చాన్నాళ్లుగా టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా నలుగుతోంది రామ్-బోయపాటి సినిమా. ఎట్టకేలకు ఈ సినిమాకు టైటిల్ ఎనౌన్స్ చేశారు. ఈ మూవీకి స్కంద అనే టైటిల్ పెడుతున్నారనే విషయాన్ని గ్రేట్ ఆంధ్ర గతంలోనే వెల్లడించింది. ఇప్పుడు అదే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ, టైటిల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.
ఇంతకుముందు రిలీజ్ చేసిన గ్లింప్స్ టైపులోనే, ఈ వీడియో కూడా పూర్తిగా బోయపాటి మార్కులో సాగింది. హీరో ను చంపేందుకు విలన్ గ్యాంగ్ కొలనులో దిగుతుంది. కత్తి పట్టి వాళ్లను సంహరిస్తాడు విలన్. “మీరు దిగితే ఊడేదుండదు.. నేను దిగితే మిగిలేదుండదు” అనే పవర్ ఫుల్ డైలాగ్ కూడా పెట్టారు.
టైటిల్ బట్టి చూసుకుంటే.. ఈ సినిమా కథకు, సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయానికి సంబంధం ఉన్నట్టు కనిపిస్తోంది. 'ది ఎటాకర్' అనేది ట్యాగ్ లైన్.
ప్రతి దర్శకుడితో మంచి కాంబినేషన్ సెట్ చేసుకున్న తమన్.. బోయపాటితో మరోసారి అఖండ మేజిక్ రిపీట్ చేసేలా ఉన్నాడు. గ్లింప్స్ కు తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.
శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను సెప్టెంబర్ 15న విడుదల చేయబోతున్నట్టు మరోసారి ప్రకటించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మించాడు. జీ స్టుడియోస్ సహ-నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా సౌత్ శాటిలైట్ రైట్స్ ను స్టార్ మా గ్రూప్ దక్కించుకోవడం విశేషం.