆనందాన్ని అయిన‌వారితోనూ, అనుచ‌రుల‌తో క‌లిసి పంచుకునే ప‌నిలో ఉన్నారింకా.