లంక పతనావస్థలో ఉంది. ఆర్థికంగా చితికిపోయిన రాజ్యంలో ప్రజలు అల్లాడుతున్నారు. తమకు కాస్త డబ్బులు పంపమని ప్రపంచ దేశాలను లంక ప్రజలు డైరెక్టుగా వేడుకుంటున్నారు! ఇండియా ఇప్పటికే లంకకు ఓ మోస్తరు సాయం చేసింది. మరో రెండు బిలియన్ డాలర్ల మొత్తాన్ని లంక ప్రభుత్వ ఖాతాలో వేసేందుకు భారత ప్రభుత్వం సంసిద్ధంగా ఉందట. అలాగే భారీ ఎత్తున బియ్యాన్ని శ్రీలంకకు ఇచ్చేందుకు కూడా భారత ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేస్తోంది.
తీవ్ర సంక్షోభ సమయంలో లంకను ఆదుకుని.. చైనా మత్తును లంకపై కాస్తో కూస్తో తగ్గించాలనేది కూడా భారత ప్రభుత్వ ఉద్దేశం కావొచ్చు. ఆ సంగతలా ఉంటే.. ఇప్పుడు శ్రీలంక ఆర్థికంగా పూర్తిగా పతనం అయ్యిందంటే, కొన్నేళ్ల కిందట అది పతనం అంచున ఉన్నట్టు.
ఇప్పుడు శ్రీలంక పరిస్థితిని గమనిస్తే.. అక్కడి పరిస్థితి గురించి వస్తున్న వరస కథనాలను వింటుంటే.. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి శ్రీలంక సాయం ఏదో చేస్తుందని, ఏవో మాస్టర్ ప్లాన్లూ గట్రా ఇస్తుందంటూ తెలుగుదేశం అధినేత, నాటి సీఎం చంద్రబాబు నాయుడు ఆయన అనుకూల మీడియా చేసిన హడావుడి పదే పదే గుర్తుకు రాక మానదు!
ప్రపంచ దేశాల పేర్లు చెబుతూ.. ఏపీ ప్రజల కళ్లకు గంతలు కట్టే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు అలా శ్రీలంక ప్రస్తావనను కూడా వదల్లేదు. సింగపూర్ అని, చైనా అని, లండన్ అని, మలేసియా అని కథలు అల్లడంతో పాటు.. ఆఖరికి శ్రీలంకను కూడా వదల్లేదు!
అయితే అప్పట్లో కామెడీలు అంతటితో కూడా ఆగిపోలేదు. శ్రీలంకలో చంద్రబాబుకు అపారమైన ప్రాధాన్యత అని, దేశాల ప్రధానులకు అందే తరహా స్వాగతం అని, అది అర్రీబుర్రీ యవ్వారం కాదని కూడా.. పచ్చ బ్యాచ్ కథలల్లింది.
మరి తను అధికారంలో ఉన్నప్పుడు అలా శ్రీలంకను ఎడాపెడా వాడుకున్న చంద్రబాబు, ఇప్పుడు శ్రీలంక ఆర్థిక పతనావస్థ గురించి కామెంట్లు చేస్తూ ఉన్నారు! మరి లంక నేతలతో రాసుకుపూసుకు తిరిగినప్పుడు ఈ పరిస్థితిని ఊహించలేకపోయారా.. కటకటా!